వైట్‌పేపర్‌ కాదు.. ఫాల్స్‌ పేపర్‌  | Sakshi
Sakshi News home page

వైట్‌పేపర్‌ కాదు.. ఫాల్స్‌ పేపర్‌ 

Published Sun, Feb 18 2024 5:18 AM

BRS Leader Harish Rao Fires On Congress Govt - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘మీరు అధికారంలో ఉన్నారు. మా హయాంలో నిర్మించిన ప్రాజెక్టులపై విచారణ జరపండి. తప్పు చేస్తే చర్యలు తీసుకోండి. మేము తప్పు చేయలేదు. భయపడేది లేదు’ అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సభ్యుడు తన్నీరు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వాన్ని దోషిగా చూపించే ప్రయత్నమే తప్ప, రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రయత్నం చేయడం లేదన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద జరిగిన ఘటన ద్వారా రాజకీయంగా లబ్ధిపొందాలని చేస్తున్న యత్నాన్ని విరమించుకొని, రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని సూచించారు.

కేసీఆర్‌ హయాంలో చేసిన మంచి పనులు కనిపించకుండా చేయడమే లక్ష్యంగా పని చేస్తే అంతిమంగా ప్రజలే నష్టపోతారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రం సత్యదూరమంటూ అది ‘వైట్‌పేపర్‌ కాదు.. ఫాల్స్‌ పేపర్‌’ అని ఎద్దేవా చేశారు. మిడ్‌మానేరు జలాశయం నిర్మాణం ఉమ్మడి రాష్ట్రంలో పూర్తైందని రుజువు చేస్తే రాజీనామా చేసి మళ్లీ సభలో అడుగుపెట్టనని సవాల్‌ చేశారు. శనివారం శాసనసభలో ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. హరీశ్‌రావు ప్రసంగం ఆయన మాటల్లోనే...  

సీడబ్ల్యూసీ సూచనల మేరకే... 
‘కాంగ్రెస్‌ హయాంలో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు ఏడేళ్లలో కనీస అనుమతులు తీసుకురాలేదు. అప్పటి ఉమ్మడి రాష్ట్రం, మహారాష్ట్ర, కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ప్రాజెక్టుకు అనుమతి రాలేదు. దీనికోసం 2014 వరకు రూ.6,116 కోట్లు ఖర్చు చేసింది. అంతకుముందే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉమ్మడి ఏపీ సీఎంకు ఈ ప్రాజెక్టు సాధ్యం కాదు, చేసే ఖర్చు వృథా అవుతుందని లేఖ రాశారు. అయినా పట్టించుకోలేదు.

ఆ పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ప్రభుత్వం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు అనుమతుల కోసం యత్నించినా, మహారాష్ట్ర ఒప్పుకోలేదు. 152 మీటర్ల ఎత్తులో తుమ్మడిహెట్టి దగ్గర బ్యారేజీ నిర్మాణానికి ఒప్పుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా ఒప్పుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) కూడా తుమ్మడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని, జలాశయాల సామర్థ్యం సరిపోదని తెలిపింది. ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీ సూచనల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైనింగ్‌ చేశాం. కేంద్ర ప్రభుత్వ సంస్థ వాప్కోస్‌ సూచనల మేరకు మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాం.  
 
20 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చాం 
కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఆయకట్టు తక్కువ వచ్చిందని కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేస్తోంది. మీరు ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారమే కాళేశ్వరం కింద కొత్త ఆయకట్టు 98,570 ఎకరాలు వచ్చింది. కాళేశ్వరం ద్వారా నిండిన చెరువులు, కుంటలు, స్టేజ్‌–1, స్టేజ్‌–2లలో జరిగిన స్థిరీకరణ కలిపి దాదాపు 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్లిచ్చాం. ఏ ప్రాజెక్టుకైనా ప్రారంభించిన వెంటనే కొత్త ఆయకట్టు రాదు. ఎస్సారెస్పీ, నాగార్జున సాగర్‌ ఎడమకాలువ, దేవాదుల, కల్వకుర్తి మొదలైనప్పుడు అన్ని ప్రాజెక్టుల పరిస్థితి ఇదే.

శ్వేతపత్రంలో అబద్ధాలనే పొందుపరిచారు. మిడ్‌ మానేర్‌కు రూ. 106 కోట్లు ఖర్చు చేస్తే, మేమొచ్చాక రూ.775 కోట్లు ఇచ్చాం. మేమే పూర్తి చేసి నీళ్లిచ్చాం. రాయలసీమ లిఫ్ట్‌ విషయంలో మేము కేంద్రానికి ఫిర్యాదు చేయలేదన్నారు... అది తప్పు. కేఆర్‌ఎంబీకి అప్పగించాలని గెజిట్‌ ఇస్తే మేము సవాల్‌ చేయలేదని చెప్పడం కూడా తప్పే. మేము దీన్ని వ్యతిరేకిస్తూ అపెక్స్‌ కౌన్సిల్‌కు రిఫర్‌ చేయాలని చెప్పాం. కేఅర్‌ఎంబీకి అప్పగించింది మేం కాదు.  
 
మేడిగడ్డను పునరుద్ధరించి నీళ్లివ్వండి 
మేడిగడ్డ బ్యారేజ్‌ను పునరుద్ధరించకుండా సాగదీస్తున్నారు. మొత్తం కూలిపోతే రాజకీయ లబ్ధి పొందాలని భావిస్తున్నట్లు అనుమానం వస్తోంది. వర్షాకాలం వచ్చేలోపు పునరుద్ధరణ పనులు చేయాలి. పదేళ్లలో మేజర్, మీడియం, మైనర్‌ ఇరిగేషన్‌ కింద 17.24 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు తెచ్చాం. 31.50 లక్షల ఎకరాలు స్థిరీకరణ చేశాం. ప్రాజెక్టుల అంచనాలు పెరగడం కొత్త కాదు. కాళేశ్వరం ఒక్కటే పెరగలేదు. నాగార్జున సాగర్‌ అంచనా 9.7 రెట్లు పెరిగింది. రాష్ట్రంలో నిర్మించిన అన్ని ప్రాజెక్టుల అంచనాలు పెరిగాయి. కృష్ణా నుంచి 299 టీఎంసీలు కాదు, 600 టీఎంసీలకు పైగా నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేయాలి.  

టీవీలో నా ముఖం చూపించడం లేదట.. 
శ్వేతపత్రంపై చర్చలో హరీశ్‌రావు మాట్లాడుతుండగా, సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అడ్డుతగిలారు. దీంతో హరీశ్‌రావు పలుమార్లు అసహనం వ్యక్తం చేస్తూ ‘నేను శ్వేతపత్రంపై వివరణ ఇవ్వాలో లేదా మంత్రులు మాట్లాడే మాటలకు వివరణ ఇవ్వాలో తెలియట్లేదు?’ అని పేర్కొన్నారు.

అదే సమయంలో ఆయన స్పీకర్‌నుద్దేశించి ‘నేను అసెంబ్లీలో మాట్లాడుతుంటే టీవీలో నా మొహం చూపిస్తలేరంట. ఇప్పుడే మా ఆవిడ ఇంట్లో టీవీ చూసి కాల్‌ చేస్తే.. మా పీఏ కాగితం పంపించాడు. గొంతు వినిపిస్తోందట కానీ నా ముఖం బదులు స్పీకర్‌ లేదా సీఎంను చూపిస్తున్నారట. నా ముఖం కూడా చూపించండి’ అని అన్నారు. దానికి స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ స్పందిస్తూ ‘మీరు సీనియర్‌ సభ్యులు. అలా మాట్లాడకూడదు. ఎవరు మాట్లాడితే వారినే చూపిస్తారు’ అని చెప్పారు. 
 
మంత్రి శ్రీధర్‌బాబుతో హరీశ్‌ భేటీ... 
భోజన విరామ సమయంలో లాబీల్లోని శాసనసభా వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్‌బాబు గదికి హరీశ్‌రావు వచ్చారు. అప్పుడు శ్రీధర్‌ గదిలో లేకపోవడంతో వెనక్కు తిరిగారు. అంతలోనే లాబీల్లో శ్రీధర్‌బాబు ఎదురుపడి హరీశ్‌ను తన వెంట తీసుకెళ్లారు. శ్వేతపత్రంపై చర్చ ఎంత సేపు జరగనుంది, సీఎం రేవంత్‌రెడ్డి కూడా దీనిపై మాట్లాడతారా అన్న విషయాల గురించి హరీశ్‌ అడిగినట్టు తెలిసింది. నీటిపారుదల ప్రాజెక్టులపై చాలా మంది సభ్యులు మాట్లాడతామని కోరుతున్నారని, వారందరికీ అవకాశం కల్పిస్తామని శ్రీధర్‌ చెప్పినట్టు సమాచారం. 
 
ప్రభుత్వం వాస్తవాలు దాచి పెట్టింది 
స్థిరీకరణ, ఆయకట్టు విషయంలో ప్రభుత్వం వాస్తవాలు దాచి పెట్టిందని, దీనిపై ప్రజలకు క్షమాపణ చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ నిరవధిక వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మమల్ని ఇరికించబోయి ప్రభుత్వం సెల్ఫ్‌ గోల్‌ వేసుకుందని, నాలుగు ఎంపీ సీట్లలో గెలుపు కోసం దీన్ని భూతద్దంలో చూపే ప్రయత్నం చేసిందని ధ్వజమెత్తారు. కాగ్‌ పనికి రాదని తాము అనలేదని, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చెప్పిన అన్న విషయాన్ని గుర్తుచేశామని, ఇదే కాగ్‌ తమను ఎన్నోసార్లు మెచ్చుకుందని చెప్పారు.     

Advertisement
Advertisement