బోగస్‌ ఓట్లకు బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు | Sakshi
Sakshi News home page

బోగస్‌ ఓట్లకు బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు

Published Sat, Jan 6 2024 10:10 AM

Chandrababu Fake Votes Creation TDP Bogus Votes - Sakshi

ఎన్నికలలో అక్రమాలు ఎలా చేయాలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు తెలిసినంతగా మరెవ్వరికి తెలియదంటారు. ఓటర్ల జాబితాలో దొంగ ఓట్ల చేర్పు నుంచి, వ్యతిరేకుల ఓట్ల తొలగింపు వరకు, పొరుగు రాష్ట్రాల నుంచి బోగస్ ఓటర్లను తీసుకు రావడం నుంచి , తాను చేసే అవకతవకలన్నిటిని ఎదుటివారిపై రుద్దడం వరకు ఆయనకు ఆయనే సాటి. ఒక విధంగా చెప్పాలంటే ఆయన కు ఈ సబ్జెక్టు లో డాక్టరేట్ ఇవ్వవచ్చు. దొంగ ఓట్లు అధికంగా వేయడం టీడీపీ ఆవిర్భావం నుంచే అయితే, బోగస్ ఓట్లను సృష్టించడం, ఎన్నికలలో విపరీత వ్యయం చేయడం చంద్రబాబు టీడీపీని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి అంటే ఆశ్చర్యం కాదు.

✍️ఈ మధ్యకాలంలో తెలుగుదేశం మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి దొంగఓట్లు అని, టీడీపీ  ఓట్లను తొలగిస్తున్నారని విపరీత ప్రచారం చేస్తున్నప్పుడే అనుమానం వచ్చింది. బహుశా టీడీపీ వీటన్నిటిని భారీగా చేయడానికి రంగం సిద్దం అవుతున్నదేమోనని.తాజాగా వచ్చిన వార్తలుచూస్తే అది నిజమని తేలిపోయింది. ఏకంగా హైదరాబాద్ లో ప్రత్యేక క్యాంపులు పెట్టి ఏపీ ఓటర్ల జాబితాలో టీడీపీ సానుభూతిపరులను చేర్పిస్తున్నారు. ఎంత ధైర్యం. వ్యవస్థలు తమ గుప్పిట్లోనే ఉంటాయిలే అన్న భావన. ముందుగానే దొంగ,దొంగ అని అరిస్తే తమ జోలికి రారులే అన్న తెంపరితనం వంటివి ఉండబట్టే ఇలా చేయగలుగుతున్నారు. ఏ రాజకీయ పార్టీ దొంగ ఓట్లను చేర్పించినా తప్పే.అలాగే ఎవరిదైనా నిజమైన ఓటు తొలగించినా సరికాదు. కాని ప్రస్తుతం టిడిపి నేతలు కాని, ఆ పార్టీకి కొమ్ముకాస్తూ నానా పాట్లు పడుతున్న ఈనాడు రామోజీరావు వంటివారు దీనిపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీపైన , ప్రభుత్వంపైన దుమ్మెత్తి పోస్తున్నారు. 

✍️ఈనాడు, జ్యోతి వంటి మీడియాలు ఒకవేళ రెండు పార్టీలు అలాంటివి చేస్తుంటే ,ఇద్దరి గురించి రాయవచ్చు. అలాకాకుండా టీడీపీ ఎంతో  సత్యసంధత కలిగిన పార్టీ అయినట్లు, వైసిపి అచ్చంగా దొంగ  ఓట్లను చేర్చే పార్టీ అయినట్లు తప్పుడు వార్తలు ఇస్తున్నారు.నిజానికి చంద్రబాబుకు మొదటి నుంచి ఈ అలవాటు ఉంది. 1999 లో   మొదటిసారి  ఆయన ఎన్నికలలో డబ్బు పంపిణీకి డ్వాక్రా సంఘాల మహిళలను వినియోగించారని వార్తలు వచ్చాయి. అది కూడా ఎన్నికలు అయిపోయాకే తెలిసింది. అంత గుట్టు చప్పుడు కాకుండా ఆయన చేయగలరు. అలాగే దొంగ ఓట్ల విషయంలోను ఎవరికి తెలియకుండా జాగ్రత్తపడ్డారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉండేది. 2004 ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆ పార్టీ శాసనసభ పక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆద్వర్యంలో అలాంటి దొంగ ఓట్లన్నిటిని ఒక  పెద్ద జాబితా తయారు చేసి ఒక ర్యాలీగా వెళ్లి ఎన్నికల ముఖ్య అధికారికి అందచేశారు.అప్పటివరకు ఇంత భారీ ఎత్తున బోగస్ ఓట్లు చేర్చుతారన్న సంగతే ప్రజలకు పెద్ద గా తెలియదంటే అతిశయోక్తి కాదు.

✍️తెలుగుదేశం 1983లో ఆవిర్భవించింది. అంతకు పూర్వం ఈ దొంగ ఓట్ల గోల చాలా తక్కువగా ఉండేది. 1983 లో ప్రముఖ సినీ నటుడు ఎన్ టి రామారావు పార్టీని స్థాపించడంతో ఆయనపై అభిమానంతో ఉమ్మడి ఏపీలో ప్రత్యేకించి కోస్తా,రాయలసీమ జిల్లాలలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేశారు. అంటే వేరే వారి ఓటును ఇంకొకరు వేసేయడం అన్నమాట. అసలు ఓటరు వచ్చేసరికి అక్కడ ఓటు వేసేసినట్లు నమోదు అయి ఉండేది.అప్పటికి ఇంకా ఈ బోగస్ ఓట్ల సృష్టి మొదలు కాలేదు. తదుపరి చంద్రబాబు నాయుడు టీడీపీలోకి రావడం, పార్టీలో కీలకభూమిక పోషించడం, ఎన్ టి రామారావును పదవినుంచి లాగేసి తాను అధిష్టించడం, ఆ తర్వాత ఎన్నికల కోసం బోగస్ ఓట్లను కూడా తయారు చేయడం ఆరంభించారు. 1983లో ఓటమి తర్వాత చంద్రబాబునాయుడు చంద్రగిరి నుంచి కుప్పంకు మారి, దానిని ఈ బోగస్ ఓట్లకు ప్రయోగశాలగా మార్చారు.

✍️పొరుగు రాష్ట్రాలు తమిళనాడు,కర్నాటక ల నుంచి కూడా జనాన్ని తెచ్చి ఓటర్లుగా నమోదు చేయించడం, పోలింగ్ రోజున వారితో వేయించడం, వీలైతే ఇతర మార్గాల ద్వారా నకిలీ ఓట్లను సృష్టించడం కూడా చేశారు. దివంగత నేత, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి చంద్రమౌళి దీనిపై పరిశోధన చేశారు. ఆయన కుప్పంలో చంద్రబాబుపై పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత మొత్తం ఓటర్ల జాబితాను పరిశీలిస్తే ముప్పైవేలకు పైగా ఇతర రాష్ట్రాల ఓటర్లు కాని, దొంగ ఓట్లు కాని ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత వాటిపై ఆయన ఫిర్యాదులు ఇవ్వడం ఆరంభించారు. తద్వారా ఒక పదిహేడువేల వరకు తగ్గించగలిగామని అప్పట్లో చెబుతుండేవారు. అందువల్లే గత ఎన్నికలలో ఆయన మెజార్టీ కూడా బాగా తగ్గింది. చంద్రమౌళి అనారోగ్యంతో మరణించడంతో ఆయన కుమారుడు భరత్ కూడా ఆ దొంగ ఓట్లను తొలగించడానికి యత్నిస్తున్నారు. 

✍️చంద్రబాబు తన అనుభవాన్ని రాష్ట్రవ్యాప్తం చేశారు. 2024 ఎన్నికలలో గెలవకపోతే టీడీపీకి, తన కుమారుడు లోకేష్ కు భవిష్యత్తు ఉండదన్న భయంతో మీడియా అధిపతులుగా ఉన్న రామోజీ,రాధాకృష్ణ తదితరుల అండతో భారీ ఎత్తున ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని అర్ధం అవుతుంది.పర్చూరు, అద్దంకి మొదలైన నియోజకవర్గాలలో దొంగ ఓట్ల తొలగింపు వార్తలు చదివితే టీడీపీ ఎన్ని కుట్రలు అయినా చేస్తుందన్న విషయం బోదపడుతుంది.తెలంగాణ ఎన్నికలు ముగిసిన వెంటనే హైదరాబాద్ లో ఉండే  టీడీపీ సానుభూతిపరులను ఎపి ఓటర్లుగా మార్చడానికి పెద్ద కార్యక్రమమే చేపట్టారు.ఇందుకోసం బానర్ లు కూడా కట్టి శిబిరాలు నిర్వహించారంటే ఏమనుకోవాలి?నిజానికి ఏ వ్యక్తికైనా ఒకే చోట ఓటు ఉండాలి.రెండు చోట్ల ఉంటే అది నేరం కూడా అవుతుంది. 

✍️అయినా టీడీపీ ప్రత్యేక డ్రైవ్ ద్వారా దొంగ ఓట్లను నిర్భీతిగా చేర్చుతోంది.అంతేకాక గతంలో సేవామిత్ర పేరుతో ఓటర్ల వ్యక్తిగత వివరాలు సేకరించిన టీడీపీ, ఇప్పుడు మరో పేరుతో యాప్ ను తయారు చేసి వినియోగిస్తోందట. తద్వారా వ్యతిరేక ఓటర్లను గుర్తించి వారి పేర్లను జాబితా నుంచి తొలగించడానికి పన్నాగం పన్నిందట. విశేషం ఏమిటంటే ఈ మధ్య ఒక టిడిపి ఎమ్మెల్యే  మీడియా సమావేశం పెట్టి మంగళగిరిలో ఒక అడ్రస్ ఇచ్చి సుమారు ఏభై ఓట్లు ఉన్నాయని వెల్లడించారట. తీరా అవి టిడిపివారే చేర్పించినవని తెలిశాక నాలుక కరుచుకున్నారట.టిడిపి వారు చేర్పించిన దొంగ ఓట్లను కాపాడే బాధ్యతను రామోజీరావు, రాధాకృష్ణలు తమ భుజాన వేసుకున్నారు. ఎక్కడైనా వైసిపివారివి ఉంటే వాటిపై కొండెక్కి కూయడం కూడా చేస్తుంటారు. 

✍️మీడియా ఇంత దుర్మార్గంగా మారడం ఇప్పుడే చూస్తున్నాం. దీనిపై టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లు పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకున్నాయి. అయితే తాము చప్పిన ఓట్లను తొలగించకపోతే అధికారుల నిర్లక్ష్యం అని టీడీపీ మీడియా ప్రచారం చేస్తోంది. ఈ మధ్య కొత్తగా ఒక దుకాణం మొదలైంది. సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ పేరుతో మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఒక తంతు నడుపుతున్నారు. ఆయన టీడీపీ బోగస్ ఓట్ల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్నప్పుడు ఎంత అరాచకంగా పనిచేసింది.. ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరించింది అంతా గమనించారు. కాని ఆయన ఇప్పుడు సుద్దులు చెబుతుంటే ప్రజలు నవ్వుకునే పరిస్థితి ఏర్పడింది. ఆయనకు తోడు మరో మాజీ డీజీపీ కూడా ఒక సదస్సులో పాల్గొనడం వింతగా ఉంది.ఆయన 1994 లో విధులలో ఉంటూనే  తన సోదరుడి టిక్కెట్ ను తీసుకోవడానికి ఏకంగా గాంధీ భవన్ కే వెళ్లారు. 

✍️అలాంటివారితో ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తామని కొందరు స్వార్ధపరులు బయల్దేరారు. ఇదే సందర్భంలో ఎన్నికలలో డబ్బు ఖర్చు చేయడం గురించి కూడా చెప్పుకోవాలి. ఎన్ టి రామారావు టైమ్ లో డబ్బు అంతగా ఖర్చు పెట్టేవారు కాదు. ప్రధాన రాజకీయ పక్షంగా ఉన్న కాంగ్రెస్ కూడా అలాగే ఉండేది. కాని చంద్రబాబు సి.ఎమ్. అయ్యాక డబ్బు ఎలా ఖర్చు పెట్టి ఎన్నికలను గెలవవచ్చో అందరికి తెలియచెప్పారనుకోవాలి. అత్తిలి నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగితే ఓటర్లకు నగదుతో పాటు స్వీట్ బాక్స్ కూడా ఇప్పించారని అప్పట్లో మంత్రిగా పనిచేసిన వేణుగోపాలాచారి ఒక టీవీ డిబేట్లో వెల్లడించారు. అది మొదలు ఓటు విలువను రెండువేల వరకు తీసుకు వెళ్లారు. తెలుగుదేశం పార్టీ వెనుక తిరుగుతున్న జనసేన కూడా ఆయా అంశాలలో టీడీపీ  మార్గాన్నే  ఎంపిక చేసుకున్నట్లుంది. 

✍️జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు తెలంగాణ ఎన్నికలు ముగిసిన వెంటనే హైదరాబాద్ లోని తన ఓటును కుటుంబంసహా  మంగళగిరి సమీపంలోని వడ్డేశ్వరంలో చేర్పించుకున్నారని వార్తలు వచ్చాయి. టీడీపీతో కలిసి వెళితే వారు ఎన్ని తక్కువ సీట్లు ఇచ్చినా, డబ్బు బాగా ఇస్తారన్న ఆశతో జనసేన అధినాయకత్వం పొత్తు పెట్టుకోవడానికి సిద్దమవుతోందన్న అభిప్రాయం కూడా లేకపోలేదు. తెలంగాణ, కర్నాటక, తమిళనాడు ,ఒడిషా వంటి సరిహద్దు రాష్ట్రాలలో నివసిస్తున్న తమ మద్దతుదారులను ఎపి లో కూడా ఓటర్లుగా చేర్పించడానికి టిడిపి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికి వైసిపి రంగంలోకి దిగింది.

✍️నిజానికి ఆధార్ కార్డు ఆధారంగా డబుల్ ఓట్ల సమస్యను తొలగించవచ్చు.కాని న్యాయపరమైన సమస్యల కారణంగా ఆ విషయంలో అధికారులు ముందుకు వెళ్లలేకపోతున్నారు. ఏది ఏమైనా ఇలాంటి విషయాలలో చంద్రబాబును ఎదుర్కోవాలంటే అంత తేలికైన విషయం కాదని దొంగ ఓట్లు, బోగస్ ఓట్ల విషయంలో వస్తున్న వార్తలను పరిశీలిస్తే అర్ధం అవుతుంది.


-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్.

Advertisement

తప్పక చదవండి

Advertisement