కాంగ్రెస్‌ విమర్శలకు బీజేపీ కౌంటర్‌.. | Sakshi
Sakshi News home page

అకౌంట్‌ ఫ్రీజ్‌ చేస్తే ఏంటి?.. ‘స్కామ్‌’ డబ్బు ఉందిగా: కాంగ్రెస్‌కు జేప నడ్డా కౌంటర్‌

Published Thu, Mar 21 2024 5:52 PM

Congress Bankruptcy Is Moral And Intellectual Not Financial: Nadda - Sakshi

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ చేసిన ఆరోపణలపై బీజేపీ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది. కాంగ్రెస్‌ బ్యాంక్‌ ఖాతాలను ఫ్రీజ్‌ చేయడంపై కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రంగా స్పందించారు.  కాంగ్రెస్‌కు సంబంధించిన అకౌంట్లు ఫ్రీజ్‌ చేయడంతో తమ దగ్గర ఫండ్స్‌ లేవంటూ ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.

బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్‌ చేస్తే ఏంటి?..  గతంలో తమ పాలనలో జరిగిన వివిధ కుంభకోణాల ద్వారా కూడబెట్టిన సొమ్మును ఎన్నికల ప్రచారం కోసం వినియోగించుకోవచ్చని జేపీ నడ్డా సెటైర్లు వేశారు. కాంగ్రెస్ తన అసమర్థత, చేతకానితనాన్ని ‘ఆర్థిక ఇబ్బందులు’గా పేర్కొంటోందని విమర్శించారు. ‘నిజానికి వారు ఆర్థికంగా దివాళా తీయలేదని  నైతికంగా, మేధోపరంగా దివాలా తీశారని మండిపడ్డారు. ఈ మేరకు ఎ‍క్స్‌(ట్విటర్‌లో) పోస్టు చేశారు. 
చదవండి: Liquor Scam: ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్‌కు షాక్‌..

‘రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ప్రజలు పూర్తిగా తిరస్కరించబోతున్నారు. ఆ పార్టీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది. అందుకే భారత ప్రజాస్వామ్యం, ఐటీ, దర్యాప్తు సంస్థలపై విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ తమ తప్పులను సరిదిద్దుకోవడానికి బదులుగా.. అధికారులను, వ్యవస్థలను నిందిస్తోంది. ఐటీ లేదా ఢిల్లీ హైకోర్టు అయినా నిబంధనలకు లోబడి పనిచేస్తాయి. అందుకు తగ్గట్టే పన్నులు చెల్లించాలని కాంగ్రెస్‌ను కోరాయి. కానీ ఆ పార్టీ ఎప్పుడూ అలా చేయదు.

దేశంలో ప్రతి రాష్ట్రాన్ని, అన్ని రంగాలను అన్ని విధాలా దోచుకున్న పార్టీ(కాంగ్రెస్‌).. ఆర్థిక నిస్సహాయత గురించి మాట్లాడడం హాస్యాస్పదం. కాంగ్రెస్ నేతలు జీపు నుంచి హెలికాప్టర్ల వరకు బోఫోర్స్ లాంటి అన్ని స్కామ్‌ల ద్వారా దోచుకున్న సొమ్మును తమ ప్రచారానికి వాడుకోవచ్చు. భారతదేశం ప్రజాస్వామ్యం అనేది ఒక అబద్ధమని కాంగ్రెస్ పార్ట్‌టైమ్ నాయకులు అంటున్నారు. 1975 నుంచి 1977 మధ్య కొన్ని నెలలు మాత్రమే భారత్‌లో ప్రజాస్వామ్య పాలన లేదు. ఆ సమయంలో భారత ప్రధానిగా కాంగ్రెస్‌కు చెందిన ఇందిరా గాంధే ఉన్నారు.’ అంటూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. 

కాగా లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు చెందిన బ్యాంక్‌ ఖాతాలను స్తంభించడం ద్వారా తమ పార్టీని ఆర్థికంగా కుంగదీసేందుకు ప్రధాని మోదీ కుట్ర పన్నారని సోనియా గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే. తమ పార్టీ అకౌంట్లు ఫ్రీజ్‌ చేసొ మోవా క్రిమినల్ చర్యలకు పాల్పడుతున్నారని, డబ్బులు లేకపోవడంతో ప్రచారాలు నిర్వహించలేకపోతున్నామని రాహుల్‌ గాంధీ అన్నారు. ఇక బ్యాంక్‌ ఖాతాలను స్థంభింపజేసి.. డబ్బు లేకుండా చేసి ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని బీజేపీ చూస్తోందంటూ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి ఇది ప్రమాదకరం. తమ బ్యాంకు ఖాతాలను తక్షణమే ఆపరేట్‌ చేసేందుకు అనుమతించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement