కేటీఆర్‌ రోజుకో శాఖకు మంత్రి  | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ రోజుకో శాఖకు మంత్రి 

Published Fri, May 12 2023 3:29 AM

BJP state president Bandi Sanjay in unemployment march - Sakshi

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వశాఖల్లో పాలన అవినీతిమయంగా ఉందని, మంత్రి కేటీఆర్‌ రోజుకో శాఖకు మంత్రి అవతారమెత్తి శాఖలన్నింటినీ దోచుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ఆరోపించారు.

కేటీఆర్‌ సోమవారం హోంమంత్రి, మంగళవారం ఆరోగ్యమంత్రి, బుధవారం ఆర్థికమంత్రి, శుక్రవారం ఇరిగేషన్‌ మంత్రి, శనివారం విద్యామంత్రి అవుతున్నారని ఆదివారం మాత్రం డ్రగ్స్, మద్యం సేవించి ఇంట్లో పడుకుంటున్నారని దుయ్యబట్టారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీని నిరసిస్తూ గురువారం సంగారెడ్డిలో బీజేపీ నిరుద్యోగ మార్చ్‌ నిర్వహించింది.

ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ముడతలు పడిన చొక్కాలు ధరించిన కేటీఆర్‌కు ఇప్పుడు రూ.వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో దోచుకున్న డబ్బును విదేశాల్లో పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. తెలంగాణను దోచుకుంటున్న నయా నిజాం గడీలను బద్దలు కొట్టేందుకే అన్ని జిల్లాల్లో నిరుద్యోగ మార్చ్‌ నిర్వహిస్తున్నామని చెప్పారు. 

రాజబోగాలు మీకు..  కడుపు మంటలు నిరుద్యోగులకా.. 
వందలాది మంది నిరుద్యోగుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో సీఎం కేసీఆర్‌ కుటుంబం రాజభోగాలను అనుభవిస్తూ నిరుద్యోగ యువతను కడుపుమంటకు గురి చేస్తోందని బండి నిప్పులు చెరిగారు. టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చిన కేసీఆర్‌ తెలంగాణ నుంచి పారిపోయిన పిరికిపంద అని ఎద్దేవాచేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే జాబ్‌క్యాలెండర్‌ ప్రకటించి.. బిశ్వాల్‌ కమిటీ నివేదిక మేరకు రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతామని ప్రకటించారు.

టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని, ఆయా పరీక్షల అభ్యర్థులకు రూ.లక్ష పరిహారం చెల్లించే వరకు పోరాటం చేపడతామన్నారు. కేసీఆర్‌ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని విమర్శించారు. ఈ మధ్య సీఎం కేసీఆర్‌ సచివాలయానికి వస్తున్నారని, అందుకే అకాల వర్షాలు పడుతున్నాయని బండి ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ ఇంకోసారి అధికారంలోకి వస్తే రూ.ఐదు లక్షల కోట్ల అప్పులకు మరో రూ.ఐదు లక్షల కోట్లు చేరతాయని ధ్వజమెత్తారు.

జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను టీఆర్‌ఎస్‌ సర్కారు కాంట్రాక్టు ఉద్యోగులుగా మార్చేందుకు కుట్ర చేస్తోందని, బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని రెగ్యులర్‌ చేస్తామని హామీ ఇచ్చారు. హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని ఈనెల 14న కరీంనగర్‌లో హిందూఏక్తా యాత్ర నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎంపీ విజయశాంతి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement