‘హస్తం’లో కొత్త కోణం.. ఏళ్లుగా వైరం.. సేవ్‌ కాంగ్రెస్‌తో ఒక్కటైన వైనం | Sakshi
Sakshi News home page

‘హస్తం’లో కొత్త కోణం.. ఏళ్లుగా వైరం.. సేవ్‌ కాంగ్రెస్‌తో ఒక్కటైన వైనం

Published Wed, Dec 21 2022 1:59 PM

Congress Leaders Maheshwar Reddy Prem Sagar Became One Save Congress - Sakshi

సాక్షి,ఆదిలాబాద్‌: ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో నిన్న, మొన్నటి వరకు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డిలదే పైచేయి. నాలుగు జిల్లాల్లో అయితే ఆ వర్గం లేని పక్షంలో ఈ వర్గం అన్నట్లుగా పార్టీ వ్యవహారాలు సాగుతూ వచ్చాయి. ముఖ్య నాయకులంతా వారి అనుచర వర్గంగానే కొనసాగారు. ఏళ్లుగా ఈ ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో వైరం కొనసాగుతూ వచ్చింది.

తాజాగా సేవ్‌ కాంగ్రెస్‌ నినాదంతో రాష్ట్రంలోని కొంత మంది ముఖ్యనేతలు తిరుగు బావుటా ఎగరవేసిన సంగతి విధితమే. ఇందులో భాగంగా మహేశ్వర్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు ఒక్కటవడాన్ని పార్టీ కార్యకర్తలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇదిలా ఉంటే వారి తీరును ఖండిస్తూ కొంత మంది నాయకులు వ్యతిరేకంగా కదలడం పార్టీలో ఇప్పుడు సంచనలం కలిగిస్తోంది. తద్వారా ఈ రెండు వర్గాలకు ధీటుగా మరో వర్గం కీలకంగా తయారవుతుందన్న చర్చ సాగుతోంది.


ఇటీవల ఆదిలాబాద్‌లో మీడియా సమావేశంలో ఏఐసీసీ సభ్యులు నరేశ్‌జాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వెడ్మ బొజ్జు

కొత్త కమిటీల తరువాత..
ఇటీవల పార్టీ అధిష్టానం కొత్త కమిటీలను నియమించింది. ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా సాజిద్‌ఖాన్‌ను పూర్తి స్థాయిలో నియమించింది. గతంలో ఆయన ఇన్‌చార్జీగా కొనసాగారు. మహేశ్వర్‌రెడ్డి అనుచరుడిగా ఉన్నారు. మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలిగా మరోసారి ప్రేమ్‌సాగర్‌రావు సతీమణి కె.సురేఖనే నియమించారు. నిర్మల్‌లో మహేశ్వర్‌రెడ్డి అనుచరుడు ముత్యంరెడ్డికి అవకాశం కల్పించారు. కుమురం భీం ఆసిపాబాద్‌లో పెండింగ్‌లో పెట్టారు. ఇక ఆదిలాబాద్‌ జిల్లా నుంచి టీపీసీసీ ఎగ్జిక్యూటీవ్‌ కమిటీలో మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డికి చోటు కల్పించారు. ప్రస్తుతం ఆయన వయోభారంతో కీలకంగా వ్యవహరించకపోయినా తనకంటూ ప్రత్యేక అనుచరగణం ఉంది.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా గండ్రత్‌ సుజాతతో పాటు ఉట్నూర్‌కు చెందిన వెడ్మ బొజ్జుకు చోటు కల్పించారు. ఆయన నేరుగా రేవంత్‌రెడ్డి అనుచరుడిగా పేరుంది. తాజా రాజకీయాల నేపథ్యంలో సుజాత సైలెంట్‌గా ఉండగా, బొజ్జు పార్టీలో పట్టుసాధించేందుకు గట్టి యత్నాలు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో మాజీ మంత్రి గడ్డం వినోద్‌కు ఎగ్జిక్యూటీవ్‌ కమిటీతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగానూ నియమించారు. పార్టీ పరిస్థితులపై ప్రస్తుతం ఆయన స్తబ్దుగానే ఉన్నారు. మంచిర్యాల, కుమురంభీం జిల్లాల్లో కొంత మంది నాయకులకు రాష్ట్ర కమిటీల్లో చోటు దక్కింది. వారు ప్రేమ్‌సాగర్‌రావు అనుచరులుగా ఉన్నారు. దీంతో జిల్లా, రాష్ట్ర కమిటీల పరంగా ముఖ్య నేతల అనుచరులకు ప్రాధాన్యత ఇస్తూనే కొత్త నాయకులకు పార్టీ అవకాశం కల్పించింది.
చదవండి: కేసీఆర్‌ డ్రగ్‌ టెస్ట్‌ సవాల్‌పై బండి సంజయ్‌ కౌంటర్‌

నేతల తీరుపై ధ్వజం..
కాంగ్రెస్‌లో రాష్ట్ర స్థాయిలో కొంత మంది ముఖ్య నేతలు సేవ్‌ కాంగ్రెస్‌ నినాదం అందుకోగా అందులో ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు ముఖ్యనేతలు ఉండటం, వారి తీరును ఖండిస్తూ ఆదిలాబాద్‌లో కొంత మంది కాంగ్రెస్‌ నాయకులు ప్రెస్‌మీట్‌ పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. తద్వారా రానున్న రోజుల్లో ఈ రెండు వర్గాలే కాకుండా వారికి వ్యతిరేకంగా మరో వర్గం తయారైందనేది స్పష్టం అవుతోంది. ఇది ప్రస్తుతం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే సేవ్‌ కాంగ్రెస్‌ నినాదం పరిణామాలు ఎలా ఉంటాయనేది కూడా ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్‌ నాయకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement