కాంగ్రెస్‌లో కొత్త ట్విస్ట్‌.. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ఉత్తిదేనా? | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో కొత్త ట్విస్ట్‌.. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ఉత్తిదేనా?

Published Sun, Oct 29 2023 10:12 AM

Congress Leaders Questions Over Udaipur Declaration - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ టికెట్ల విషయంలో వివాదం ముదురుతోంది. ఆ పార్టీ జాతీయ నాయకత్వం ప్రకటించిన ఉదయ్‌పూర్ డిక్లరేషన్ రాష్ట్ర ఎన్నికల్లో అమలు కావడం లేదన్న విమర్శలు కాంగ్రెస్ బీసీ నేతల నుంచి వస్తున్నాయి. తెలంగాణ శాసన సభకు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ఇప్పటికే రెండు విడతలుగా 100మంది అభ్యర్థులను ప్రకటించింది.

మరో 19 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఇందులో వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంలకు చెరో రెండు నియోజకవర్గాల చొప్పున 4 స్థానాలను కేటాయించాల్సి ఉంది. అంటే మిగిలేది ఇక 15 స్థానాలు. వీటిలో తుంగతుర్తి వంటి  ఎస్సీ రిజర్వుడు స్థానాలు కూడా ఉన్నాయి. ఈ గణాంకాలను పరిగణలోకి తీసుకుంటే.. కాంగ్రెస్‌లో బీసీలకు ఇచ్చిన, ఇవ్వనున్న స్థానాలు సహా ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌కు దూరంలోనే ఉండిపోతున్నాయి. 

ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ఏం చెబుతోంది?
జాతీయ కాంగ్రెస్ నాయకత్వం గత ఏడాది మే నెలలో  రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన చింతన్ శిబిర్‌లో తీసుకున్న నిర్ణయాల మేరకు ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనైనా.. సామాజిక న్యాయం పాటిస్తూ టికెట్ల కేటాయింపు ఉండాలి. ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌లో వివిధ అంశాలు ఉన్నా.. ఇపుడు ప్రధానమైన చర్చ బీసీ వర్గాలకు ఇవ్వాల్సిన సీట్లపైనే జరుగుతోంది. ఈ డిక్లరేషన్ ప్రకారం, ప్రతీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని కనీసం రెండు టికెట్లు బీసీలకు ఇవ్వాలి. తెలంగాణలో 17 లోక్ సభా స్థానాలు ఉన్నాయి. ఈ లెక్కన 34 టికెట్లు బీసీలకు కేటాయించాల్సి ఉంది. జనాభా దామాషా మేరకు 60శాతానికి పైగా ఉన్న బీసీలకు సముచిత న్యాయం కల్పించాల్సిందే అన్నది కాంగ్రెస్‌లోని బీసీ వర్గ నేతల వాదన. 

వారికెందుకు రెండు సీట్లు..
కానీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయ్‌పూర్ డిక్లరేషన్ అమలు కావడం లేదని, చివరకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసి విన్నించినా ఫలితం లేకుండా పోయిందన్నది ఆ వర్గ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ డిక్లరేషన్ ప్రకారం ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి టికెట్లు ఇవ్వడానికి లేదు. కానీ, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ, 2019 ఉప ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన పద్మావతిరెడ్డికి, ఆమె భర్త టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి టికెట్లు దక్కాయి. అదే మాదిరిగా ఇటీవలే బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే హన్మంతరావుకు ఆయన తనయుడికి కూడా టికెట్లిచ్చారు. వరంగల్ జిల్లాలో కొండా దంపతులు సైతం రెండు టికెట్లు ఆశించారు. కొండా సురేఖ వరంగల్ తూర్పు నుంచి, కొండా మురళీ పరకాల నియోజకవర్గం నుంచి టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ఉదయ్‌పూర్ డిక్లరేషన్ మేరకు కుదరదని, కొండా సురేఖకు మాత్రమే టికెట్ ఇచ్చి, పరకాలలో ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రేవూరి ప్రకాశ్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. 

ఇప్పటికి ఇచ్చింది 20 సీట్లే..
ఎన్నో వడపోతలు, చర్చల తర్వాత ఏఐసీసీ నాయకత్వం తెలంగాణలో రెండు విడతల్లో తమ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తంగా ఇప్పటికే 100 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను, ఎస్సీలకు 19, ఎస్టీలకు 12 నియోజకవర్గాలు రిజర్వు అయ్యాయి. అంటే 31 సీట్లు ఎస్సీ, ఎస్టీలకు పోగా మిగిలినవి 88 సీట్లు. ప్రతీ లోక్ సభా నియోజకవర్గం పరిధిలో రెండు సీట్ల చొప్పున కేటాయించాల్సింది 34 సీట్లు. అంటే 88 స్థానాల్లో 34 టికెట్లు బీసీలకు కేటాయిస్తే.. 54 నియోజకవర్గాలు మాత్రమే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఇవ్వాల్సి ఉంది. 

బీజేపీ భయం..
కానీ, రెండు జాబితాల్లో 100 మంది అభ్యర్థుల్లో బీసీలు కేవలం 20 మంది మాత్రమే ఇవ్వడాన్ని కాంగ్రెస్ బీసీ నాయకులు నిలదీస్తున్నారు. ఇంకా ప్రకటించాల్సిన 19 సీట్లలో వామపక్షాలకు నాలుగు సీట్లు ఇవ్వాల్సి ఉంది. అంటే ఇక మిగిలేది కేవలం 15 నియోజకవర్గాలు. వీటిలో కొన్ని తుంగతుర్తి వంటి ఎస్సీ, పినపాక వంటి ఎస్టీ రిజర్వుడు స్థానాలు కూడా ఉన్నాయి. మిగిలిన మొత్తానికి మొత్తం బీసీలకు కేటాయించినా.. వారి కోటా పూర్తి కాదు. ఒక వైపు బీజేపీ బీసీ నినాదం ఎత్తుకుని తాము తెలంగాణలో అధికారంలోకి వస్తే.. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రకటనను కూడా వీరు ప్రస్తావిస్తున్నారు.  

సీనియర్లకు హ్యాండ్‌!
మరో వైపు తెలంగాణ కోసం ముందు వరసలో ఉండి కొట్లాడిన అప్పటి ఎంపీలైన బీసీ నాయకులు మధు యాష్కీ, పొన్నం ప్రభాకర్ వంటి వారికి టికెట్లు కేటాయిండంలోనూ రెండో జాబితా వరకు తాత్సారం చేయడంపై విమర్శలు ఉన్నాయి. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ టికెట్ల చిచ్చు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందేమోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్‌కు టికెట్ దక్కక పోవడం, టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య వంటి నాయకులు పార్టీని వీడటం, మరో మాజీ అధ్యక్షుడు వి.హన్మంతరావు (వీహెచ్), పార్టీ సీనియర్ నాయకుడు నిరంజన్ వంటి వారు  నిరసన గళం వినిపిస్తుండటాన్ని బీసీ నాయకులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.

Advertisement
Advertisement