BJP Leaders Condemned Bandi Sanjay Arrest - Sakshi
Sakshi News home page

బండి సంజయ్‌ అరెస్ట్‌.. బొమ్మలరామారం పీఎస్‌ వద్ద హైటెన్షన్‌!

Published Wed, Apr 5 2023 8:38 AM

BJP Leaders Condemned Bandi Sanjay Arrest - Sakshi

సాక్షి, బొమ్మలరామారం: తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ను పోలీసులు మంగళవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే, తన అరెస్ట్‌కు కారణం చెప్పాలని, వారెంట్‌ చూపించాలని బండి సంజయ్‌.. పోలీసులను ప్రశ్నించడంతో వారి మధ్య వాగ్వాదం పెరిగింది. అనంతరం, జరిగిన పరిణామాలతో సంజయ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాగా, టెన్త్‌ పేపర్ల లీకేజీకి సంబంధించి ప్రెస్‌మీట్‌ పెట్టనున్న నేపథ్యంలో సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సీఆర్‌పీసీ 151 కింద బండి సంజయ్‌ను ముందస్తుగా అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు తెలిపారు. అనంతరం, సంజయ్‌ను బొమ్మలరామారం పీఎస్‌కు తరలించారు. 

ఇక, బండి సంజయ్‌ అరెస్ట్‌ నేపథ్యంలో పీఎస్‌ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పీఎస్‌కు బీజేపీ నాయకులు, శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. దీంతో, పీఎస్‌ ఎదుట పోలీసులు భారీగా మోహరించారు. కాగా, బీజేపీ శ్రేణులు స్టేషన్‌ లోపలకు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పీఎస్‌ ఎదుట కర్రలు వేసి బీజేపీ కార్యకర్తలు దగ్దం చేశారు. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

ఇదిలా ఉండగా, బండి సంజయ్‌ అరెస్ట్‌ను బీజేపీ జాతీయ నాయకత్వం, స్థానిక నేతలు ఖండించారు.

- ఈ నేపథ్యంలో బీఎల్‌ సంతోష్‌ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ పార్టీ అవినీతిలో కూరుకుపోయింది. రాజకీయంగా బీఆర్‌ఎస్‌ సమాధి అయ్యే రోజులు దగ్గరపడ్డాయి. కేసీఆర్‌కు పాలన చేతగాక సంజయ్‌ను అరెస్ట్‌ చేయించారు. బీఆర్‌ఎస్‌ మునిగిపోయే నావ అని ఘాటు కామెంట్స్‌ చేశారు. 

- కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. సంజయ్‌ అరెస్ట్‌ను ఖండిస్తున్నాం. కారణం లేకుండా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం. తెలంగాణలో అరాచక పాలన నడుస్తోంది అంటూ తీవ్ర విమర్శలు చేశారు. 

- డీకే అరుణ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ పార్టీకి కాలం చెల్లింది. ప్రజలు తర్వలోనే బీఆర్‌ఎస్‌ను బొందపెడతారు. అకారణంగా సంజయ్‌ను అరెస్ట్‌ చేయడం సిగ్గుమాలిన చర్య. బండి సంజయ్‌ను వెంటనే విడుదల చేయాలి. 

- ఈటల రాజేందర్‌ స్పందిస్తూ.. కారణం చెప్పకుండా సంజయ్‌ను అరెస్ట్‌ చేయడం దారుణం. కేసీఆర్‌ చెప్పినట్టు వింటూ పోలీసులు వెన్నముక లేకుండా వ్యవహరిస్తున్నారు. బండి సంజయ్‌ను వెంటనే విడుదల చేయాలి.

- బీజేపీ సస్పెండెడ్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మాట్లాడుతూ.. బండి సంజయ్‌ అరెస్ట్‌ను ఖండిస్తున్నాను. అరెస్ట్‌లకు సంజయ్‌ భయపడరు. ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపినందుకే అరెస్ట్‌ చేశారు. ఆయన్ను జైలులో పెడితే ప్రభుత్వ తప్పులు బయటకిరావు అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.

- బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు.. బండి సంజయ్‌ను కలిసేందుకు బొమ్మలరామారం పీఎస్‌ వెళ్లారు. దీంతో, ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం, రఘునందన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా అక్కడి నుంచి నేతలందరూ వెళ్లిపోవాలని పోలీసులు చెబుతున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement