బాబు ఊకదంపుడు.. జారుకున్న జనం! 

27 Feb, 2021 06:26 IST|Sakshi
కడపల్లె సభలో మాట్లాడుతున్న చంద్రబాబు 

అధికారంలో ఉన్నప్పుడు కుప్పం అభివృద్ధిపై నిర్లక్ష్యం 

ప్రాజెక్టులను పూర్తిచేయడంలో అలసత్వం

విపక్షంలోకి రాగానే ప్రభుత్వంపై విమర్శల వర్షం

ఆత్మస్తుతి.. పరనిందే చంద్రబాబు నైజం 

ఘనత వహించిన చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని 14 ఏళ్లపాటు పాలించారు.. అభివృద్ధికి తానే అడ్రస్‌ అని ప్రగల్బాలు పలికారు.. ఏడు పర్యాయాలు కుప్పం వాసుల నుంచి ఓట్ల కప్పం వసూలు చేసుకున్నారు. కానీ, అక్కడి ప్రజల దాహార్తిని తీర్చడంలో విఫలమయ్యారు. అన్నదాతలకు సాగునీరు అందించకుండా కబుర్లతో కాలక్షేపం చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాసుల కోసం కాంట్రాక్టర్లకు కొమ్ముకాశారు. తీరా అధికారం కోల్పోయాక నా నియోజకవర్గం అంటూ గుండెలు బాదుకుంటున్నారు. అసలు నిజాలను పక్కదోవ పట్టించేందుకు ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారు.

సాక్షి ప్రతినిధి, తిరుపతి/కుప్పం: నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు తన సొంత నియోజకవర్గానికి నీరందించడంలో పూర్తిగా విఫలమయ్యారు. తనను ఏడు పర్యాయాలు గెలిపించి అక్కున చేర్చుకున్న కుప్పం అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టించుకోకుండా 18 నెలల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. నేను పులివెందులకు నీళ్లిచ్చా.. మరి మీరు కుప్పానికి ఎందుకు ఇవ్వరంటూ అర్థంలేని ప్రశలను సంధిస్తున్నారు. గండికోట ప్రాజెక్టును దివంగత ముఖ్యంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పూర్తి చేయబట్టి పులివెందులకు నీళ్లొచ్చాయి. మరి కుప్పానికి నీరు రావాలంటే హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రాజెక్టు పనులు పూర్తికావాలి.

తన హయాంలో అప్పటి టీడీపీ నేత, ప్రస్తుత బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌‌ కన్‌స్ట్రక్షన్స్, వైఎస్సార్‌ జిల్లా అప్పటి టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి సంస్థకు కాంట్రాక్టులు అప్పగించడం వల్లే ఈ ప్రాజెక్టు ఆలస్యమైన విషయం బాబుకు తెలియదా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రతిపాదిత అంచనాలు పెంచి కాసులు మూటగట్టుకున్నారే కానీ, పనులు పూర్తి చేయలేదని విమర్శిస్తున్నారు. సకాలంలో ఆ ప్రాజెక్టు పూర్తిచేసి ఉంటే కుప్పానికి ఎప్పుడో నీళ్లు వచ్చేవని వెల్లడిస్తున్నారు. ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చొరవ వల్లే పుంగనూరు వరకు కృష్ణా జలాలు వచ్చాయని స్పష్టం చేస్తున్నారు.

పాలారు ప్రాజెక్టును అడ్డుకున్నారు 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2008లో కుప్పం మండలం గణేష్‌పురం వద్ద రూ.55 కోట్లతో పాలారు ప్రాజెక్టు నిర్మించేందుకు నిధులు కేటాయించారు. నిర్మాణ పనులు ప్రారంభించే సమయంలో చంద్రబాబు తెరవెనుక మంత్రాంగం నడిపి తమిళనాడు హైకోర్టులో కేసు వేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రాజెక్టు నిలిచిపోతే స్థానిక ఎమ్మెల్యేగా చంద్రబాబు మిన్నకుండిపోవడమే ఇందుకు నిదర్శనమని గుర్తు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పరాభవాన్ని జీర్ణించుకోలేక ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గంటల తరబడి ఊకదంపుడు..
చంద్రబాబు రాజుపేట రోడ్డు, రామకుప్పం, శాంతిపురంలో ప్రసంగించారు. విషయం లేకపోయినా గంటల తరబడి ఊకదంపుడు ఉపన్యాసమే కొనసాగడంతో పలుచోట్ల జనం మెల్లగా జారుకోవడం కొసమెరుపు.
చదవండి:
చంద్రబాబు మేనిఫెస్టో.. ఓ 420 వ్యవహారం 
జగన్‌ దెబ్బకు కుప్పానికి పరుగు

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు