ఏ సంపద సృష్టించావు బాబూ? సీఎం వైఎస్‌ జగన్‌ | Sakshi
Sakshi News home page

ఏ సంపద సృష్టించావు బాబూ? సీఎం వైఎస్‌ జగన్‌

Published Sun, Apr 28 2024 5:48 AM

CM YS Jagan Fires On Chandrababu

14 ఏళ్లూ రెవెన్యూ లోటే ఉంటే బాబు సృష్టించిందేంటి?
 

ఆయనకు ముందు, తర్వాత ‘మిగులు’ ఎలా వచ్చింది?
 

ఆయనకు ఆర్థిక క్రమశిక్షణ లేకపోవటం వల్లే కదా!
 

రాష్ట్రానికి ఎక్కువ అప్పులు తెచ్చింది కూడా చంద్రబాబే
 

మూలధన వ్యయం ఎవరి హయాంలో ఎక్కువో తెలియదా?
 

నాడు ఏటా రూ.15,227 కోట్లు ఖర్చుచేస్తే... ఇప్పుడది రూ.17,757 కోట్లు
 

పోర్టులు, హార్బర్లు, మెడికల్‌ కాలేజీలు.. ‘నాడు–నేడు’ అన్నీ ఇప్పుడే..
 

దేశ జీడీపీలో మన వాటా నాడు 4.47 శాతమైతే ఇప్పుతడు 4.83 శాతం
 

అడ్డంగా జనంపై పడి పన్నులు బాదేసింది కూడా బాబే.. 
 

నాడు జీడీపీలో పన్నుల వాటా  6.57 శాతం... ఇప్పుడు 6.35 శాతమే
 

గణాంకాలతో సహా వివరించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: అలవికాని హామీలిస్తూ.. వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చని చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు... ఈసారి మరిన్ని మోసపూరిత హామీలతో ముందుకు వచ్చే ప్రమాదం కనిపిస్తోందని, అంతా జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. ఇప్పటిదాకా చంద్రబాబు ఇచ్చిన హామీలకే తాము వెచ్చిస్తున్న మొత్తం కన్నా దాదాపు రెట్టింపు అవుతోందని, ఇది నెరవేర్చే అవకాశం లేకపోయినా.. తాను సంపద సృష్టించి ఇవన్నీ చేస్తా­నని బాబు మాయమాటలు చెబుతున్నారని దుయ్య­బట్టారు. ప్రతి సందర్భంలోనూ ‘నేను సంపద సృష్టిస్తా.. సంపద సృష్టిస్తా’ అని చంద్రబాబు అరిచే అరుపుల వెనక మర్మాన్ని ముఖ్యమంత్రి శనివారం మేనిఫెస్టో విడుదల సందర్భంగా గణాంకాలతో సహా వివరించారు. అవి ఆయన మాటల్లోనే... 

జగన్‌ అబద్ధాలు చెప్పడు... 
వీళ్లంతా కూడా అబద్ధానికి రెక్కలు కట్టి ఎలా మోసం చేస్తారో తెలియజేయడానికే ఇదంతా చెబుతున్నా. ఇది ధర్మమేనా? అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పదలచుకున్నా. నేను చేయలేకపోతే చేయలేనని చెబుతా. అంతే తప్ప అబద్ధాలు ఆడను. మోసం చెయ్యను. పేదలను ప్రేమించే, అభిమానించే విషయంలో మేనిఫెస్టోలో పెట్టినా, పెట్టకపోయినా జగన్‌ వేసినన్ని అడుగులు బహుశా రాష్ట్ర చరిత్రలో ఎవరూ వేయలేదు. వేయలేరు కూడా. 

మేనిఫెస్టోలో లేనివి కూడా... 
ఈ 58 నెలల కాలంలో మేనిఫెస్టోలో లేని అంశాలెన్నిటినో అమల్లోకి తెచ్చాం. కాపునేస్తం, ఈబీసీ నేస్తం, పిల్లలకు విద్యాకానుక, గోరుముద్ద ఇవేవీ 2019 మేనిఫెస్టోలో లేవు. కానీ ఇప్పుడు అమలవుతున్నాయి. అలాగే పిల్లలకు ట్యాబ్‌లు, ఆరోగ్య శ్రీని రూ.25లక్షలకు పెంచటం, 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలివ్వటం... ఇవన్నీ మేనిఫెస్టోలో చెప్పకుండానే చేసి చూపించాం. అందుకే చెబుతున్నా. అబద్ధాలు చెప్పి నేను చంద్రబాబుతో పోటీ పడదల్చుకోలేదు. కారణం... అది అబద్ధమని తెలిసి కూడా చెప్పటం ధర్మం కాదు కాబట్టి. చేయగలిగిందే చెబుతా. అవకాశం ఉంటే పేదల కోసం పది అడుగులు ముందుకే వేస్తా.  

14 ఏళ్ల పాలనలో ఎప్పుడూ రెవెన్యూ లోటే... 
జగన్‌ చేయలేకపోయాడు. నేను సంపద సృష్టిస్తాను కనుక చేయగలుగుతానని చంద్రబాబు నాయుడు ప్రతి సందర్భంలోనూ అంటుంటాడు. అలా తాను చెప్పే అబద్ధాలి్న, చేసే మోసాల్ని  నిస్సిగ్గుగా డిఫెండ్‌ చేసుకుంటాడు. మరి తన 14 ఏళ్ల పాలనలో ఏ సంపద సృష్టించాడు? అసలు ఆయన పాలించిన ఏ ఒక్క సంవత్సరంలోనైనా రెవెన్యూ మిగులు ఉందా? ప్రతి ఏటా లోటే కదా? మరి రెవెన్యూ వ్యయానికే రెవెన్యూ లోటు అవుతున్నప్పుడు... సంపద ఎక్కడ నుంచి సృష్టించారు? మరి చంద్రబాబు అధికారంలో లేక ముందు గానీ... తర్వాత గానీ ఎప్పుడు చూసినా రెవెన్యూ మిగులు కనిపిస్తుంది. ఇదీ వాస్తవం.

అసలు ఇన్ని సంవత్సరాలు రెవెన్యూ లోటు అన్నది ఒక్క చంద్రబాబు పాలనలోనే కనిపిస్తుంది. అంటే లెక్కలన్నీ చంద్రబాబు సంపద సృష్టించలేదని చెబుతున్నాయి. ఎందుకంటే ఆయనకు సంపద సృష్టించే శక్తి లేదు. సమగ్రమైన ఆర్థిక నియంత్రణ కూడా లేదు. తన 14 ఏళ్ల పాలనంతా దోచుకోవడం, దాన్ని పంచుకోవటమే జరిగింది కాబట్టే ఇదంతా. బాబు చేయలేనిది నేను ఎందుకు చేయగలిగానంటే ఇక్కడ కరప్షన్‌ లేదు. వివక్ష లేదు. అందుకే!. 

అడ్డగోలు అప్పులు తెచ్చింది బాబేగా? 
అప్పులపై నోటికొచ్చింది చెబుతున్నారు. కానీ లెక్కలు మారవు కదా? ఎవరెంత అప్పులు చేశారో ఒకసారి గమనిస్తే... 2014 నుంచి 2019 వరకు అప్పుల కాంపౌండెడ్‌ యాన్యువల్‌ గ్రోత్‌రేట్‌ (సీఏజీఆర్‌) 21.87 శాతం. కానీ 2019 నుంచి 2024 వరకు చూస్తే అది 12.13 శాతం. మరి ఎక్కువ అప్పులు తెచ్చిందెవరో తెలియటం లేదా? అప్పుల మొత్తాన్ని చూసినా... చంద్రబాబు పాలన 2019 మే వరకు జరిగింది. ఆయన అధికారంలోకి రాకముందు రూ.1.18 లక్షల కోట్లు అప్పుంటే... 2019 నాటికి రూ.2.71 లక్షల కోట్లకు ఎగబాకింది. ఇక గవర్నమెంట్‌ గ్యారంటీడ్‌ రుణం... బాబు రాకముందు రూ.14వేల కోట్లు. బాబు దిగిపోయే  నాటికి రూ.59వేల కోట్లు. 

ఇక ప్రభుత్వ గ్యారంటీ లేని పీఎస్‌యూల రుణాలు రూ.21,367 కోట్ల నుంచి రూ.81,337 కోట్లకు పెరిగాయి. మొత్తంగా అప్పులు బాబు హయాంలో రూ.1,53,346 కోట్ల నుంచి 4,12,288 కోట్లకు పెరిగాయి.  ఇక ఈ ప్రభుత్వ హయాలలో చూస్తే ప్రభుత్వ రుణాలు రూ.4.90 లక్షల కోట్లకు, గ్యారంటీడ్‌ రుణాలు 1.43 లక్షల కోట్లకు పెరిగాయి. ప్రభుత్వ గ్యారంటీ లేని పీఎస్‌యూల అప్పులు రూ.69,372 కోట్లకు తగ్గాయి. మొత్తమ్మీద రుణాలు రూ.7,03,471 కోట్లకు చేరాయి. బాబు హయాంలో పెరుగుదల రేటు 21.87 శాతం ఉంటే... ఇప్పుడది 12.13 శాతం. మరి ఫైనాన్షియల్‌ డిసిప్లిన్‌ ఎవరికుంది?  

జీడీపీలో రాష్ట్ర వాటా పెరిగిందెప్పుడు? 
పురోగతి అంటే ఏంటి? దేశ ఖజానాకు మనం ఎంత ఇవ్వగలుగుతున్నాం? జీడీపీలో మన రాష్ట్ర వాటా ఎంత? ఇవన్నీ చూడా­లి కదా!! వాస్తవానికి చంద్రబాబు హయాంలో దేశ జీడీపీలో మన వాటా 4.47 శాతం ఉంటే.. అది ఇప్పుడు సగటున 4.83 శాతా­నికి పెరిగింది. కోవిడ్‌ లాంటి క్లిష్ట సమయాన్ని కలిపినా 4.83 శాతం మన వాటా ఉందంటే ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో తెలియటం లేదా? ఆస్తుల కల్పన ఎవరి హయాంలో జరిగిందో తెలియటం లేదా? ఎవరి హయాంలో సంక్షేమం, అభివృద్ధి రెండూ బ్రహ్మాండంగా పరుగెత్తుతున్నాయో తెలియటం లేదా? 

మూలధన వ్యయం... మాటల్లోనేనా? 
డబ్బులన్నీ పంచేస్తున్నారంటూ చంద్ర­బాబు అడ్డగోలు ఆరోపణలకు దిగుతున్నాడు. ఎప్పుడైనా తను చెప్పేదొక్కటే. తాను స్కీములకు కాదని, క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌ (మూలధన వ్యయం) రూపంలో ఖర్చు చేశానని. అందుకనే ఇన్ని స్కీములు ఇవ్వలేకపోయానంటాడు. ఇది పచ్చి అబద్ధం. ఎందుకంటే... అసలు నాడు–నేడు ఎవరి హయాంలో జరిగింది? ఎవరి హయాంలో ఆసుపత్రులు, స్కూళ్లు బాగుపడ్డాయి? ఎవరి హయాంలో క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌ జరిగింది? ఆయన హయాం చూస్తే మూలధన వ్యయం కింద ఏడాదికి రూ.15,227 కోట్లు ఖర్చుచేస్తే... మన ప్రభుత్వ హయాంలో ఏడాదికి రూ.17,757 కోట్లు చేస్తున్నాం.  

కొత్తగా 4 సీపోర్టులు కడుతున్నాం. 10 కొత్త ఫిషింగ్‌ హార్బర్లు నిర్మిస్తున్నాం. కొత్తగా 6 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు కడుతున్నాం. 17 మెడికల్‌ కాలేజీలు కడుతున్నాం. ‘నాడు–నేడు’తో స్కూళ్లు, ఆసుపత్రుల రూపురేఖలు మారుస్తున్నాం. ఇవన్నీ ఇప్పుడు కళ్లెదుటే జరుగుతున్నాయి. నిజానికి మనమంతా గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్‌ నీడన గడిచిపోయాయి. ఆ రెండేళ్లూ రాష్ట్ర ఆదాయం తగ్గినా కూడా మూలధన వ్యయం కింద ఇంత భారీగా ఖర్చు చేయగలిగాం. పైపెచ్చు ఏ ఒక్క పథకాన్నీ ఆపలేదు. ఇదీ జగన్‌ పనితీరుకు, చంద్రబాబు పనితీరుకు తేడా!. 

పన్నుల బాదుడులోనూ చంద్రబాబే టాప్‌... 
చంద్రబాబు ప్రతిసారీ జగన్‌ ట్యాక్సులు ఎక్కువ వేస్తున్నాడని. పన్నులతో బాదేస్తున్నాడని అంటున్నారు. కానీ నిజానికి జీఎస్‌డీపీలో పన్నుల ద్వారా వచ్చే మొత్తం ఎవరి హయాంలో ఎక్కువో తెలుసా? చంద్రబాబు నాయుడి హయాంలో జీఎస్‌డీపీలో ట్యాక్స్‌ బర్డెన్‌ 6.57 శాతం. జగన్‌ హయాంలో అది 6.35 శాతమే. మరి ఎవరు ట్యాక్సులతో బాదారయ్యా? ఇవన్నీ కూడా ఆర్బీఐ, కాగ్, స్టేట్‌ బడ్జెట్‌ డాక్యుమెంట్లలో చెప్పినవే కదా? 

Advertisement
Advertisement