బీజేపీలో చేరకుంటే అరెస్టేనన్నారు | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరకుంటే అరెస్టేనన్నారు

Published Wed, Apr 3 2024 3:49 AM

 Delhi Minister Atishi Says Four More AAP Leaders Will Arrest - Sakshi

త్వరలో నాతోసహా నలుగురిని అరెస్టు చేస్తారు

ఢిల్లీ మంత్రి, ఆప్‌ నేత అతిశి

న్యూఢిల్లీ:  బీజేపీలో చేరాలని, లేకపోతే నెల రోజుల్లోగా అరెస్టు కావడానికి సిద్ధంగా ఉండాలంటూ ఓ సన్నిహితుడి ద్వారా ఆ పార్టీ నేతలు తనకు వర్తమానం పంపించారని ఢిల్లీ మంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ సీనియర్‌ నేత అతిశి ఆరోపించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ద్వారా అరెస్టు చేయిస్తామంటూ హెచ్చరికలు పంపారని అన్నారు. తనతో సహా నలుగురిని త్వరలో అరెస్టు అవకాశం ఉందని చెప్పారు. ఆమె మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్, ఎమ్మెల్యే దుర్గేశ్‌ పాఠక్, రాజ్యసభ సభ్యుడు రాఘవ్‌ చద్ధాతోపాటు తనను త్వరలో అరెస్టు చేయబోతున్నారని తెలిపారు.

కేజ్రీవాల్‌ను జైలుకు పంపించినా ఆమ్‌ ఆద్మీ పార్టీని విచి్ఛన్నం చేయలేమన్న నిజాన్ని బీజేపీ గుర్తించిందని, అందుకే తమ నలుగురిని టార్గెట్‌ చేసిందని విమర్శించారు. తనకు అందిన సమాచారం ప్రకారం.. తొలుత తన ఇంట్లో, బంధువుల ఇళ్లల్లో సోదాలు జరుగుతాయని, తర్వాత తనకు సమన్లు ఇస్తారని, అనంతరం అరెస్టు చేస్తారని పేర్కొన్నారు. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నిందితుడు కాదని, చార్జిషీట్‌లో ఆయన పేరు లేదని గుర్తుచేశారు.

అందుకే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం లేదని అతిశీ స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఆయన పూర్తిస్థాయి మెజార్టీ ఉందని వివరించారు. మరోవైపు మంత్రి అతిశీశి ఆరోపణలను బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్‌ ఖండించారు. ‘‘ఆరోపణలకు ఆమె ఆధారాలు చూపాలి. లేదంటే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలి’’ అన్నారు.

సంజయ్‌ సింగ్‌కు బెయిల్‌ 
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో ఆప్‌ ఆప్‌ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ సింగ్‌కు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది. సంజయ్‌ కస్టడీ పొడిగింపు అవసరం లేదని ఈడీ పేర్కొనడంతో ఈ నిర్ణయం తీసుకుంది. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను బుధవారం విడుదల చేస్తారని సమాచారం. సంజయ్‌ని గతేడాది అక్టోబర్‌ 4న ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్యంలో ఇదొక గొప్ప రోజని ఆప్‌ నేత, ఢిల్లీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ అన్నారు. సాక్షులను, అప్రూవర్లను బెదిరించి తీసుకున్న స్టేట్‌మెంట్ల ఆధారంగా లిక్కర్‌ కుంభకోణం కేసును సృష్టించినట్లు సుప్రీంకోర్టు ఉత్తర్వును బట్టి తేటతెల్లం అవుతోందని పేర్కొన్నారు. విపక్షాలపై దర్యాప్తు సంస్థలు కక్షపూరితంగా వ్యవహరించడం లేదని బీజేపీ పేర్కొంది. బెయిల్‌కు ఈడీ అభ్యంతరం చెప్పకపోవడమే నిదర్శనమంది.

జైలులో కేజ్రీవాల్‌ ధ్యానం
న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తిహార్‌ జైలులో ఇతర ఖైదీల తరహాలోనే సాధారణ జీవనం గడుపుతున్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కోర్టు ఆయనను 14 రోజులపాటు జ్యుడీషియల్‌ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. సోమవారం సాయంత్రం 4 గంటలకు జైలుకు చేరుకున్న కేజ్రీవాల్‌ రాత్రంతా సరిగ్గా నిద్రపోలేదు. మంగళవారం తెల్లవారుజామున లేచారు. తన గదిలోనే తొలుత గంటకుపైగా ధ్యానం, యోగా చేశారు. ఉదయం 6.40 గంటలకు అల్పాహారం స్వీకరించారు. బ్రెడ్, టీ తీసుకున్నారు.

మధ్యాహ్నం 12 గంటలకు భోజనం చేశారు. సాయంత్రం 5.30 గంటలకు అధికారులు ఆయనకు రాత్రి భోజనం అందించారు. జైలులో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు టీవీ చూసే అవకాశం కేజ్రీవాల్‌కు కల్పించారు. దోమల బెడద లేకుండా బ్యారక్‌లో తెర అమర్చారు. మధుమేహంతో బాధపడుతున్న కేజ్రీవాల్‌కు జైలు అధికారులు కుర్చి, టేబుల్‌తోపాటు ప్రత్యేక మంచాన్ని ఏర్పాటు చేశారు. ఆయన రక్తంలో చక్కెర స్థాయిలను తెలుసుకోవడానికిషుగర్‌ సెన్సార్, గ్లూకోమీటర్‌ను అందుబాటులో ఉంచారు. మంగళవారం ఉదయం పరీక్షించగా, చక్కెర స్థాయి కొంత పడిపోయినట్లు వెల్లడయ్యింది.  

పక్కనే ఉగ్రవాది, డాన్, గ్యాంగ్‌స్టర్‌  
తిహార్‌ జైలు ప్రాంగణంలోని నెంబర్‌ 2 జైలులో ఉన్న కేజ్రీవాల్‌ సమీపంలోనే అండర్‌వరల్డ్‌ డాన్‌ చోటా రాజన్, గ్యాంగ్‌స్టర్‌ నీరజ్‌ బవానా, ఉగ్రవాది జియాఉర్‌ రెహా్మన్‌ తదితర నేరగాళ్లు ఉన్నారు. ఒకప్పుడు దావూద్‌ ఇబ్రహీంకు సన్నిహితుడైన చోటా రాజన్‌ తర్వాత అతడికే ప్రత్యర్థిగా మారాడు. నీరజ్‌ బవానాపై 40కిపైగా కేసులున్నాయి. ఇక జియాఉర్‌ రెహా్మన్‌ ఉగ్రవాద సంస్థ ఇండియన్‌ ముజాహిదీన్‌లో సభ్యుడిగా చేరి, దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నాడు.

Advertisement
Advertisement