రేవంత్‌ను చూసి ఎవరూ భయపడరు | Sakshi
Sakshi News home page

రేవంత్‌ను చూసి ఎవరూ భయపడరు

Published Wed, Mar 27 2024 5:03 AM

BRS Leader KTR Fires On CM Revanth Reddy - Sakshi

లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీలో తొలి చేరిక రేవంత్‌దే..: కేటీఆర్‌ 

అక్రమ వసూళ్లు చేసి ఢిల్లీకి రూ.2,500 కోట్ల కప్పం 

దానం అనర్హతపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం... 

సాక్షి, హైదరాబాద్‌: ‘అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫోన్‌ ట్యాపింగ్‌ అంటున్నడు. ఎక్కడ జరిగిందో చెప్పకుండా యూట్యూబ్‌ చానళ్లు, మీడియాకు లీకులు ఇస్తూ ఏదో జరిగిందనే ప్రచారం చేస్తున్నడు. నీ చేతిలో అధికారం ఉంది కదా.. విచారణ చేసి తప్పులు ఎక్కడ జరిగాయో బయటపెట్టి బాధ్యులపై చర్యలు తీసుకో. ఎవడికీ భయపడేది లేదు. నువ్వు వెంట్రుక కూడా పీకలేవు. ఇలాంటి వాటిని చూసి కేడర్‌ ఆగం కావద్దు’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చెప్పారు.

తెలంగాణ భవన్‌లో మంగళవారం సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘సెక్రటేరియట్‌లో లంకె బిందెలు లేవని చెబుతున్న రేవంత్‌ గతంలో ఏం చేసెటోడో తెలియదు. జేబులో కత్తెరలు పెట్టుకుని తిరుగుతున్న జేబుదొంగ రేవంత్‌.. పేగులు మెడలో వేసుకునేందుకు నువ్వేమైనా బోటీ కొట్టెటోడివా. మున్సిపల్‌ శాఖ బాధ్యతలు చూస్తున్న రేవంత్‌రెడ్డి మూడు నెలలుగా భవన నిర్మాణ అనుమతులు ఎందుకు ఇవ్వడం లేదు.

పార్లమెంటు ఎన్నికల డబ్బుల కోసం రైస్‌ మిల్లర్లు, రియల్టర్లు, బిల్డర్లపై దాడులు చేసి బెదిరించి రూ.2500 కోట్లు జమ చేసి ఢిల్లీకి కప్పం కట్టిండు. ఇది దోపిడీ సొమ్ము కాదా. ఇలాంటివి బయటకు రాకుండా బర్లు, గొర్ల స్కీమ్‌లంటూ ప్రజల మెదళ్లలో తప్పుడు సమాచారం నింపేందుకు చానళ్లలో కేసీఆర్‌ను తిడుతూ దొంగ మాటలు చెప్తున్నడు’ అని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు, కరెంటు, మహిళలకు రూ.2500, వృద్ధులకు రూ.4వేలు, కళ్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఇవ్వలేని ఇతనా మన సీఎం అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.  
 
బీజేపీలో మొట్టమొదట చేరేది రేవంత్‌ 

‘కేంద్రంలో బీజేపీని ఆపే శక్తి, ధైర్యం కాంగ్రెస్‌కు లేవు. ఎన్నికల రేసులో ఎవరూ ఉండొద్దని మోదీ ప్రయత్నిస్తున్నారు. దేశంలో బలంగా ఉన్న ప్రాంతీయ నాయకులు కేసీఆర్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌ వంటి నేతలకు మాత్రమే బీజేపీని అడ్డుకునే శక్తి ఉంది. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మోదీని చౌకీదార్‌ అంటే రేవంత్‌ మాత్రం బడేభాయ్‌ అంటున్నడు. అదానీ మంచివాడు కాదని రాహుల్‌ అంటే, రేవంత్‌ మాత్రం కౌగిలించుకుని ఫొటోలు తీసుకుంటుండు.

లిక్కర్‌ స్కామ్‌ ఏమీ లేదు, కేజ్రీవాల్‌ అరెస్టు అక్రమం అని రాహుల్‌ అంటే, కవిత అరెస్టును ఇక్కడి సీఎం సమర్థిస్తాడు. కాంగ్రెస్‌లో రాహుల్‌ గాం«దీ, రేవంత్‌కు నడుమ పొంతన కుదరడం లేదు. దేశంలో పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ 40 సీట్లకు మించి గెలవదు. 40 సీట్లు దాటకుంటే వెంటనే తనతోపాటు మరికొందరిని మూటగట్టుకుని బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్‌రెడ్డి. ఈ విషయంలో ఎన్నిమార్లు ఆయనపై విమర్శలు చేసినా స్పందించక పోవడం వెనుక మతలబు ఇదే. జీవితకాలమంతా కాంగ్రెస్‌లో కొనసాగుతానని రేవంత్‌ చెప్పకపోవడమే దీనికి నిదర్శనం’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. 
 
కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌కు చేసిందేమీ లేదు.. 

‘కాంగ్రెస్‌ కొన్ని యూట్యూబ్‌ చానళ్లను అడ్డుపెట్టుకుని అబద్ధాలు ప్రచారం చేస్తుంటే.. బీజేపీ రాముడి పేరును చెప్పి నాటకం ఆడుతోంది. ప్రతిపక్షాల నేతలపై కేసులతో గొంతు నొక్కి జైలుకు పంపి మానసికంగా వేధిస్తోంది. లిక్కర్‌ స్కామ్‌ బయట పెడతానని అంటున్న కిషన్‌రెడ్డి ఆధారాలను కోర్టుకు సమర్పించాలి. ఐదేళ్లుగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌కు చేసిందేమీ లేదు.

పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు కోసం అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తాం’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. సమావేశంలో సికింద్రాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యరి్థ, ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.   

Advertisement
Advertisement