ఆ సీటు యమ హాట్‌.. బీజేపీలో ‘మల్కాజ్‌గిరి’ మంటలు | Sakshi
Sakshi News home page

ఆ సీటు యమ హాట్‌.. బీజేపీలో ‘మల్కాజ్‌గిరి’ మంటలు

Published Fri, Mar 1 2024 3:51 PM

Competition Among Bjp Leaders For Malkajgiri Lok Sabha Seat - Sakshi

లోక్ సభ ఎన్నికల్లో ఆ సీటు యమ హాట్. దేశంలోనే దానిదొక ప్రత్యేక స్థానం. అక్కడ గెలిస్తే రాజయోగమే. అలాంటి లక్కీ సీట్ కోసం లీడర్ల పాట్లు అన్ని ఇన్నీ కావు. కేంద్రంలో అధికారంలో బీజేపీలో ఆ సీటు పోటీ మరింత రసవత్తరంగా మారింది. ఈటలకే కన్ఫర్మ్‌ అయిందన్న ప్రచారంతో మిగిలిన ఆశావహులు రగిలిపోతున్నారు. నాన్ లోకల్ వద్దు.. లాంగ్ అండ్ లోకల్ లీడర్‌కే ఇవ్వాలంటూ స్థానిక ఆశావహులంతా ఏకమై నిరసన గళం వినిపిస్తున్నారు.

దేశంలోనే అతిపెద్ద లోక్ సభ స్థానం మల్కాజ్‌గిరి. అన్ని పార్టీల కన్ను అటువైపు. అక్కడ గెలిస్తే మంత్రి లేదా ముఖ్యమంత్రి అవ్వొచ్చన లక్కీ థాట్స్ కూడా నేతలకు స్టార్ట్ అయ్యాయి. అలాంటి సీటుకు ఫుల్ డిమాండ్ ఉంది. దేశంలో ఊపు మీదున్న బీజేపీ నుంచి ఆ సీటుకున్న పోటీ అంతా ఇంత కాదు. మాజీ మంత్రి ఈటల, బీజేపీ జాతీయ నేత మురళిధర్ రావు, స్థానిక నేతలు వీరంద్రగౌడ్, కూన శ్రీశైలం గౌడ్, పన్నాల హరీశ్ రెడ్డి, చాడ సురేశ్ రెడ్డి, మల్క కొమురయ్య వంటి నేతల రేసులో ఉన్నారు. మల్కాజ్ గిరి సీటు తనకే కన్ఫర్మ్ అయిందని ఈటల రాజేందర్ ధీమాతో ఉన్నారు. ఈ మేరకు అధిష్టానం నుంచి సంకేతాలు ఉన్నాయని కేడర్‌తో ఆయన ఏర్పాటు చేసిన బ్రేక్ పాస్ట్ మీటింగ్ బిజెపి మల్కాజ్ గిరిలో మంటలు రేపింది.

మల్కాజ్‌గిరి సీటు తనకే కన్ఫర్మ్ అయిందని ఈటల ప్రచారంపై మిగిలిన ఆశావహులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమ అసంతృప్తిని బాహటంగానే ప్రదర్శిస్తున్న నేతలు.. ఈటల వ్యవహారంపై అధిష్టానంకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో గురువారం రాత్రి జరిగిన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీలో మల్కాజ్‌గిరిని పెండింగ్‌లో పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

మల్కాజ్ గిరి సీటు విషయంలో స్థానిక ఆశావహులు అంతా ఒక్కతాటిపైకి వచ్చారు. నాన్ లోకల్‌కు సీటు కేటాయిస్తే సహకరించేది లేదని తెగెసి చెబుతున్నారు. అతిపెద్ద నియోజకవర్గంలో పోటీ చేసేందుకు నేతలే లేరా అంటూ అసంతృప్త నేతలు క్వశ్చన్ చేస్తున్నారు. వీరంద్ర గౌడ్, కూన్ శ్రీశైలం గౌడ్, హరీశ్ రెడ్డి, చాడ సురేశ్ రెడ్డి నేతలు అనుచరులు, కార్యకర్తలతో మల్కాజ్ గిరి సీటు వ్యవహారంపై భేటీ అయ్యారు. లోకల్ క్యాండిడేట్ ఎవరికి ఇచ్చినా ఓకే కానీ బయట నుంచి తీసుకొస్తే మాత్రం సహకరించేది లేదని పార్టీకి చెప్పాలని డిసైడ్ అయ్యారు. పార్టీని నమ్ముకొని ఎన్నో ఎళ్లుగా ఉన్న స్థానికులైన వారికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పన్నాల హరీశ్ రెడ్డి, వీరేంద్ర గౌడ్, కూన శ్రీశైలం గౌడ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరీశ్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ టికెట్‌ను త్యాగం చేశారు. పార్లమెంట్ సీటు తనకే వస్తుందని భావించారు. మధ్యప్రదేశ్ ఇన్ చార్జీ మురళీధర్ రావు మల్కాజ్ గిరిలో మూడేండ్లుగా పలు కార్యక్రమాలు చేస్తున్నారు. చాడ సురేశ్ రెడ్డి సైతం సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. అంతేకాకుండా ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా పార్లమెంట్ పరిధిలో డబ్బులు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో మల్కాజ్‌గిరి టికెట్ ఈటలకు కన్ఫర్మ్‌ అయిందని ప్రచారం జరుగుతున్న తరుణంలో వీరితో పాటు బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్ అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ నేతలతో ఆయన టచ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ నిర్ణయం ఆధారంగా ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. మరి అధిష్టానం మల్కాజ్ గిరి టికెట్ ఎవరికి కేటాయిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. వీరికి కాకుండా ఇతరులకు ఇస్తే వీరు ఆ నేతకు సహకరిస్తారా? లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.

Advertisement
Advertisement