బీఆర్‌ఎస్‌ నేతల భలే నిరసన.. ప్లాన్‌ అదిరిందిగా.. సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ 

11 Mar, 2023 10:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లిక్కర్‌ స్కాం కేసు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ సర్కార్‌, ఎమ్మెల్సీ కవితపై ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేశారు. అటు బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు సైతం కేంద్రం, దర్యాప్తు సంస్థలను టార్గెట్‌ చేసి కామెంట్స్‌ చేశారు. 

ఇక, లిక్కర్‌ స్కాం కేసులో భాగంగా ఎమ్మెల్సీ కవిత శనివారం ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. ఈడీ, సీబీఐ, బీజేపీ బెదిరింపు రాజీకీయాలపై బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. బీజేపీలో చేరకముందు.. చేరిన తర్వాత అంటూ సినిమాటిక్‌ రేంజ్‌లో కొందరు బీజేపీ నేతలపై పోస్టర్లు వేశారు. అంతకుముందు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు దర్యాప్తు సంస్థల రైడ్స్‌ అనంతరం.. కాషాయ రంగు అద్దుకుని బీజేపీలో చేరానని సెటైరికల్‌గా చెప్పారు. 

ప్రస్తుత కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ, వెస్ట్ బెంగాల్ బీజేపీ ముఖ్య నేత సువేంధు అధికారి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త ఎంపీ సుజనా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి నారాయణ్ రాణె ఫొటోలతో వెలిసిన పోస్టర్లు అంటించారు. కానీ, ఎమ్మెల్సీ కవితకు మాత్రం రైడ్‌కు ముందు తర్వాత ఎలాంటి మరక అంటకుండా  ఉన్నారంటూ అర్థం వచ్చేలా ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నిజమైన రంగులు వెలసిపోవు అంటూ కొటేషన్స్‌ ఇచ్చారు. ఈ పోస్టర్లకు బై బై మోదీ.. అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ పెట్టారు. కాగా, ఈ పోస్టర్లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

మరిన్ని వార్తలు