Sakshi News home page

సోనియా గాంధీ అంటే అభిమానం, గౌరవం: విజయశాంతి కామెంట్స్‌

Published Mon, Sep 18 2023 8:47 AM

BJP Vijaya Shanthi Interesting Comments Over Sonia Gandhi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ పొలిటికల్‌ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న క్రమంలో బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అంటే తనను అభిమానం, గౌరవమని అన్నారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 

అయితే, విజయశాంతి ట్విట్టర్‌ వేదికగా..‘ఎంఐఎం, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఒక్కటే అని, సయామీ ట్విన్స్ అని ఎప్పటి నుంచో నేను నిరంతరం చెబుతున్న మాటని నిన్న రాహుల్ గాంధీ గారు కూడా బహిరంగ సభలో చెప్పడం ఎంతైనా సమంజసం అంటూ మండిపడ్డారు రాములమ్మ. అయితే, మిగతా ఎక్కడో రాష్ట్రాలలో ఎంఐఎం, కాంగ్రెస్‌ను ఓడించడానికి ప్రయత్నిస్తున్నదనే వ్యాఖ్యానం పూర్తిగా అయోమయ అంశం, అర్థం కాని విషయం కూడా అంటూ చురకలు అంటించారు.

ఇదే సమయంలో ‘అంటే దేశంలోని అనేక రాష్ట్రాలలో ఎంఐఎం ప్రేరేపిత ఓట్లు కాంగ్రెస్‌కు రాకపోవడం వల్లనే బీజేపీ గెలుస్తున్నదా? కాంగ్రెస్ ఓడిపోతున్నదా? అని నిలదీశారు. ఆ విధంగా కాంగ్రెస్ దేశంలోని అనేక రాష్ట్రాలలో గెలవలేని పరిస్థితులు ఉన్నాయా? కాబట్టి, ఎంఐఎం లేకుండా దేశంలో ఎక్కడా కూడా గెలవడం సాధ్యం కాదేమో అని కాంగ్రెస్ అభిప్రాయమా? అని ప్రశ్నించారు. ఒక్క మాటలో, దేశమంతటా ప్రోద్బలిత వర్గాలను కాంగ్రెస్ కన్నా ఎక్కువగా ఎంఐఎం మరింత ప్రభావితం చెయ్యగలుగుతున్నదా? అని పేర్కొన్నారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సోనియా గాంధీ గారిని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరం తప్పక అభిమానంతోనే చూస్తాం, రాజకీయాలకు అతీతంగా గౌరవిస్తాం’ అని ఆమె కామెంట్‌ చేశారు.

ఇది కూడా చదవండి: వచ్చే నెలలో తెలంగాణకు ప్రధాని మోదీ?

Advertisement
Advertisement