దత్తపుత్రుడి పార్టీకి చంద్రబాబు ఝలక్‌ | Sakshi
Sakshi News home page

దత్తపుత్రుడి పార్టీకి చంద్రబాబు ఝలక్‌

Published Sat, Apr 13 2024 1:07 PM

Chandrababu Big Shock to Pawan Kalyan - Sakshi

రెండు జిల్లాల్లో జనసేనకు దక్కిన టికెట్‌ ఒకటే

మూడు సీట్లు ఇస్తామని ఒకదానితో సరిపెట్టిన వైనం

జనసేన ముసుగులో పాలకొండ టికెట్‌కు మడత

బీజేపీలో ప్రవేశించి ఎచ్చెర్ల సీటుకు ఎసరు

పాలకొండ, ఎచ్చెర్లలో కూటమి అభ్యర్థులుగా టీడీపీ నేతలు

నెల్లిమర్ల ఒక్కటే జనసేన పార్టీకి దిక్కు

పవన్‌కళ్యాణ్‌ మోసం చేశాడంటూ కన్నీరుపెట్టిన పడాల భూదేవి

పవన్‌కళ్యాణ్‌ ప్యాకేజీ నాయకుడని తేలిపోయింది.!. ఏళ్ల తరబడి జనసేన జెండా మోసిన వారికి టికెట్లు లేవు.. పొత్తులో భాగంగా ఇచ్చే టికెట్లనూ టీడీపీ నుంచి అప్పటికప్పుడు జనసేనలోకి వచ్చేవారికే కేటాయించారు. ఇంత జరిగినా చంద్రబాబును కిమ్మని మాట అనడంలేదంటే.. ఆయనవి స్వార్థ రాజకీయాలేనని ఆ పార్టీ వర్గాలే విమర్శిస్తున్నాయి. ప్రతీ ఐదేళ్లకోసారి రాజకీయాన్ని సినిమాగా భావించి.. చంద్రబాబు డైరెక్షన్‌లో సొమ్ముచేసుకుంటున్నాడని, ఆయనను నమ్మి పార్టీ కోసం ఆహర్నిశలు పనిచేసే వారిని నిలువునా ముంచేస్తున్నాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో కూటమి టికెట్ల కేటాయింపే నిలువెత్తు నిదర్శనమని పేర్కొంటున్నారు.

సాక్షి ప్రతినిధి, విజయనగరం: జనసేన పార్టీకి విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మూడు సీట్లు ఇస్తామని... తమ పొత్తు సూపర్‌ హిట్‌ అంటూ రెండు వేళ్లూ గాలిలో ఊపుతూ... ఒక్కటంటే ఒక్కటే టికెట్‌ ఇచ్చిన చంద్రబాబు వెన్నుపోటుకు అసలుసిసలైన బ్రాండ్‌ అంబాసిడర్‌ అని మరోసారి నిరూపించుకున్నారు! ఇదేదో ప్రత్యర్థుల మాట కాదు కూటమిలోనే మోసపోయి గుండె రగిలిపోతున్నవారి మాట! నెల్లిమర్ల టికెట్‌ ఒక్కటి మాత్రమే జనసేన జెండా పట్టుకొని తిరుగుతున్న లోకం మాధవికి దక్కింది. ఎచ్చెర్ల టికెట్‌ను గత ఏడాదే టీడీపీ నుంచి బీజేపీలోకి ప్రవేశించిన నడికుదుటి ఈశ్వరరావు దక్కించుకున్నారు.

పాలకొండ టికెట్‌ అయినా అసలుసిసలైన జనసేన నాయకులకు దక్కుతుందనుకుంటే ఆఖరి నిమిషంలో పసుపు కండువా తీసేసి పార్టీలోకి వచ్చిన నిమ్మక జయకృష్ణకు ఇచ్చేసేశారు. ఇలాంటి ప్రయత్నాలే చేసిన మరో టీడీపీ నాయకురాలు పడాల భూదేవి ఆశలపై నీళ్లుజల్లారు. పవన్‌ కల్యాణ్‌ మాట ఇచ్చినా చంద్రబాబు గిమ్మిక్కులతో సీటు చేజారిపోవడంతో ఆమె కన్నీరుమున్నీరవుతుంది. ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్షా అందామనుకున్న ఆమెకు ఎమ్మెల్యే పదవి అందని ద్రాక్ష అయిపోయింది.

పాలకొండలో పాతనీరే...
టికెట్‌ ఇచ్చేస్తామంటూ పాలకొండ జనసేన నాయకులను ఊరించి... ఊరించి చివరకు కొత్త గ్లాసులో పాత సారా పోసినట్టుగా టీడీపీ జంప్‌ జిలానీ జయకృష్ణకు ఎంపికచేయడమే చిత్రం. జనసేనకు పాలకొండలో రెండు శాతం ఓట్లు లేవని, పాలకొండ టికెట్‌ జనసేన పార్టీకి ఇస్తే ఊరుకునేది లేదని, తేడా వస్తే నిమ్మక జయకృష్ణను ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా బరిలోకి దించుతామని టీడీపీ నాయకులు బీరాలు పలికారు. పొత్తులో భాగంగా జనసేన పార్టీ కోటా టికెట్లను 24 నుంచి 21కు కోతవేసిన నేపథ్యంలో పాలకొండ టికెట్‌ టీడీపీకి రాదని తేలిపోయింది. ఇది గమనించిన పడాల భూదేవి అప్పటివరకూ వేసుకొని తిరిగిన టీడీపీ కండువాను పక్కనపడేసి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌తో సాలువా కప్పించుకున్నారు. ఇక్కడో కొసమెరుపు ఉంది.

గ్లాస్‌ గుర్తుతో పోటీచేయడానికి ఉబలాటపడినా ఆమె మాత్రం ముందు జనసేనలో చేరలేదు. ఇదేదో కొంపముంచే వ్యవహారంలా ఉందని జయకృష్ణ హడావుడిగా టీడీపీ కార్యకర్తలను ఫూల్స్‌ చేస్తూ ఈనెల 1న పిఠాపురం వెళ్లి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఉపేక్షిస్తే లాభం లేదని భూదేవి కూడా ఈ నెల 7న అనకాపల్లి వచ్చిన పవన్‌ కళ్యాణ్‌ను కలిసి ఆమె కూడా జనసేనలో చేరిపోయారు. చివరకు ఈనెల 9న జనసేన అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ పేరు ఖరారైంది. ఎంత ఆశపడిందో కానీ ఈ వార్తతో భూదేవి కంట కన్నీరు జలపాతమైంది. ఆఖరి నిమిషంలోనైనా తనకు బీఫారం ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతానని హూంకరిస్తున్నా... అవేవీ వాస్తవమయ్యే పరిస్థితి కనిపించట్లేదు.

ఈ తాజా జనసేన నాయకుల తీరుపై ఇన్నాళ్లూ పాలకొండ జనసేన ఇన్‌చార్జిగా జెండా మోసిన నిమ్మల నిబ్రమ్‌ అగ్గిమీద గుగ్గిలంలా మండిపడుతున్నారు. తనకు సీటు ఇస్తామని తిప్పించుకున్న పవన్‌ కళ్యాణ్‌ ఆఖరి నిమిషంలో తాజామాజీ టీడీపీ నాయకుడికి టికెట్‌ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పాలకొండలో కూటమి అభ్యర్థిని ఓడిచేందుకు అటు భూదేవి, ఇటు నిబ్రమ్‌ వర్గాలు సన్నద్ధమవుతున్నాయి. పాలకొండ పట్టణంలోని ఓ కళ్యాణమండపంలో గురువారం నిర్వహించిన నాలుగు మండలాల కూటమి నాయకుల సమావేశంలో జయకృష్ణ అభ్యర్థిత్వాన్ని భూదేవి వర్గం వ్యతిరేకించింది. నాలుగు సార్లు ఓడిపోయిన జయకృష్ణకే మళ్లీ టిక్కెట్‌ ఇచ్చారని, ఈ సారి కూడా ఓడిపోవడం ఖాయమని స్పష్టం చేసింది.

Advertisement
Advertisement