Sakshi News home page

చరిత్రను తప్పుగా చిత్రీకరిస్తే ప్రజలే బుద్ధి చెబుతారు 

Published Mon, Sep 18 2023 5:20 AM

BJP Leader Amit Shah On Telangana History - Sakshi

దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 399 రోజుల వరకు హైదరాబాద్‌ స్టేట్‌లో రజాకార్ల అరాచకం సాగింది. వీటి నుంచి విముక్తికి సర్దార్‌ పటేల్‌ 1948 ఆగస్టు 10న సంకల్పించి సెప్టెంబర్‌ 17 నాటికి మిషన్‌ పూర్తిచేశారు  
–అమిత్‌ షా

సాక్షి, హైదరాబాద్‌: సంతుష్టీకరణ రాజకీయాల కోసం వాస్తవాలను మరుగున పడేస్తే చరిత్రే ఉండదని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు. తెలంగాణ చరిత్రను తప్పుగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్న వారికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. హైదరాబాద్‌ స్టేట్‌కు స్వాతంత్య్రం రాకుండా స్వతంత్ర రాజ్యంగా ఉంటే.. భారతమాత కడుపులో కేన్సర్‌ ఉన్నట్లేనని గుర్తించిన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఈ ప్రాంతానికి రజాకార్ల నుంచి విముక్తి కల్పించేందుకు ‘ఆపరేషన్‌ పోలో’కు నడుం బిగించారన్నారు.

రక్తం చుక్క చిందకుండానే.. నిజాం మెడలు వంచి హైదరాబాద్‌ స్టేట్‌కు స్వాతంత్య్రం ఇప్పించారన్నారు. కేఎం మున్షీ నేతృత్వంలో, పటేల్‌ ఆదేశాలతో ఈ ఆపరేషన్‌ జరిగిందని చెబుతూ వారికి నివాళులు అర్పిస్తున్నామన్నారు. పటేల్‌ కృషి లేకపోతే భారత్‌లో హైదరాబాద్‌ స్టేట్‌తో సహా వందలాది సంస్థానాల విలీనం ఆలస్యమై ఉండేదన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణతోపాటు కల్యాణ కర్ణాటక, మరాఠా మహారాష్ట్ర ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా రాజకీయాల కారణంగా విమోచన దినోత్సవా న్ని అధికారికంగా నిర్వహించకపోవడం సరికాదని చెప్పారు. ఆదివారం సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో 75వ హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని అమిత్‌షా జాతీయజెండాను ఎగురవేశారు. సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్‌ తదితర కేంద్ర బలగాల నుంచి పోలీసు వందనాన్ని స్వీకరించారు.   

రావి, ఎల్లారెడ్డి పేర్ల ప్రస్తావన 
హైదరాబాద్‌ స్టేట్‌ విమోచన కోసం పోరాడి, ఎన్నో త్యాగాలు చేసిన స్వామి రామానందతీర్థ, బూర్గుల రామకృష్ణారావు, కేశవ్‌రావు కోరట్కర్, రావి నారాయణరెడ్డి, బద్ధం ఎల్లారెడ్డి, కాళోజి నారాయణరావు, మర్రి చెన్నారెడ్డి, పీవీ నర్సింహారావు వంటి వీరులకు శిరస్సు వంచి అంజలి ఘటిస్తున్నామని అమిత్‌ షా చెప్పారు. ఈ పోరాటంలో లక్షలాది మంది పాల్గొన్నారని, వేలాది మంది అసువులు బాసారన్నారు.

ఈ ఉద్యమంలో ఆర్యసమాజ్, హిందూ మహాసభ వంటి ఎన్నో సంస్థలు పనిచేశాయని.. ఉస్మానియా యూనివర్సిటీలో వందేమాతర నినాదంతో నిజాం గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని అమిత్‌ షా పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 399 రోజుల వరకు హైదరాబాద్‌ స్టేట్‌లో రజాకార్ల అరాచకం సాగిందన్నారు. జాతీయ జెండాను ఎగురవేసినందుకు పరకాలలో 1,500 మంది జలియన్‌ వాలాబాగ్‌ తరహాలో కాల్పులు జరిపారని, ఇందులో పలువురు అమరులవగా.. మరికొందరు గాయపడ్డారని అమిత్‌ షా గుర్తుచేశారు.

ఇదే తరహాలో మహారాష్ట్రలోని పర్భణిలో, కర్ణాటకలోని బీదర్‌లోనూ సామాన్యులపై కాల్పులు జరిగాయన్నారు. వీటి నుంచి విముక్తి కల్పించేందుకు పటేల్‌ 1948 ఆగస్టు 10న సంకల్పించి సెప్టెంబర్‌ 17 నాటికి మిషన్‌ పూర్తిచేశారని వివరించారు. 75 ఏళ్ల వరకు దేశంలోని ఏ ప్రభుత్వం కూడా.. యువతకు తెలంగాణ స్వాతంత్య్ర పోరాటం గురించి చెప్పేందుకు ప్రయత్నించలేదన్నారు.

హైదరాబాద్‌ విమోచన కోసం పోరాడిన అమరులకు శ్రద్ధాంజలి, యువత, విద్యార్థుల్లో దేశభక్తి పెంపు, రాష్ట్రానికి పునరంకితం కావాలనే మూడు ప్రధాన లక్ష్యాల సాధన కోసం ప్రధాని మోదీ చొరవతో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. మన పూర్వీకులు కలలుగన్న తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. 
 
మోదీకి జన్మదిన శుభాకాంక్షలు 
ప్రపంచవ్యాప్తంగా దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసేలా ప్రధాని మోదీ కృషిచేస్తున్నారని అమిత్‌ షా చెప్పారు. దీని ఫలితంగానే నేడు దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే ఐదో స్థానానికి చేరిందని, జీ20 ద్వారా భారత సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి మరోసారి చాటామన్నారు. జీ 20ని జీ 21గా చేసిన ఘనత కూడా మోదీకే దక్కుతుందని వివరించారు. చంద్రయాన్‌–3 విజయవంతంతో ›ప్రపంచం దృష్టిని భారత్‌ ఆకర్షిస్తోందన్నారు. నేడు ప్రపంచమంతా భారత్‌ సాధిస్తున్న ప్రగతిని ప్రశంసిస్తోందని చెప్పారు. ఆదివారం మోదీ జన్మదినం సందర్భంగా సభావేదికపై నుంచి అమిత్‌షా శుభాకాంక్షలు తెలిపారు.   

Advertisement

What’s your opinion

Advertisement