ఇంటింటికీ బీజేపీ.. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో దూకుడు | Sakshi
Sakshi News home page

ఇంటింటికీ బీజేపీ.. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో దూకుడు

Published Wed, Apr 10 2024 4:51 AM

BJP increasing aggressiveness in Lok Sabha election campaign - Sakshi

14 నుంచి ఓటర్ల ఇళ్ల వద్ద్ద పార్టీ ప్రచారం 

18న ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేలోగా మొదటి విడత పూర్తి 

ప్రతి కుటుంబాన్ని మొత్తం మూడుసార్లు కలిసేలా ప్రణాళిక 

అగ్రనేతల పర్యటన సందర్భంగా మాత్రమే పెద్ద బహిరంగ సభలు 

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచుతోంది. దేశంలో మూడో విడత పార్లమెంట్‌ ఎన్నికల కోసం ఈ నెల 18న ఈసీ నోటిఫికేషన్‌ జారీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ వెలువడేలోగా రాష్ట్రంలో తొలివిడత ‘ఓటర్స్‌ ఔట్‌ రీచ్‌’పూర్తిచేయాలని పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమం కింద ఈ నెల 14 నుంచి ‘ఇంటింటికీ బీజేపీ’పేరిట ఓటర్లను వారి ఇళ్ల వద్దే పార్టీ కార్యకర్తలు కలుసుకోనున్నారు. 17వ తేదీలోగా రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్ల పరిధిలోని ప్రతి పోలింగ్‌ బూత్‌లోని ప్రతి ఇంటికీ వెళ్లనున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసే (మే 11)లోగా ప్రతి కుటుంబాన్ని మొత్తంగా మూడుసార్లు కలిసి మద్దతు కోరాలని బీజేపీ భావిస్తోంది.  

ప్రతి ఇంటి తలుపు తట్టేలా.. 
తొలి విడత లక్ష్యంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని పోలింగ్‌ బూత్‌ కేంద్రాల్లో విస్తృత స్థాయి ప్రచారాన్ని బీజేపీ చేపట్టనుంది. ప్రతి ఇంటి తలుపు తట్టి, ఆ కుటుంబ సభ్యులను కలుసుకుని ఈసారి బీజేపీకి ఓటేయాలని కోరనుంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ కరపత్రం, ప్రచారానికి సంబంధించిన స్టిక్కర్, పార్టీ జెండా, ఓటర్లకు ఎంపీ అభ్యర్థి విజ్ఞప్తి పత్రం (అప్పీల్‌) వంటివి వారికి అందించనున్నారు. ఈ ప్రచార ప్రక్రియకు సంబంధించిన మొత్తం మెటీరియల్‌ ఇప్పటికే సిద్ధమై పార్టీ యంత్రాంగానికి అందుబాటులోకి తెచ్చినట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. 

మూడురోజులు సన్నాహక సమావేశాలు 
పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లడానికి ముందు ఈ నెల 11, 12, 13 తేదీల్లో మండల స్థాయిలో దీనికి సంబంధించిన సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. వీటికి సమాంతరంగా ఈ నెల 15వ తేదీలోగా 17 ఎంపీ నియోజకవర్గాల్లో పార్లమెంట్‌ సమ్మేళనాలు పూర్తి చేయనున్నారు. వీటిల్లో పోలింగ్‌ బూత్‌ల కోఆర్డినేటర్లు మొదలు రాష్ట్రస్థాయి వరకు నాయకులు పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే చేవెళ్ల, తదితర చోట్ల ఈ సమ్మేళనాలు పూర్తికాగా, 15 వరకు మిగతా పార్లమెంట్‌ సీట్ల పరిధిలో నిర్వహించనున్నారు. 

ప్రత్యేక ‘కాస్ట్‌ ఔట్‌ రీచ్‌’ప్రోగ్రామ్‌ 
వివిధ సామాజిక వర్గాలను కలుసుకునేందుకు ప్రత్యేకంగా ‘కాస్ట్‌ ఔట్‌ రీచ్‌’కార్యక్రమాన్ని కూడా బీజేపీ చేపట్టనుంది. జిల్లాలు, పార్లమెంట్‌ నియోజకవర్గాలు, అసెంబ్లీల స్థాయిల్లో వివిధ కుల సంఘాలతో సమ్మేళనాలు, యువత, మహిళ, రైతులు, ఎస్సీలు, ఎస్టీలు ఇలా వివిధ వర్గాల వారితో ఎక్కడికక్కడ వేర్వేరుగా సమావేశాలు నిర్వహించాలని నాయకత్వం నిర్ణయించింది.  

నామినేషన్ల సమయంలో ర్యాలీలు 
ఈ నెల 25న రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ ముగిసేలోగా వివిధ రూపాల్లో ప్రచార కార్యక్రమాల వేగం పెంచనున్నారు. 18వ తేదీ తర్వాత లోక్‌సభ ఎంపీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు సందర్భంగా ర్యాలీలు నిర్వహించనున్నారు. ఈ నెల 25వ తేదీ తర్వాత మే 13వ తేదీ పోలింగ్‌ వరకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా వంటి అగ్రనేతల పర్యటనల సందర్భంగా మాత్రమే పెద్ద బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించారు. మిగతా ఎన్నికల ప్రచారమంతా ఇంటింటికీ వెళ్లడం, కార్నర్‌ మీటింగ్‌లు లాంటి స్వయంగా ఓటర్లను కలుసుకునే ‘ఓటర్‌ ఔటర్‌ రీచ్‌’కార్యక్రమాలకే నాయకత్వం ప్రాధాన్యతనివ్వనుంది.    

Advertisement
 
Advertisement