అది కత్తి పార్టీ అని ముందే తెలీదా! | Chandrababu Naidu Denied TDP Seat To Undavalli Sridevi In Tiruvuru And Bapatla, Details Inside - Sakshi
Sakshi News home page

అది కత్తి పార్టీ అని ముందే తెలీదా!

Published Mon, Mar 25 2024 7:31 AM

Chandrababu Denied TDP Seat To Undavalli Sridevi - Sakshi

నలుగురినీ మోసం చేసేవాడు నీతో మంచిగా ఉంటున్నాడంటే దాని అర్థం.. నీతో వాడికి ఏదో అవసరం ఉన్నదని.. అవకాశవాదంతో మాత్రమే నీతో మంచిగా ఉన్నాడని!. ఈ మర్మం తెలియకుండా.. చాలా మంది.. ‘వాడు ఎలాంటి వాడైతే నాకేంటి.. నాతో మంచిగానే ఉంటున్నాడు కదా’ అనే కన్వీనియెంట్ ఆత్మవంచనతో స్నేహాలు చేస్తుంటారు, కొత్తబంధాలు కుదుర్చుకుంటూ ఉంటారు. కానీ నీతో అవసరం తీరిన తర్వాత.. అవతలివారి నిజస్వరూపం బయటపడిన తర్వాత బుద్ధి వస్తుంది. అప్పటికి సరిదిద్దుకోవడానికి ఏమీ మిగలదు.. ఆ చేదు అనుభవం తప్ప! చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమవుతుంది? ఈ వ్యవహారం కూడా అంతే!.

ఈ ఉపోద్ఘాతం మొత్తం ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవికి అతికినట్టుగా సరిపోతుంది. తాడికొండ ఎమ్మెల్యేగా.. వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున గెలిచి.. అనర్హురాలిగా ప్రకటింపబడిన శ్రీదేవి ఇప్పుడు గొల్లుమంటున్నారు. రాజకీయ భిక్ష పెట్టిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మోసం చేసి.. చంద్రబాబు పంచన చేరి దొడ్డిదారిలో ఆయనకు చేసిన మేలుకు తనకు తగిన శిక్ష పడింది. ఆమె బహుశా పశ్చాత్తాప పడుతున్నట్లే కనిపిస్తున్నారు. కానీ ఏమిటి ప్రయోజనం? గత జల సేతుబంధనం అంటే ఇదే!. 

ఇంతకూ ఏం జరిగిందంటే.. సీఎం జగన్ అనుగ్రహంతో ఉండవల్లి శ్రీదేవి తాడికొండ ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటినుంచి నియోజకవర్గంలో విచ్చలవిడిగా అవినీతి దందాను ప్రారంభించారు. ఇసుక దందాలు, పేకాట క్లబ్బులు నిర్వహించారనే అపకీర్తిని మూటగట్టుకున్నారు. పోలీసు అధికారులతో చాలా దురుసుగా మాట్లాడిన ఆడియో రికార్డులన్నీ అప్పట్లో బయటకు వచ్చాయి. తీరు మార్చుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్‌ పలుమార్లు సూచించినా ఫలితం లేకుండా పోయింది. నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటుదనే ఉద్దేశ్యంతో అక్కడ ఎమ్మెల్యేగా ఆమెను పక్కన పెట్టి వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్‌ను మార్చారు. 

దీంతో, ఉండవల్లి శ్రీదేవి చంద్రబాబుతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని.. గత ఏడాది ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశానికి ఓటు వేసి, వైఎస్సార్‌సీపీకి వెన్నుపోటు పొడిచారు. పార్టీ ఆమెను సస్పెండ్ చేశాక.. పదవిలో మాత్రం కొనసాగారు. ఇటీవల స్పీకర్‌ ఆమెను అనర్హురాలిగా కూడా ప్రకటించారు. అయితే.. తెలుగుదేశానికి దొడ్డిదారిలో చేసిన ఫేవర్‌కు ప్రతిఫలంగా ఆమె తిరువూరు ఎమ్మెల్యే లేదా, బాపట్ల ఎంపీ సీటును ఆశించారు. కానీ.. ఆమెతో అవసరం తీరిపోయినందున చంద్రబాబు ఖాతరు చేయలేదు. ఆ రెండు స్థానాలనూ వేరే వారికే కేటాయించేశారు.

ఈ ఘటనలతో శ్రీదేవికి జ్ఞానోదయం అయింది. ‘రాజకీయాలు ఎలా ఉంటాయో.. ఎవరు ఎలాంటి వారో ఈరోజు అర్థం అయ్యింది!!’ అంటూ హ్యాష్ ట్యాగ్ బాపట్ల అని ఒక కత్తి బొమ్మతో సహా ఆమె ట్వీట్ చేశారు. ఇక్కడ కత్తి బొమ్మకు అర్థమేమిటి అనేదే చర్చ. బాపట్ల టికెట్‌ ఇస్తానని చెప్పిన చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనేది ఆమె ఉద్దేశం కావొచ్చునని ట్వీటు చూసిన వారి ఊహ. తెలుగుదేశం వెన్నుపోటుల కత్తిపార్టీ అని కూడా ఆమె ఆగ్రహించి ఉండవచ్చు. అయితే, అది కత్తి పార్టీ అనే సంగతి ముందే తెలియదా అని, మామను కూలదోసి పార్టీని కబ్జాచేసిన చంద్రబాబు వెన్నుపోటులకు బ్రాండ్ అంబాసిడర్ అని తెలియదా? అంటూ రకరకాలుగా ఇప్పుడు ప్రజలు ఆమె ట్వీట్‌పై కామెంట్ చేసుకుంటున్నారు. అయినా కత్తి బొమ్మతో నిరసన తెలియజెప్పే హక్కు ఆమెకు లేదని, తనకు రాజకీయ భిక్ష పెట్టిన సీఎం జగన్‌ను వెన్నుపోటు పొడిచిన ప్రతిఫలమే ఇప్పుడు అనుభవిస్తున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

-వంశీకృష్ణ

Advertisement
Advertisement