ఉభయ గోదావరిలో చంద్ర-సేన సిగపట్లు! | Sakshi
Sakshi News home page

ఉభయ గోదావరిలో చంద్ర-సేన సిగపట్లు!

Published Mon, Jan 8 2024 5:39 AM

Cadre is confused with the affairs of leaders of the respective parties - Sakshi

‘పొత్తులతో పోటీ చేస్తే ఉభయ గోదావరులు మనవే’ అని గాలిలో ఈతలు కొడుతున్న టీడీపీ, జనసేన పా ర్టీలకు క్షేత్రస్థాయిలో సిగపట్లు మింగుడుపడడం లేదు. ఇరుపా ర్టీల అధిష్టానాల నుంచి ఎలాంటి సంకేతాలూ రాకముందే పరిస్థితి ఇలా ఉంటే.. సీట్ల ప్రకటన వెలువడే సమయానికి ముదురు పాకాన పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా నియోజకవర్గాల్లో ఆయా పార్టీల నేతల వ్యవహారాలతో కేడర్‌ అయోమయంలో పడుతోంది.

టీడీపీతో జట్టు కట్టడంపై జనసేన నేతలు, ఆ పార్టీ శ్రేణులు ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌పై నిప్పులు చెరుగుతున్నారు. తన సామాజికవర్గాన్ని గంపగుత్తగా చంద్రబాబు వద్ద మోకరిల్లేలా చేసి, త్యాగాలకు సిద్ధం కావాలని దిశానిర్దేశం చేయడంపై జనసేన నేతలు, ఆశావహులు కారాలు మిరియాలు నూరుతున్నారు.  ఇరుపా ర్టీల్లో కనిపిస్తున్నది మేకపోతు గాంభీర్యమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  –సాక్షి ప్రతినిధి, కాకినాడ/ఏలూరు

ఉమ్మడి తూర్పుగోదావరి
♦ కాకినాడ జిల్లా జగ్గంపేట టీడీపీలో సీనియర్‌గా చెప్పుకునే మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జనసేన ఇన్‌చార్జి  పాటంశెట్టి సూర్యచంద్రరావుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇటీవల టీడీపీ–జనసేన సమన్వయ  సమావేశంలో ఇద్దరూ ఒకరిని ఒకరు ఓడిస్తామంటూ  సవాళ్లు – ప్రతిసవాళ్లు చేసుకున్నారు. 

♦ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని జనసేన నిర్ణయించింది. కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం స్థానికేతరుడైన టీ టైమ్‌ అధినేత తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తూ టికెట్‌ రేసులో ఉన్నారు. స్థానికేతరుడైన అతడికి టికెట్‌ ఇస్తే ఓడిస్తామని స్థానిక జనసేన నేతలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు పొత్తులో టీడీపీ ఈ సీటు కోల్పోవాల్సి వస్తే ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే వర్మ స్వతంత్ర  అభ్యర్థిగా బరిలో దిగే ఏర్పాట్లలో ఉన్నారు. 

♦  కాకినాడ రూరల్‌ సీటు జనసేనకేనని ఆ పార్టీ నాయకులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఆ పార్టీ అభ్యర్థిగా నిన్నమొన్నటి వరకూ పంతం నానాజీకి లైన్‌ క్లియర్‌ అయ్యిందని ప్రచారం జరగగా, మారిన రాజకీయ పరిణామాల్లో నానాజీకి కాకుండా ఆర్థికంగా స్థితిమంతుడైన నాయకుడికి కట్టబెట్టే ఆలోచనలో ఉన్నారనే సమాచారంతో ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జనసేనకు కేటాయిస్తే స్వతంత్రంగా పోటీ చేస్తామని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్షి్మ, టీడీపీలో మరో వర్గం నుంచి జెడ్పీటీసీ పేరాబత్తుల రాజశేఖర్‌ కూడా బరిలో ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

♦ కాకినాడ సిటీ కోసం జనసేన ఇన్‌చార్జి ముత్తా శశిధర్, టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు టికెట్‌ ఆశిస్తున్నారు. కొండబాబుకు ఇస్తే పార్టీ నష్టపోతుందని మిగిలిన నాయకులు మోకాలడ్డుతున్నారు. జనసేన నుంచి కాకినాడ లోక్‌సభ స్థానానికి పోటీ చేయాలనుకుంటున్న పారిశ్రామికవేత్త సానా సతీష్‌ కూడా కొండబాబు అభ్యర్థి త్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిణామాలతో టీడీపీ రెండు గ్రూపులుగా విడిపోయింది. 

♦ తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం రూరల్‌ సీటు తమదంటే తమదేనని జనసేన నుంచి కందుల దుర్గేష్‌ ఒకపక్క, టీడీపీ నుంచిæ సిటింగ్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరోపక్క ప్రచారం చేసుకుంటున్నారు. రెండు పార్టీల శ్రేణుల మధ్య విభేదాలు రచ్చకెక్కుతూ పొత్తు చిత్తవ్వడం ఖాయమంటున్నారు. 

​​​​​​​♦రాజానగరం సెగ్మెంట్‌ కోసం టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దివంగత బొడ్డు భాస్కర రామారావు కుమారుడు వెంకట రమణ చౌదరి ప్రచారంలో ఉన్నారు. అయితే ఈ సీటు జనసేనకేనని, అభ్యర్థిని తానేనని అంటూ బత్తుల బలరామకృష్ణ చేస్తున్న ప్రచారం రెండు వర్గాల మధ్య చిచ్చు రేపుతోంది.  

​​​​​​​♦ ఎస్సీలకు రిజర్వ్‌ చేసిన జనసేనకు బలమైన కేడర్‌ ఉన్న అమలాపురం  సీటు తమకే ఇవ్వాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి శెట్టిబత్తుల రాజబాబు పట్టుబడుతున్నారు. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఇప్పటికే పోటీ పడుతూండగా, ఆయనను కాకుండా మాజీ ఎంపీ బుచ్చిమహేశ్వరరావు కుమార్తె పాము సత్యశ్రీని పెద్దాపురం ఎమ్మెల్యే  నిమ్మకాయల చినరాజప్ప తెర మీదకు తీసుకువచ్చారు. దీంతో  ఇరు వర్గాలూ నువ్వా నేనా అనే స్థాయిలో తలపడుతున్నాయి.  ఈ రెండు పా ర్టీల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. 

​​​​​​​♦ గత ఎన్నికల్లో జనసేన గెలుపొందిన ఏకైక నియోజకవర్గం రాజోలు నుంచి బొంతు రాజేశ్వరరావు సీటు కోసం పోటీ పడుతున్నారు. ఈ స్థానాన్ని టీడీపీకే కేటాయించాలని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పట్టుబడుతున్నారు. 

​​​​​​​♦డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం టీడీపీకే ఖాయమైందని మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ప్రచారం చేసుకుంటూండగా.. ఆవిర్భావం నుంచీ లక్షల రూపాయలు తగలేసుకున్న తమను విస్మరించి, టీడీపీకి కేటాయిస్తే తమ సత్తా చాటుతామని జనసేన ఇన్‌చార్జి, బీసీ నాయకుడు పితాని బాలకృష్ణ వర్గం బాహాటంగానే చెబుతోంది. 

♦ కొత్తపేట నియోజకవర్గంలో జనసేన–టీడీపీల మధ్య సీటు కోసం సిగపట్లు నడుస్తున్నాయి. టీడీపీ, జనసేన తరఫున అన్నదమ్ములైన బండారు సత్యానందరావు (టీడీపీ), బండారు శ్రీనివాస్‌ (జనసేన) పోటీ పడుతున్నారు. దీంతో తెలుగు తమ్ముళ్ల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారింది. బండారు  సత్యానందరావుకు పోటీగా మాజీ ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యానికి కేటాయించాలని బీసీ సామాజికవర్గం డిమాండ్‌ చేస్తోంది. 


ఉమ్మడి పశ్చిమ గోదావరి
♦ కొవ్వూరు కోసం టీడీపీ మాజీ మంత్రి  జవహర్, జనసేన నుంచి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు వర్గాలు కత్తులు దూసుకుంటున్నాయి. 

♦  ఏలూరులో జనసేన నుంచి రెడ్డి అప్పలనాయుడు 2019 నుంచి పని చేస్తూండగా, ప్రస్తుతం 2024 ఎన్నికల్లో టికెట్‌ కోసం ఇద్దరు ముగ్గురు నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చివరకు అప్పలనాయుడుకి టికెట్‌ ఇస్తారా లేదా అనేది ప్రశ్నార్థకమే. కాపు సామాజిక వర్గానికి చెందిన, వ్యాపారవేత్త నారా శేషు, మామిళ్ళపల్లి జయప్రకాష్‌ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో ఎవరికి టికెట్‌ ఇచ్చినా మరొకరు సహకరించే పరిస్థితి లేదు. టీడీపీ అభ్యర్థిగా బడేటి రాధాకృష్ణ (చంటి), ఇడా చైర్‌పర్సన్‌గా పని చేసిన మధ్యాహ్నపు ఈశ్వరి భర్త బలరాం టికెట్‌కు ప్రయత్నాలు సాగిస్తూ నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నారు. 

♦ కైకలూరు నియోజకవర్గంలో టీడీపీ, జనసేనల పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది. జనసేన నుంచి బీవీ రావు ఒకపక్క, కొల్లి వరప్రసాద్‌ మరోపక్క పోటీ పడుతున్నారు. కొల్లి మాజీ మంత్రి కామి­నేని శ్రీనివాస్‌కు మద్దతు ఇస్తుంటే.. బీవీ రావు టీడీపీ నాయకులకు మద్దతుగా ఉన్నారు. జనసేన నాయకులను టీడీపీ నేత­లు అసలు పట్టించుకోవడం లేదనే ఆవేదన­తో ఇరు వర్గాలూ కత్తులు దూస్తున్నాయి. 

♦ ఉంగుటూరు నియోజకవర్గంలో జనసేన నుంచి పశ్చమట్ల ధర్మరాజుకు టికెట్‌ ఇస్తారనే ప్రచారం జరుగుతుండగా, టీడీపీ నుంచి గన్ని వీరాంజనేయులు టికెట్‌ ఖాయమైందని ఆయన వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో రెండు పా ర్టీల మధ్య వైషమ్యాలు నేతలకు తలపోటుగా మారాయి. 

♦ పోలవరం సీటు కోసం జనసేన నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన సిర్రా బాలరాజు మరోసారి టికెట్‌ ఆశిస్తుండగా, టీడీపీలో మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్, ప్రగడపల్లి కార్యదర్శి కొవ్వాసి జగదీశ్వరి టికెట్‌ ఆశిస్తున్నారు. ఇక్కడ కూడా సీట్ల సిగపట్లతో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. 

♦ దెందులూరు టికెట్‌ రేసులో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తో టీడీపీ రాష్ట్ర సాధికారత చైర్మన్‌ అశోక్‌గౌడ్, ఈడ్పుగంటి శ్రీనివాస్‌ తలపడుతున్నారు. చింతమనేనికి వ్యతిరేకంగా ముఖ్య నేతలు చంద్రబాబును కలిసి టికెట్‌ ఇవ్వవద్దని ఫిర్యాదులు చేశారు. ఆ సామాజికవర్గం నుంచి ఈడ్పుగంటి శ్రీనుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో టీడీపీలో ఇరువర్గాల వైషమ్యాలూ ఆ పార్టీని రోడ్డున పడేశాయి. 

♦ పాలకొల్లు సీటు టీడీపీకి కేటాయించనున్నా­రని ప్రచారం చేసుకుంటున్న సిటింగ్‌ ఎమ్మె­ల్యే నిమ్మల రామానాయుడు ఆ టికెట్‌ తన­దేని అంటున్నారు. ఈ స్థానం టీడీపీని కాద­ని జనసేనకు కేటాయిస్తే నిమ్మల ఇండిపెండెంట్‌గా వెళ్లడం తప్పదని చెబుతున్నారు. 

♦నూజివీడులో జనసేన నుంచి బర్మా ఫణిబాబు, టీడీపీ నుంచి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పోటీ పడుతున్నారు. 

♦ తణుకులో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రా«ధాకృష్ణ, జనసేన నుంచి విడివాడ రామచంద్రరావు టికెట్‌ ఆశిస్తున్నారు. రామచంద్రరావుకు ఈసారి న్యాయం చేస్తానని, ఇతనే అభ్యర్థని పవన్‌కళ్యాణ్‌ హామీ ఇచ్చినట్టు బెబుతున్నారు. ఆమేరకు ఆయన ప్రచారం కూడా చేసుకుంటున్నారు. మరోవైపు ఎట్టిపరిస్థితుల్లో టికెట్‌ వదలబోమని టీడీపీ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ హడావుడి చేస్తోంది.  

♦ నర్సాపురం టీడీపీలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, ప్రస్తుత ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు, ఎన్నారై కొవ్వలి యతి­రాజు రామ్మోహన్‌ నాయుడు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పోటీ పడుతున్నారు. జనసేన నుంచి బొమ్మిడి నాయకర్‌కు టికెట్‌ ఖాయం అయ్యిందనే ప్రచారంతో టీడీపీ ఆశావహులు రోడ్డెక్కేందుకు సిద్ధంగా ఉన్నారు. 

♦ తాడేపల్లిగూడెంలో టీడీపీ నుంచి వలవల మల్లికార్జునరావు (బాబ్జీ) రేసులో ఉంటే మరోపక్క ఈలి నాని కూడా టికెట్‌ తనదే అని ప్రచారం గట్టిగా చేసుకుంటుండటంతో విభేదాలు తారస్థాయికి చేరుకున్నా­యి. ఇక్కడ బలంగా ఉన్న జనసేనకే సీటు కేటాయించాలని ఇన్‌చార్జి బొలిశెట్టి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే తమ సత్తా చూపిస్తామంటున్న పరిస్థితు­లు రెండు పా ర్టీలకూ మింగుడుపడటం లేదు. 

♦ భీమవరం టీడీపీలో గ్రూపు రాజకీయాలు భగ్గుమంటున్నాయి. ఇక్కడ టీడీపీ ఇన్‌చార్జి తోట సీతారామలక్షి్మపై కేడర్‌లో తీవ్ర అసంతృప్తి ఉంది. పార్టీ పిలుపు మే­రకు చేపట్టిన కార్యక్రమాలు కూడా మొక్కు­బడిగా చేస్తున్న తోటను కాకుండా మెంటే పార్థసారథి, కోళ్ల నాగేశ్వరరావును ప్రతిపాదిస్తున్న పరిస్థితు­లు.. పా ర్టీలోని అంతర్గత విభేదాలను రో­డ్డున పడేసే పరిస్థితి కనిపిçస్తోంది. ఇక్కడ జనసేన నుంచి పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ పోటీ చేసే అవకాశం ఉండటంతో ఆశావహులు దిక్కుతోచని స్థితిలో ప్రత్యామ్నా­య ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. పవన్‌ కాకుంటే ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు (చినబాబు) కూడా రేసులో ఉన్నారు. జనసేన నుంచి ఎవరు బరిలోకి దిగినా మద్దతు ఇచ్చేది లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. 

♦ఉండి సీటు కోసం జనసేన ఇన్‌చార్జి జుత్తిగ నాగరాజు గట్టిగా పట్టుబడుతుండగా.. టీడీపీకే ఇవ్వాలని ఆ పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే మంతెన రామరాజు డిమాండ్‌ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు వర్గం ఎమ్మెల్యే రామరాజుతో విభేదిస్తోంది. ఇక్కడ జనసేన, టీడీపీ పైకి ఐక్యతగా కనిపిస్తున్నా.. అంతర్గత విభేదాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. 

Advertisement

తప్పక చదవండి

Advertisement