నువ్వా-నేనా! రాహుల్‌ అలా.. మోదీ ఇలా.. ప్రచారంలో ఎవరికి వారే భిన్న శైలి | Sakshi
Sakshi News home page

నువ్వా-నేనా! రాహుల్‌ అలా.. మోదీ ఇలా.. ప్రచారంలో ఎవరికి వారే భిన్న శైలి

Published Wed, May 10 2023 4:21 AM

Different style of two leaders in Karnataka campaign - Sakshi

ఈసారి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీకి ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ తరఫున రాహుల్‌ గాంధీ పోస్టర్‌ బోయ్స్‌గా మారారు. ఇతర నేతలూ రంగంలో నిలిచి ముమ్మరంగా కలియదిరిగినా మొత్తం భారాన్ని దాదాపుగా వారిద్దరే తమ భుజస్కంధాలపైనే మోశారు. తమ పార్టీల జయాపజయాలకు ప్రధానంగా వారే బాధ్యులు కానున్నారు...  – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

మోదీ ఇలా... 
కర్ణాటకలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారం భిన్న శైలిలో సాగింది. ముఖ్యంగా రాజధాని బెంగళూరులో ఓటర్లను ఆకర్షించడానికి వారు చెరో మార్గం అనుసరించారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు చావోరేవోగా మారిన ఈ ఎన్నికల్లో ప్రచార గడువు ముగియడానికి మూడు రోజుల ముందు నుంచి వారిద్దరూ రాజధానిపై ప్రధానంగా దృష్టి సారించారు.

శని, ఆదివారాల్లో అట్టహాసంగా మోదీ 30 కిలోమీటర్లకు పైగా భారీ రోడ్‌ షోలు నిర్వహిస్తే, రాహుల్‌ మాత్రం సామాన్యుడిలా అందరితోనూ కలిసిపోతూ ప్రచారం చేశారు. మోదీ జేపీ నగర్‌ నుంచి మల్లేశ్వరం వరకు 26 కి.మీ. పొడవునా, న్యూ తిప్పసంద్ర రోడ్డు నుంచి ట్రినిటి సర్కిల్‌ దాకా 6.5 కి.మీ. మే చేసిన రోడ్‌ షోలకు జనం పోటెత్తారు.

దారి పొడవునా ఆయనపై పూల వర్షం కురిపించారు. డబుల్‌ ఇంజన్‌ సర్కారుతో ప్రయోజనాలు, బజరంగ్‌ దళ్‌ను నిషేధిస్తామన్న కాంగ్రెస్‌ మేనిఫెస్టోను ఎండగడుతూ బెంగళూరులో మోదీ ప్రసంగాలు సాగాయి. 

రాహుల్‌ అలా... 
రాహుల్‌ మాత్రం ఆది, సోమవారాల్లో రాజధాని జనంలో కలిసిపోయి ప్రచారం చేశారు. ఫుడ్‌ డెలివరీ బోయ్‌తో పాటు అతని మోటార్‌ సైకిల్‌పై ప్రయాణించారు. డెలివరీ యాప్‌ల బాయ్స్‌తో మాట్లాడారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. దారిన పోయేవారిని పలకరిస్తూ సాగారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి వాటిపై చర్చించారు.

సోమవారం కాఫీ డేలో కాఫీ తాగుతూ సందడి చేశారు. బస్టాప్‌లో ఉన్న వారితో మాట్లాడారు. బస్సెక్కి ప్రయాణికులతో మాటలు కలిపారు. బొమ్మై ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఇమేజ్‌నే పెట్టుబడిగా పెట్టి ఎన్నికల్ని తన భుజస్కంధాలపై వేసుకున్నారు. రాహులేమో పెరిగిపోతున్న ధరలనే అస్త్రంగా చేసుకొని ఎన్నికల ప్రచారాన్ని ముగించారు.  

కర్ణాటకలో  బీజేపీ ప్రచారం 

6 రోడ్‌ షోలు  19 బహిరంగ సభలు, ర్యాలీలు 

అమిత్‌ షా  15 రోడ్‌ షోలు  16 సభలు 

జేపీ నడ్డా 16 రోడ్‌ షోలు  10 సభలు 

కర్ణాటక విజయం బీజేపీ, కాంగ్రెస్‌లకు ఎందుకు కీలకమంటే... 
బీజేపీ 
♦ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన విజయం బీజేపీ, కాంగ్రెస్‌ రెండింటికీ ఎంతో కీలకం. 

♦ అధికారాన్ని నిలబెట్టుకోవడం ద్వారా దక్షిణాదిన తమ చేతిలో ఉన్న ఏకైక రాష్ట్రం చేజారకుండా చూసుకోవడం బీజేపీకి చాలా ముఖ్యం. 

♦ కర్ణాటక గెలుపు అజేయుడైన నాయకునిగా మోదీ స్థానాన్ని మరింత సుస్థిరం చేస్తుంది. ఆయన కరిష్మాను మరింతగా పెంచుతుంది. 

♦ అంతేగాక కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటక వంటి ప్రధాన రాష్ట్రంలో ఓటమి చవిచూస్తే విపక్షాలు దూకుడు పెంచుతాయి. 

♦ గత 38 ఏళ్లలో ఏ పార్టీనీ వరుసగా రెండోసారి గెలిపించని కర్ణాటక ఆనవాయితీని తిరగరాయాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉంది. 

♦ బజరంగ్‌ దళ్‌ను నిషేధిస్తామన్న కాంగ్రెస్‌ హామీ, ముస్లిం కోటా రద్దుపై ఆ పార్టీ వైఖరి సహా ఏ అవకాశాన్ని వదులుకోకుండా ప్రచారాంశంగా మలచుకుంది. 

కాంగ్రెస్‌ 
♦  కొన్నేళ్లుగా వరుసగా ఎన్నికల ఓటములతో బాగా డీలా పడి ఉన్న కాంగ్రెస్‌కు కర్ణాటక గెలుపు ప్రాణావసరమనే చెప్పాలి. 

♦ లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష కూటమి ప్రయత్నాలకు ఊపు తెచ్చేందుకు కూడా ఇది టానిక్‌లా ఉపయోగపడుతుంది. 

♦ జనాకర్షక నేతగా ప్రధాని మోదీకి దీటుగా రాహుల్‌ ఎదగాలంటే ఈ ఎన్నికల్లో ఆయన చేసిన ప్రచారం ఓట్లు రాల్చి పార్టీని గెలిపించడం తప్పనిసరి అవసరం. 

♦ ఇక కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే సొంత రాష్ట్రం కావడంతో ఆయనకూ ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. 

♦ ప్రచారంలో కాంగ్రెస్‌ సర్వశక్తులూ ఒడ్డింది. అన్నాచెల్లెళ్లు రాహుల్, ప్రియాంక కాళ్లకు బలపం కట్టుకుని రాష్ట్రమంతా కలియదిరిగారు. ప్రచారం చివరి దశలో సోనియా కూడా ఒక సభలో పాల్గొన్నారు. 

♦  ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నెన్నో హామీలు గుప్పించింది. రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లను ఏకంగా 75 శాతానికి పెంచుతామని కూడా చెప్పింది. 

♦ అయితే పోలింగ్‌ మరో వారం ఉందనగా వేళ మే 2న ఉన్నట్టుండి బజరంగ్‌ దళ్‌ను నిషేధిస్తామన్న హామీతో బీజేపీకి చేజేతులా అ్రస్తాన్ని అందించింది. కానీ కోస్తా కర్ణాటక మినహా మిగతా రాష్ట్రమంతటా ఈ హామీ తమకు తప్పకుండా ఓట్లు రాలుస్తుందని కాంగ్రెస్‌ ఆశపడుతోంది. 

Advertisement
Advertisement