అందరూ కోరితే రెడీ.. అధ్యక్ష పదవికి పోటీపై గెహ్లాట్‌ వ్యాఖ్యలు

22 Sep, 2022 07:13 IST|Sakshi

‘ఒకే పదవి’ వర్తించేది నామినేటెడ్‌ పోస్టులకే 

రాజస్తాన్‌ సీఎంగా కూడా కొనసాగుతానంటూ సంకేతాలు 

అధ్యక్షునిగా ఎన్నికైతే సీఎంగా తప్పుకోవాల్సిందే: దిగ్విజయ్‌

సాక్షి, న్యూఢిల్లీ: ‘‘అధినేత్రి సోనియాగాంధీ కుటుంబంతో పాటు కాంగ్రెస్‌లో చాలామంది నేతలకు నాపై ఎంతో నమ్మకముంది. వారంతా కోరితే అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు సిద్ధం’’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ప్రకటించారు. సీఎంగా కొనసాగమన్నా, అధ్యక్ష పదవికి నామినేషన్‌ దాఖలు చేయమన్నా తోసిపుచ్చలేనన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో సోనియాతో భేటీ అయ్యారు. అధ్యక్ష ఎన్నికపై చాలాసేపు చర్చించినట్టు సమాచారం. ఈ సందర్భంగా గెహ్లాట్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘50 ఏళ్లుగా పార్టీ నాకెన్నో పదవులిచ్చింది. నాకు పదవులు ముఖ్యం కాదు. ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తా’’ అని చెప్పారు. అయితే, ‘‘ప్రస్తుతం రాజస్తాన్‌ సీఎంగా నాకప్పగించిన బాధ్యతను నెరవేరుస్తున్నా. ఇకముందు కూడా నెరవేరుస్తూనే ఉంటా’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలూ చేశారు. తద్వారా అధ్యక్షునిగా ఎన్నికైనా సీఎంగా కొనసాగుతానంటూ సంకేతమిచ్చారు.

జోడు పదవులు కాంగ్రెస్‌ ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌కు విరుద్ధం కాదా అని ప్రశ్నించగా, ‘‘ఆ నిబంధన నామినేటెడ్‌ పదవులకే వర్తిస్తుంది. అధ్యక్ష పదవికి బహిరంగ ఎన్నిక జరుగుతుంది గనుక ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల్లో ఎవరైనా పోటీ పడవచ్చు’’ అని బదులిచ్చారు. ‘‘నేనెక్కడుండాలో కాలమే నిర్ణయిస్తుంది. పార్టీకి సేవ చేయడమే నా లక్ష్యం. పార్టీకి ఉపయోగపడే చోటే ఉండాలన్నది నా అభిమతం’’ అన్నారు. కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ కూడా బరిలో దిగుతుండటాన్ని ప్రస్తావించగా అలాంటి పోటీ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి చాలా మంచిదన్నారు. పోటీకి రాహుల్‌గాంధీని ఒప్పించేందుకు చివరగా మరోసారి ప్రయత్నిస్తానని చెప్పారు. ఇందుకోసం ఆయన గురువారం కేరళ వెళ్లనున్నారు. మరోవైపు గెహ్లాట్‌ అభిప్రాయంతో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ విభేదించారు. ‘‘ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ ప్రకారం జోడు పదవుల్లో కొనసాగేందుకు వీల్లేదు. పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైతే సీఎం పదవికి రాజీనామా చేయాల్సిందే’’ అని అభిప్రాయపడ్డారు. తాను కూడా బరిలో దిగే అవకాశముందని దిగ్విజయ్‌ అన్నారు! ‘‘ఇద్దరే పోటీ చేయాలా? నేను చేయొద్దా?’’ అని జాతీయ మీడియాతో ప్రశ్నించారు. 

రాహులే సారథి కావాలి: పైలట్‌ 
మరోవైపు, రాహులే మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని రాజస్తాన్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు సచిన్‌ పైలట్‌ కోరారు. సగటు కాంగ్రెస్‌ కార్యకర్తలంతా అదే కోరుతున్నారన్నారు. ఆయన రాజకీయ ప్రత్యర్థి గెహ్లాట్‌ గనక పార్టీ అధ్యక్షుడైతే రాజస్తాన్‌ సీఎం ఎవరవుతారన్న ప్రశ్నకు బదులిచ్చేందుకు నిరాకరించారు. రాహుల్‌ను ఒప్పించేందుకు పార్టీ నేతలందరం ప్రయత్నిస్తున్నామని సల్మాన్‌ ఖుర్షీద్‌ కూడా అన్నారు. 

మిస్త్రీతో థరూర్‌ భేటీ 
కాంగ్రెస్‌ సెంట్రల్‌ ఎలక్షన్‌ అథారిటీ చీఫ్‌ మధుసూదన్‌ మిస్త్రీని శశి థరూర్‌ కలిశారు. నామినేషన్‌ దాఖలు ప్రక్రియ గురించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. థరూర్‌కు అన్ని విషయాలూ వివరించినట్టు అనంతరం మిస్త్రీ చెప్పారు. 24న నామినేషన్‌ పత్రం తీసుకుంటానని చెప్పారన్నారు.

ఇదీ చదవండి: ఇద్దరే పోటీ చేయాలా? అధ్యక్ష రేసులో నేనూ ఉన్నా.. కాంగ్రెస్‌ సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు