కలసి నడుస్తాం.. లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీతో బీఆర్‌ఎస్‌ జట్టు | Sakshi
Sakshi News home page

కలసి నడుస్తాం.. లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీతో బీఆర్‌ఎస్‌ జట్టు

Published Wed, Mar 6 2024 4:32 AM

BRS Alliance with BSP in Lok Sabha elections - Sakshi

లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీతో బీఆర్‌ఎస్‌ జట్టు... కేసీఆర్‌ నివాసానికి ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ బృందం 

సుమారు మూడు గంటలపాటు చర్చలు 

సీట్ల సర్దుబాటుపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత... నాగర్‌కర్నూలు స్థానాన్ని ఇచ్చేందుకు కేసీఆర్‌ సుముఖత 

లౌకికత్వాన్ని కాపాడేందుకే పొత్తు అని సంయుక్త ప్రకటన 

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కలసి నడవాలని భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌), బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) నిర్ణయించాయి. పొత్తు విధివిధానాలు, సీట్ల సర్దుబాటు అంశాలపై బుధవారం లోతుగా చర్చించాలని ఇరు పార్టీల అధ్యక్షులు నిర్ణయానికి వచ్చారు. చర్చల సారాంశాన్ని బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతికి వివరించి ఆమోదం పొందిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, కె.చంద్రశేఖర్‌రావు, బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ మంగళవారం సంయుక్త ప్రకటన చేశారు. 

కేసీఆర్‌తో ప్రవీణ్‌ భేటీ.. 
నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి పోటీలో ఉంటానని ప్రకటించిన ప్రవీణ్‌కుమార్‌ మంగళవారం ఉదయం అనూహ్యంగా నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసానికి చేరుకున్నారు. ఆయన వెంట బీఎస్పీ ప్రధాన కార్యదర్శి విజయ్‌ ఆర్య, ఉపాధ్యక్షుడు దయానంద్‌రావు ఉన్నారు. వారికి రాజ్యసభ ఎంపీ జె.సంతోష్‌ కుమార్‌ స్వాగతం పలికారు. కేసీఆర్‌తో భేటీలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ తదితరులు పాల్గొన్నారు.

సుమారు 3 గంటలపాటు జరిగిన ఈ భేటీలో జాతీయ, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది. కేసీఆర్‌తో కలసి ప్రవీణ్‌ కుమార్, ఇతర నేతలు మధ్యాహ్న భోజనం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కలసి పోటీ చేయాలనే సూత్రప్రాయ అంగీకారం కుదిరిన నేపథ్యంలో కేసీఆర్, ప్రవీణ్‌ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. 

సిద్ధాంతపరంగా సారూప్యత ఉంది: కేసీఆర్‌ 
‘వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్‌ఎస్, బీఎస్పీ కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. సిద్ధాంతపరంగా ఇరు పార్టీల నడుమ సారూప్యత ఉంది. మేము అమలు చేసిన దళితబంధు, దళిత సంక్షేమం, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, బలహీనవర్గాల అభ్యున్నతి తదితరాల ఆధారంగా ఒక ప్రతిపాదన వస్తే ఇద్దరం కలసి చర్చించాం. బీఎస్పీ హైకమాండ్‌ అనుమతితో చర్చించి కలసి పనిచేయాలని స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చాం.

మిగతా విషయాలు ఒకట్రెండు రోజుల్లో వెల్లడిస్తాం. ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై బుధవారం చర్చిస్తాం. పొత్తుపై అవగాహన ఏర్పడిన నేపథ్యంలో గౌరవప్రదంగా సీట్ల పంపిణీ ఉంటుంది. నేను ఇప్పటివరకు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతితో మాట్లాడలేదు. కానీ ఆమెతో ఉన్న పాత పరిచయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను కూడా మాట్లాడతా’అని కేసీఆర్‌ తెలిపారు. 

రాజ్యాంగం రద్దుకు బీజేపీ కుట్ర: ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ 
‘కేసీఆర్‌ను కలవడం ఆనందంగా ఉంది. తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా లౌకికత్వం ప్రమాదంలో ఉంది. లౌకికత్వాన్ని దెబ్బతీసేందుకు రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు బీజేపీ పెద్ద ఎత్తున కుట్రలు చేస్తోంది. లౌకిక భావాలతో నిరంతరం లౌకికవాదాన్ని కాపాడిన బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ను మాయావతి ఆశీస్సులతో కలిశా. తెలంగాణలో రాజ్యాంగం, లౌకికత్వానికి ప్రమాదం పొంచి ఉంది. లౌకికత్వాన్ని దెబ్బతీసే విషయంలో కాంగ్రెస్‌ కూడా బీజేపీలాగానే మారుతోంది. ఇరు పార్టీల ముప్పు నుంచి తెలంగాణను కాపాడేందుకు కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం.

సీట్ల సర్దుబాటు విషయంలో మా అధిష్టానానికి నివేదిస్తాం. ఇరు పార్టీల స్నేహం తెలంగాణలో ప్రజల జీవితాలను మారుస్తుంది. మా స్నేహాన్ని ప్రజలు ఆశీర్వదిస్తారు. ఇక్కడి ప్రజల విలువలు, గంగా–జమునా తహజీబ్‌ సంస్కృతిని కాపాడతాం. బహుజన వర్గాల జీవితాలు కూడా బాగుపడతాయి. రేవంత్‌ ప్రభుత్వంపట్ల నిరుద్యోగులు సంతోషంగా లేరు. పట్టుమని 4 నెలలు కాకముందే రోడ్డెక్కే పరిస్థితి ఉంది’అని ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ పేర్కొన్నారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement