యూటీలు ఎటో?  | Sakshi
Sakshi News home page

యూటీలు ఎటో? 

Published Wed, Apr 3 2024 3:39 AM

BJP special focus on Union Territories Lok Sabha elections - Sakshi

2019లో బీజేపీదే హవా

12 సీట్లలో ఐదింట గెలుపు

ఈసారి 8 ఖాయం: సర్వేలు 

కేంద్రపాలిత ప్రాంతాల్లో (యూటీ) మొదటి నుంచీ జాతీయ పార్టీలదే ఆధిపత్యం! గత ఎన్నికల్లో యూటీల్లో మెజారిటీ సీట్లు దక్కించుకున్న బీజేపీ ఈసారి మరిన్ని సీట్లపై కన్నేయగా, వాటిల్లో ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని కాంగ్రెస్‌ భావిస్తోంది... 

2019 లోక్‌సభ ఎన్నికల్లో యూటీలను బీజేపీ కొల్లగొట్టింది. ఢిల్లీలో మొత్తం 7 సీట్లనూ చేజక్కించుకుంది. జమ్ము కశ్మీర్, లద్దాఖ్‌ల్లో 3 సీట్లు నెగ్గింది. చండీగఢ్‌ ఎంపీ సీటును కాషాయ పార్టీ తరఫున ప్రముఖ నటి కిరణ్‌ అనుపమ్‌ ఖేర్‌ వరుసగా రెండోసారి గెలిచారు. అంతక్రితం ఈ సీటు కాంగ్రెస్‌ గుప్పిట్లో ఉండేది. డామన్‌ డయ్యు స్థానమూ బీజేపీ హస్తగతమైంది. 1987లో ఏర్పాటైన ఈ యూటీలో కాంగ్రెస్‌ 5 సార్లు, బీజేపీ 6 సార్లు నెగ్గాయి. అయితే 2009 నుంచీ ఇక్కడ కాషాయ జెండానే ఎగురుతోంది. అండమాన్‌ నికోబార్‌లో మాత్రం బీజేపీ సీటును కాంగ్రెస్‌ హస్తగతం చేసుకుంది! 2009, 2014ల్లో బీజేపీ గెలిచిన ఈ స్థానం 2019లో కాంగ్రెస్‌ పరమైంది.

దాద్రానగర్‌ హవేలీ సీటును 2021 ఉప ఎన్నికల్లో శివసేన గెలుచుకుంది. ఇక్కడ పలు పార్టీల తరఫున ఏకంగా ఏడుసార్లు నెగ్గిన మోహన్‌భాయ్‌ సంజీభాయ్‌ దేల్కర్‌ 2019లో స్వతంత్రునిగా నెగ్గారు. 2021లో అనుమానాస్పద రీతిలో ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో ఆయన భార్య కాలాబెన్‌ మోహన్‌భాయ్‌ దేల్కర్‌ శివసేన తరఫున పోటీ చేసి నెగ్గారు. ఇక లక్షద్వీప్‌లో కాంగ్రెస్‌ హవాకు 2019లో ఎన్సీపీ అడ్డుకట్ట వేసింది. ఇటీవల మాల్దీవులతో వివాదం నేపథ్యంలో లక్షదీ్వప్‌ అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. మోదీ పర్యటన తర్వాత టూరిస్టుల తాకిడి కూడా పెరిగింది. 

పుదుచ్చేరిపై పార్టీల గురి 
పుదుచ్చేరిలో ప్రాంతీయ పార్టీలైన ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ (ఎన్‌ఆర్సీ), డీఎంకేతో పాటు కాంగ్రెస్‌ కూడా చక్రం తిప్పుతున్నాయి. ఈ ఎంపీ సీటును 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌ఆర్‌సీ గెలుచుకుంది. 2019లో దీన్ని కాంగ్రెస్‌ చేజిక్కించుకుని బీజేపీ, ఎన్‌ఆర్సీలతో కూడిన ఎన్డీఏ కూటమికి షాకిచి్చంది. ఎన్‌.రంగస్వామి కాంగ్రెస్‌ నుండి విడిపోయి ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు. నాటినుంచి ఇక్కడ కాంగ్రెస్‌ తేరుకోలేకపోతోంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 30 సీట్లలో ఎన్‌ఆర్సీ 10 చోట్ల గెలిచింది. బీజేపీకి 6 సీట్లు రావడంతో రంగస్వామి మళ్లీ సీఎంగా ఎన్డీఏ సర్కారు కొలువుదీరింది. పుదుచ్చేరి అసెంబ్లీలోని నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో ఉన్న యానాం కూడా ఉండటం విశేషం!

కశ్మీర్‌..బీజేపీ బ్రహ్మాస్త్రం
2019లో బంపర్‌ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన నాటినుంచీ జమ్మూ కశ్మీర్‌పై మోదీ సర్కారు ఫోకస్‌ చేసింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కలి్పస్తున్న ఆర్టికల్‌ 370ను 2019 ఆగస్ట్‌ 5న రద్దు చేసింది. రాష్ట్రాన్ని జమ్ము కశ్మీర్, లద్దాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో 6 లోక్‌సభ స్థానాలున్నాయి. 2019లో జమ్ము, లద్ధాఖ్‌లోని 3 సీట్లను బీజేపీ గెలుచుకుంది. కాశ్మీర్‌ లోయలోని 3 సీట్లను జమ్మూ కశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (జేకేఎన్‌సీ) చేజిక్కించుకుంది. 2014లో కూడా బీజేపీకి 3 సీట్లు రాగా పీడీపీకి 3 దక్కాయి.

2014 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీ 28 సీట్లు, బీజేపీ 25 సీట్లలో గెలిచి ముఫ్తీ మహమ్మద్‌ సయీద్‌ సీఎంగా సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేశాయి. 2016లో ఆయన మరణించడంతో కుమార్తె మెహబూబా ముఫ్తీ సీఎం అయ్యారు. 2018లో బీజేపీ మద్దతు ఉపసంహరించడంతో ప్రభుత్వం కూలిపోయింది. ఈ ఏడాది సెపె్టంబర్‌ లోపు అక్కడ జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహంచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల తర్వాత దానికి మళ్లీ రాష్ట్ర హోదా దక్కే అవకాశాలున్నాయి. గతంలో ఇక్కడ చక్రం తిప్పిన కాంగ్రెస్‌ గులాంనబీ ఆజాద్‌ రాజీనామాతో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది.

సొంత పార్టీ పెట్టుకున్న ఆజాద్‌ చిన్న పార్టీలతో కలిసి పోటీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇండియా కూటమి పక్షాలు కాంగ్రెస్, ఎన్‌సీ, పీడీపీ సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. జమ్ములోని 2 సీట్లలో కాంగ్రెస్‌కు ఎన్‌సీ, పీడీపీ మద్దతివ్వనున్నాయి. కాశ్మీర్‌ లోయలోని 3 సీట్లపై మాత్రం పీటముడి పడింది. మూడింట్లోనూ పోటీ చేస్తామని ఎన్‌సీ ప్రకటించింది. పీడీపీ కూడా వెనక్కి తగ్గడం లేదు.

సర్వేల అంచనాలు ఇలా...
ఈసారి కేంద్రపాలిత ప్రాంతాల్లో బీజేపీ బలం మరింత పెరుగుతుందని సర్వేలు చెబుతున్నాయి. ఢిల్లీలో మళ్లీ క్లీన్‌స్వీప్‌తో పాటు పుదుచ్చేరి, లద్దాఖ్, చండీగఢ్‌ ఆ పార్టీ పరం అవుతాయంటున్నాయి. జమ్ము కశ్మీర్‌లో 2, దాద్రానగర్, డామన్‌ డయ్యు, అండమాన్‌ సీటు కూడా బీజేపీవేనన్నది వాటి అంచనా. కాంగ్రెస్‌ లక్షదీ్వప్‌లో మాత్రం నెగ్గవచ్చని, కశ్మీర్‌లోని 3 సీట్లలో ఎన్‌సీ గెలుస్తుందని అన్నాయి. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
Advertisement