కలిసికట్టుగా ముందుకెళ్దాం | Sakshi
Sakshi News home page

కలిసికట్టుగా ముందుకెళ్దాం

Published Wed, Aug 4 2021 1:00 AM

Congress Party Leader Rahul Gandhi Meeting With Opposition Leaders - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకి పెరుగుతున్న పెట్రో ధరల్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మంగళవారం పార్లమెంటుకి సైకిల్‌పై వెళ్లారు. రాహుల్‌తో పాటు పలువురు విపక్ష ఎంపీలు కూడా సైకిల్‌ తొక్కుకుంటూ పార్లమెంటు వరకు ప్రయాణించారు. సైకిల్‌ తొక్కలేని మరికొందరు ఎంపీలు నడుచుకుంటూ వెళ్లి తమ నిరసనని వ్యక్తం చేశారు. అంతకు ముందు రాహుల్‌ గాంధీ ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో ప్రతిపక్ష పార్టీలకు అల్పాహార విందు ఇచ్చారు. ఈ విందుకి కాంగ్రెస్‌ ఎంపీలతో పాటు తృణమూల్‌ కాంగ్రెస్, ఎన్‌సీపీ, శివసేన, డీఎంకే, వామపక్షాలు, ఆర్‌జేడీ, సమాజ్‌వాదీ పార్టీల నేతలు హాజరయ్యారు. మొత్తం 17 ప్రతిపక్ష పార్టీలను అల్పాహార విందుకు పిలిచినప్పటికీ బీఎస్‌పీ, ఆప్‌ నేతలు హాజరు కాలేదు.

ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యతపై చర్చలు జరిపారు. ‘మనందరం ఏకం కావాలన్న లక్ష్యంతోనే మిమ్మల్ని పిలిచాను. ఎంతమందిమి కలిస్తే అంత బలపడతాం. అప్పుడే బీజేపీ, ఆరెస్సెస్‌కి మనల్ని ఎదుర్కోవడం కష్టమవుతుంది’అని రాహుల్‌ అన్నారు. విపక్షాల ఐక్యత,  సిద్ధాంతాలే కేంద్రాన్ని ఎదుర్కొనే సాధనాలన్నారు. పెగసస్‌ ఉదంతంపై పార్లమెంట్‌లో చర్చించాల్సిందేనని విపక్షాలు పట్టుబడుతున్న సంగతి తెల్సిందే. సాగు చట్టాలు, పెట్రో ధరలపైనా విపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్‌ నేత ఖర్గే, పార్టీల నేతలు సౌగత రాయ్, కళ్యాణ్‌ బెనర్జీ, సంజయ్‌ రౌత్, ప్రియాంక చతుర్వేది, మనోజ్‌ ఝా, కనిమొళి, రాంగోపాల్‌ యాదవ్‌ భేటీలో పాల్గొన్నారు.  

Advertisement
Advertisement