పవన్‌ అసమర్థుడు.. జగన్ గట్స్ ఉన్న లీడర్ | Harirama Jogaiah Son Surya Prakash Set To Join YSRCP - Sakshi
Sakshi News home page

జనసేనకు షాకిచ్చిన హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాష్‌.. వైఎస్సార్‌సీపీలో చేరిక

Published Fri, Mar 1 2024 3:55 PM

Chegondi Harirama Jogaiah Son Suryaprakash Join YSRCP News - Sakshi

సాక్షి, గుంటూరు: జనసేనకు భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీని వీడిన చేగొండి సూర్యప్రకాష్‌ వైఎస్సార్‌సీపీలో చేరారు. శుక్రవారం సాయంత్రం తాడేపల్లిలోని సీఎం కార్యాలయానికి వచ్చిన ఆయన.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనసేనాని తీరును ఎండగట్టారు.

పార్టీ నేతలతో కూడా మాట్లాడే టైం లేదా?.. కనీసం పార్టీ బూత్‌ కమిటీలను ఏర్పాటు చేయలేరా? అని పవన్‌ను ప్రశ్నించారు సూర్యప్రకాశ్‌. ‘‘జనసేనలో నేను పని చేసిన ఈ ఆరేళ్లలో అరగంట మాత్రమే నాతో పవన్‌ మాట్లాడారు. పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం ఏమాత్రం చేయకపోగా.. చంద్రబాబును సీఎంను చేయాలనే ఆరాటపడ్డారు. సామాజిక న్యాయం గురించి పవన్‌కు ఏమాత్రం తెలియదు. జనసేనలో మాట్లాడే స్వేచ్ఛ ఉండదు’’ అని సూర్యప్రకాష్‌ అన్నారు.

.. పవన్ కల్యాణ్ని నమ్మి గతంలో  జనసేనలో చేరాను. పవన్ బడుగు, బలహీన వర్గాలకు దగ్గరగా ఉంటారనుకున్నా. ఏ ఆశలతో వెళ్లానో ఆ ఆశలన్నీ నీరు గార్చారు. పైకి కనిపించే పవన్ వేరు, తెర వెనుక వేరే. నేతలకు కూడా పవన్ విలువ ఇవ్వరు. చంద్రబాబునో, లోకేష్‌నో సీఎం చేయటానికే పవన్ పనిచేస్తున్నారు. అంతేతప్ప పార్టీ అభివృద్ధి కోసం పని చేయలేదు. పార్టీని నమ్ముకున్న వారంతా పవన్ని నమ్మి మోసపోయారు. ఇంట్లోకి కూడా కనీసం ఆహ్వానించరు. సినిమా హాల్లో టికెట్ కొనుక్కున్నట్టు ఇంటి బయట నిలబడాలి. పీఏసీ సభ్యుడిగా ఉన్నా.. స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఏనాడూ నాకు ఇవ్వలేదు.

ఆయన నాదెండ్ల మనోహర్ చెప్పే మాటలు తప్ప ఎవరి మాటలూ వినరు. సలహాలు సూచనలు ఇవ్వొద్దనే నాయకుడ్ని పవన్నే చూశా. ఇలాంటి వ్యక్తి పార్టీని నడిపేకంటే క్లోజ్ చేసి ఇంట్లో కూర్చుంటే మంచిది. అవసరం ఉన్నంతసేపు హరిరామజోగయ్యని వాడుకున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నాక జోగయ్యను ఎందుకు వదిలేశారు?. ఏం లబ్ది చేకూరటం వలన చంద్రబాబు పంచన చేరారు?.. 

.. సలహాలు ఇచ్చేవారిని వైఎస్సార్‌సీపీ కోవర్టులంటూ పవన్‌ బహిరంగంగా అన్నారని.. ఏం ఆశించి పార్టీ పెట్టారో పవన్‌కే క్లారిటీ లేదని అన్నారు. వచ్చే ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. మనసు చంపుకుని ఆ పార్టీలో ఉండలేక.. ఇవాళే పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని.. పదవికి రాజీనామా ఈ ఉదయమే పంపించానని చెప్పారాయన. బేషరతుగా వైఎస్సార్‌సీపీలో చేరానని చెప్పారాయన. ‘‘ఆ పార్టీలో ఉండటం మనసొప్పక జనసేన నుండి బయటకు వచ్చాను. జగన్ గట్స్ ఉన్న లీడర్. అలాంటి నాయకుని వెనుక నడవాలని అనుకుంటున్నా. ఏమీ ఆశించకుండా పార్టీలో జాయిన్ అయ్యాను. క్రమశిక్షణ గల నేతగా వైఎస్సార్‌సీపీ కోసం పని చేస్తానని.. ఇక నుంచి నా ప్రయాణం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే అని సూర్యప్రకాశ్‌ చెప్పారు.

మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరిరామ జోగయ్య కుమారుడే ఈ సూర్య ప్రకాష్‌. జనసేనలో గత కొన్నేళ్లుగా కీలక నేతగా వ్యవహరిస్తూ వచ్చారాయన. ఇక.. పొత్తులో భాగంగా జనసేన తరఫున 24 సీట్లు దక్కించుకున్న పవన్‌పై హరిరామ జోగయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement