అభివృద్ధి, అభ్యర్థులకే కన్నడ ఓటరు పట్టం | Sakshi
Sakshi News home page

అభివృద్ధి, అభ్యర్థులకే కన్నడ ఓటరు పట్టం

Published Sun, May 14 2023 3:58 AM

BRS Analysis of Karnataka Assembly Election Results - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ పార్టీ గా అవతరించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్నప్పటికీ శనివారం వెలువడిన ఫలితాలను లోతుగా విశ్లేషిస్తోంది. బీజేపీ ఘోర పరాజయం, కాంగ్రెస్‌ గె­లుపు, భావసారూప్య పార్టీ జేడీఎస్‌ కొన్ని సీట్లకే పరిమితం కావడం వంటి అంశాలను నిశితంగా పరిశీలిస్తోంది. ఈ ఎన్నికలను ప్రభావితం చేసి­న అంశాలు, పార్టీలు, అభ్యర్థుల పనితీరు, ఓట­ర్ల స్పందన వంటి అంశాలపై అధ్యయనం చే­స్తోంది.

కర్ణాటక ఫలితాల నేపథ్యంలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ తెలంగాణలో అనుసరించే ఎన్నికల వ్యూహం, వాటిని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన ప్రతి­వ్యూహంపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ లు, ఎజెండాల కంటే అవినీతి, అభివృద్ధి, అభ్యర్థుల గుణగణాలకే కర్ణాటక ఓటర్లు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ధి ఎజెండాను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా బీఆర్‌ఎస్‌ కార్యాచరణ ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. 

మసకబారిన మోదీ, షా ప్రాభవం... 
జాతీయ రాజకీయాల్లో శూన్యత ఉందని పదేపదే చెబుతున్న బీఆర్‌ఎస్‌... కర్ణాటక ఎన్నికలను కూడా అదే కోణంలో విశ్లేషిస్తోంది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రాభవం తగ్గిందనేందుకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు నిదర్శనమని భావిస్తోంది. కేంద్రంతోపాటు బీజేపీపాలిత రాష్ట్రాల్లో పాలనా వైఫల్యాలు, అవినీతి, బంధుప్రీతి వంటి అంశాలు బీజేపీకి ప్రతికూలంగా పనిచేసినట్లు బీఆర్‌ఎస్‌ లెక్కలు వేస్తోంది.

బీజేపీ అమలు చేస్తున్న విద్వేష ఎజెండాను కర్ణాటక ప్రజలు తిరస్కరించిన నేపథ్యంలో తెలంగాణలోనూ అదే ఎజెండాను తెరపైకి తెచ్చేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని బీఆర్‌ఎస్‌ విశ్వసిస్తోంది. బీజేపీ ఎజెండాను గట్టిగా ఎదుర్కొనేందుకు కర్ణాటక ఎన్నికలను ఉదాహరణగా చూపడం ద్వారా దీటుగా ఎదుర్కొనేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధంగా ఉందని పార్టీ ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించారు.

సామాజిక మాధ్యమాల ద్వారా కొన్ని వర్గాలను రెచ్చగొట్టేందుకు బీజేపీ చేసే ప్రయత్నాలకు కర్ణాటక ఫలితాలు కొంతమేర అడ్డుకట్ట వేయగలుగుతాయని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోనే బీజేపీ ప్రభావం కొంత ఉందని అంచనా వేస్తున్న బీఆర్‌ఎస్‌... ప్రతిదాడిని పెంచాలని 
నిర్ణయించింది. 

కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు వ్యూహం 
కర్ణాటక ఫలితాల ఉత్సాహంతో తెలంగాణలోనూ కాంగ్రెస్‌ దూకుడు పెంచుతుందని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఈ దిశగా కాంగ్రెస్‌ అధిష్టానం తెలంగాణపై దృష్టి సారిస్తే అనుసరించాల్సిన వ్యూహంపైనా కేసీఆర్‌ ఇప్పటికే ఓ కార్యాచరణతో సిద్ధంగా ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకతను అనువుగా మలుచుకున్న కాంగ్రెస్‌... తెలంగాణలోనూ అదే తరహా వ్యూహాలను అమలు చేసే అవకాశమున్నట్లు బీఆర్‌ఎస్‌ అంచనా వేస్తోంది.

ఎన్నికలు సమీపించేకొద్దీ కాంగ్రెస్‌ దూకుడు పెంచే అవకాశాలున్నందున పార్టీ, ప్రభుత్వ కార్యకలాపాల్లో మరింత వేడి పెంచేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధమవుతోంది. అలాగే భావసారూప్య పార్టీ జేడీఎస్‌ కర్ణాటక ఎన్నికల్లో సాధించిన ఫలితాలను కూడా బీఆర్‌ఎస్‌ విశ్లేషిస్తోంది. కర్నాటకలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఓటర్లు కోరుకోవడం కూడా జేడీఎస్‌పై ప్రభావం చూపినట్లు లెక్కలు వేస్తోంది.  

Advertisement
Advertisement