‘పోలవరం’పై కేంద్రం నిర్లక్ష్యం వీడాలి

3 Jan, 2022 04:58 IST|Sakshi

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు  

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీపీఎం రాష్ట్ర కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులు, నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా కేంద్రం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. వీటిపై ఎన్ని ఆందోళనలు చేసినా బీజేపీలో చలనం రావడం లేదని మండిపడ్డారు.

ఇప్పుడు మళ్లీ నిర్వాసిత కుటుంబాల లెక్కలు పంపాలని కోరడం దారుణమన్నారు. మారుతున్న అంచనాలకు అనుగుణంగా నిధులు అందించాల్సిన పూర్తి బాధ్యత కేంద్రానిదేనని చెప్పారు. కానీ రకరకాల సాకులతో కొర్రీలు వేస్తూ ప్రాజెక్టును ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. కేంద్రం తీరుకు నిరసనగా అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు పోరాడాల్సిన అవసరముందన్నారు. కాగా, విద్యుత్‌ వినియోగదారులపై అభివృద్ధి చార్జీల పెంపును ఉపసంహరించాలని కోరుతూ సీఎం జగన్‌కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు. 

మరిన్ని వార్తలు