గజ్వేల్‌కు నేను కొత్త కాదు.. ఈటల ఎమోషనల్‌ కామెంట్స్‌! | Sakshi
Sakshi News home page

గజ్వేల్‌కు నేను కొత్త కాదు.. ఈటల ఎమోషనల్‌ కామెంట్స్‌!

Published Thu, Oct 26 2023 5:09 PM

BJP MLA Etela Rajender Emotional Comments Over Gajwel - Sakshi

సాక్షి, గజ్వేల్‌: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పొలిటికల్‌ లీడర్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పార్టీలనే కాకుండా ఒకరినొకరు టార్గెట్‌ చేసుకుంటూ తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక, హుజురాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. గజ్వేల్‌లో ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం లాంటివి అని అన్నారు. 

అయితే, ఈటల రాజేందర్‌ గురువారం వర్గల్ సరస్వతీదేవి ఆలయంలో ఆయన పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో జరిగిందే ఇప్పుడు గజ్వేల్‌లోనూ జరుగుతుంది. గజ్వేల్‌లో ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం లాంటివి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయం. బీఆర్ఎస్ ఎన్ని కుయుక్తులు, కుట్రలు చేసినా గెలిచేది బీజేపీ పార్టీనే. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రానుంది. గజ్వేల్‌లో ఏ పార్టీ అయినా సమావేశాలు పెట్టుకోవచ్చునని, కానీ బీజేపీ సమావేశాలకు ప్రజలు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

డబ్బులిచ్చి బీజేపీ సభకు రాకుండా చేస్తున్నారన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలోనూ ఇలాగే చేశారన్నారు. కానీ వారు ప్రలోభాలకు లొంగకుండా ధర్మాన్ని, న్యాయాన్ని నిలబెట్టారన్నారు. ఈసారి గజ్వేల్‌లో అదే జరుగుతోందన్నారు. గజ్వేల్‌కు నేను కొత్త కాదు. గజ్వేల్‌లో తొలి పౌల్ట్రీ ఫాం ఏర్పాటు చేసి నా జీవితం ప్రారంభించాను. తెలంగాణ ఉద్యమం తొలినాళ్లలో గజ్వేల్‌లోనే ఎక్కువగా తిరిగాను. సొంత ప్రాంతంలో తిరగాలని కేసీఆర్‌ చెప్తే.. హుజురాబాద్‌లో ఉద్యమం నడిపాను. తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర ఏంటో ప్రజలందరికీ తెలుసు. ఎమ్మెల్యే అయ్యాక తెలంగాణతో పాటు అణగారిన వర్గాల వారి కోసం కూడా పోరాడాను అంటూ ఎమోషనల్‌ కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: టార్గెట్‌ ఎర్రబెల్లి.. ఝాన్సీరెడ్డి బదులు యశస్వినీ!

Advertisement
Advertisement