ఆక్సిజన్‌ సరఫరా : కేంద్రానికి చుక్కెదురు

7 May, 2021 17:14 IST|Sakshi

కర్నాటకకు 1,200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌, కేంద్రానికి ఎదురుదెబ్బ

కర్నాటక  హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేం : సుప్రీంకోర్టు

సాక్షి న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ తీవ్ర స్తాయిలో విరుచుకుపడుతోంది. మరోవైపు ఆక్సిజన్‌ కొరత వేధిస్తోంది. తమ తగినంత ఆక్సిజన్‌ను సరఫరా  చేయాల్సిందిగా పలు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరు తున్నాయి.  ఈ నేపథ్యంలో కర్నాటకకు ఆక్సిజన్‌  సరఫరా విషయంలో కేంద్రానికి ఎదురు దెబ్బ తగిలింది. కర్నాటకకు రోజువారీ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కేటాయింపును పెంచాలన్న హైకోర్టు ఉత్తర్వుల నిలుపుదలకు సుప్రీంకోర్టు విముఖత వ్యక్తం చేసింది. హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం  దాఖలు చేసిన  పిటిషన్‌ను  శుక్రవారం సుప్రీంకోర్టు విచారించింది. హైకోర్టు అత్యంత జాగ్రత్తగా ఇచ్చిన ఆదేశాలను ఇచ్చిందని, వీటిని తీరస్కరించి కర్ణాటక ప్రజలను  ఇబ్బందుల్లోకి నెట్టలేమని ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి తగిన కారణం ఏదీ తమకు కనిపించడం లేదని జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం  తేల్చి చెప్పింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని  తెలిపింది.

రాష్ట్రానికి రోజువారీ ఆక్సిజన్ సరఫరాను 1,200 మెట్రిక్ టన్నులకు పెంచాలని  కర్ణాటక హైకోర్టు మే 5న కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే  965 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను కర్ణాటకకు సరఫరా చేస్తున్నామని, దీన్ని పెంచలేమని ఈ ఆదేశాలను నిలిపేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంను ఆశ్రయించింది. హైకోర్టు ఉత్తర్వుల్లో ఎలాంటి  హేతుబద్ధత లేదని,  ప్రతీ హైకోర్టు ఇలా ఆదేశాల్విడం మొదలుపెడితే  కష్టమని కేంద్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు.  ప్రభుత్వంతో చర్చించి, సమస్యను పరిష్కరించడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఈ సమస్యపై మద్రాస్, తెలంగాణా, ఇతర హైకోర్టులు కూడా విచారణ జరుపుతున్నాయన్నారు అయితే హైకోర్టు బాగా ఆలోచించి, జాగ్రత్తగా చక్కని ఆదేశాలు  జారీ చేసిందని సుప్రీంకోర్టు కేంద్రం వాదనలను తోసిపుచ్చింది.

మరోవైపు కర్ణాటక కేసును చేపట్టే ముందు, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఢిల్లీకి 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. కాగా  రెండో దశలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. మరీ ముఖ్యంగా బెంగళూరులో అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోద వుతున్నాయి. గురువారం కర్నాటకలో 50,112 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, 346 మంది ప్రాణాలు కోల్పోయారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు