బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు.. మెజార్టీ సీట్లు గెలిస్తే! | Sakshi
Sakshi News home page

బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు.. మెజార్టీ సీట్లు గెలిస్తే!

Published Sun, Mar 10 2024 9:22 PM

BJP's Distancing Act After MP's "Will Change Constitution - Sakshi

బెంగళూరు:  మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ అనంత్‌కుమార్‌ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు.  రానున్న సార్వత్రిక  ఎన్నికలల్లో బీజేపీ మూడింట రెండు వంతుల ఎంపీ సీట్లలో గెలుపొంది.. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేస్తామని అన్నారు. రాజ్యాంగంలోని పీఠికలో ఉన్న  ‘లైకికవాదం’ను తొలగిస్తామని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయ. 

‘అనవసరమైన అంశాలను కాంగ్రెస్‌ బలవంతంగా చొప్పించి రాజ్యాంగాన్ని వక్రీకరించింది. ముఖ్యంగా హిందూ సామాజాన్ని అణచివేసే చట్టాలను తీసుకుచ్చింది. వాటిలో మార్పులు తీసుకురావాలంటే బీజేపీకి ప్రస్తుతం ఉన్న మెజార్టీ సరిపోదు. కాంగ్రెస్‌ మెజార్టీ లోక్‌సభ స్థానాలు గెలువలేదు. మోదీ నాయకత్వంలో బీజేపీ లోక్‌సభలో మూడింట రెండు వంతుల సీట్లను గెలుస్తుంది. అయితే  లోక్‌సభ, రాజ్యసభల్లో మూడింట రెండువంతుల సీట్లను బీజేపీ గెలవటంతో పాటు.. అదే స్థాయిలో 20 రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తే  రాజ్యాంగంలో మార్పులు తీసుకురావచ్చు’ అని  అనంత్‌కుమార్‌ హెగ్డే అన్నారు. 

‘ఈసారి బీజేపీ 400 సీట్లు  గెలవాలి. 400 సీట్లు ఎందుకంటే?  లోక్‌సభలో మెజార్టీ ఉన్నా.. రాజ్యసభలో బీజేపీ  మెజార్టీ లేదు. రాజ్యసభలో  తక్కువ మెజార్టీ ఉంది. అలాగే పలు రాష్ట్రాల్లో కూడా బీజేపీకి కావల్సినంత మెజార్టీ లేదు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమి 400 సీట్ల గెలుపొందితే.. రాజ్యసభలో బీజేపీ మెజార్టీ పెరగటానికి దోహదపడుతుంది’అని స్పష్టం చేశారు.

అనంత్‌కుమార్‌ హెగ్డే చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అయ్యాయి. హెగ్డే వ్యాఖ్యలపై కర్ణాటక డిప్యూటీ  సీఎం డీకే శివకుమార్‌ స్పందిస్తూ.. బీజేపీ రాజ్యాంగ వ్యతిరేకమైన పార్టీ అని మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలతో కేంద్రంలోని బీజేపీకి అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగంపై వ్యతిరేకత ఎంత ఉందో అర్థమవుతోందని దుయ్యబట్టారు.

దీంతో కర్ణాటక బీజేపీ  ‘ఎక్స్‌’వేదికగా స్పందిస్తూ.. ‘ఎంపీ అనంత్‌కుమార్‌ హెగ్డే రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు  ఆయన వ్యక్తిగతమైనవి.. వాటితో పార్టీకి ఎటువంటి సంబంధిం లేరు. ఆయన వ్యాఖ్యలు పార్టీని ప్రతిబింబించవు. ఆయన చేసిన వ్యాఖ్యలపై మేము వివరణ కోరుతాం’ అని బీజేపీ పేర్కొంది. 

Advertisement
Advertisement