నిరుద్యోగులకు వెన్నుపోటు | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులకు వెన్నుపోటు

Published Thu, Sep 14 2023 1:12 AM

BJP Leader Kishan Reddy Fires On CM KCR - Sakshi

తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న వందల మంది యువకుల కుటుంబాలు నేడు రోడ్డున పడ్డాయి. ఇదే ధర్నా చౌక్‌లో ఏళ్ల తరబడి నిరుద్యోగులు పోరాటం చేశారు. తెలంగాణ వస్తే తమకు ఉద్యోగాలు వస్తాయనుకుంటే వారికి ఎదురుచూపులే మిగిలాయి.

సాక్షి, హైదరాబాద్‌/ ముషీరాబాద్‌: నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగభృతి ఏమైందో సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. నిరుద్యోగ భృతి వస్తుందేమోనని లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తుంటే కేసీఆర్‌ వారికి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఏళ్ల తరబడి ఉద్యోగాలకు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్లు ఇవ్వకుండా, కోర్టు కేసుల పేరిట నిరుద్యోగులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని అన్నారు. కొన్ని పరీక్షలు నిర్వహించినా ప్రభుత్వ పెద్దల అవినీతి, కేసీఆర్‌ చేతకానితనం వల్ల ప్రశ్నపత్రాలు లీకై లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్‌ ఆగమైందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పాపం ఎవరిదో కేసీఆర్‌ చెప్పాలన్నారు. 35 లక్షల మంది యువత అప్పులు చేసి లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్‌ తీసుకుంటే వారిని గాలికొదిలేశారని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల పాలనలో నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగులు తినడానికి తిండి లేని స్థితిలో ఉన్నారని, వారికి సంఘీభావంగా బీజేపీ దీక్ష చేస్తోందని తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన 24 గంటల ఉపవాస దీక్షను కిషన్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. 

బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాల భర్తీ 
‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని ముందు పెట్టి, కాంగ్రెస్‌ పార్టీకి సాయం చేస్తూ బీఆర్‌ఎస్‌ను గెలిపించే ప్రయత్నం కేసీఆర్‌ చేస్తున్నారు. కానీ తెలంగాణ ఉద్యమంలో వీరోచితంగా పోరాడిన యువకులు నేడు కళ్లు తెరిచారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను పాతరేస్తారు. నిరుద్యోగ యువతకు తెలుసు. కాంగ్రెస్‌ హయాంలో ఎలాంటి అన్యాయం జరిగిందనేది. కాబట్టి ఈ రెండు పార్టీలను యువత క్షమించదు. కచ్చితంగా బుద్ధి చెబుతారు. ఈ ధర్నా చౌక్‌ నుంచి తెలంగాణ ప్రజలకు చెబుతున్నా. బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. నిరుద్యోగులు, యువత బీజేపీకి మద్దతు తెలిపాలి..’ అని కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.  

జమిలి అంటే జంకెందుకు?: బండి 
జమిలి ఎన్నికలంటే కేసీఆర్‌ కుటుంబానికి అంత జంకెందుకని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో మోదీ చరిష్మా సునామీలో కేసీఆర్‌ కొట్టుకు పోవడం ఖాయమన్నారు. దేశద్రోహుల పార్టీని సంతృప్తి పరిచేందుకే కేసీఆర్‌ జాతీయ సమైక్యతా రాగం అందుకున్నారని విమర్శించారు. తెలంగాణలో 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదన్నారు. శ్రీకాంతాచారి, ఇషాంత్‌ రెడ్డి, సుమన్, పోలీస్‌ కిష్టయ్యవంటి యువకుల బలిదానాలను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో కేసీఆర్‌ సర్కార్‌ను గద్దె దించేదాకా పోరాడుదామని యువతకు సంజయ్‌ పిలుపునిచ్చారు. 

నవంబర్‌తో తెలంగాణకు పట్టిన మకిలి వీడుతుంది: తరుణ్‌ఛుగ్‌ 
ఉద్యమ సమయంలో నిరుద్యోగ యువతను సెంటిమెంట్‌తో రెచ్చగొట్టి 1200 మంది యువత ప్రాణాలు కల్వకుంట్ల కుటుంబం బలిగొన్నదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ఆంధ్రా పాలకులే ఉద్యోగాలు దోచుకుంటున్నారని  చెప్పిన కేసీఆర్‌.. తాను అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నాడని విమర్శించారు. ఈ నవంబర్‌తో తెలంగాణకు పట్టిన కేసీఆర్‌ అనే మకిలి వీడుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ ఛుగ్‌ వ్యాఖ్యానించారు.  

‘కేసీఆర్‌..నువ్వు ఇస్తానని చెప్పిన డబుల్‌ ఇండ్లు ఏవి? దళిత బంధు ఏది? ఎందరికి ఇచ్చావు?’ అంటూ నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ కుటుంబాన్ని పారదోలాలని పిలుపునిచ్చారు. పార్టీ నేతలు మురళీధర్‌రావు, జి.విజయరామారావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, చింతల రామచంద్రారెడ్డి, డి.ప్రదీప్‌కుమార్, డా.జి.మనోహర్‌రెడ్డి, శాంతికుమార్, గీతామూర్తి, గూడూరు నారాయణరెడ్డి, నాగూరావు నామాజీ, బండ కార్తీకరెడ్డి, డా.గౌతంరావు, శ్యాంసుందర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement