Sakshi News home page

సీఎం కేజ్రీవాల్‌ ఇలా చేస్తారనుకోలేదు.. ‘సుప్రీం’ మాజీ న్యాయమూర్తి

Published Sun, Mar 24 2024 2:34 PM

Disappointed With Arvind Kejriwal Says Former Supreme Court Judge N Santosh Hegde - Sakshi

సాక్షి, బెంగళూరు: ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టైన ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తీరుపట్ల సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, మాజీ సొలిసిటర్ జనరల్ ఎన్ . సంతోష్ హెగ్డే అసంతృప్తిని వ్యక్తం చేశారు. 

2011లో ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే అవినీతి ( India Against Corruption) కి వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. అన్నా హజారే నేతృత్వంలో జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిలో కేజ్రీవాల్‌తో పాటు ఎన్‌.సంతోష్‌ హెగ్డేలు ఉన్నారు. అయితే నాడు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన కేజ్రీవాల్‌ నేడు లిక్కర్‌ కేసులో అరెస్ట్‌ కావడంపై హెగ్డే స్పందించారు.  

కేజ్రీవాల్‌ తీరుపై తీవ్ర నిరాశ చెందాను. ఆప్ (అధికారంలోకి వచ్చిన తర్వాత) అవినీతి లేని పరిపాలన కొనసాగిస్తుందని అనుకున్నాను. కానీ అది జరగలేదు.అధికారంతో భ్రష్టుపట్టించారని పీటీఐతో మాట్లాడారు.  

ఉద్యమం నుంచి బయటకు రావడానికి కారణం
‘‘ ఈరోజు రాజకీయాలు అవినీతి గుహగా మారాయి. ఏ రాజకీయ పార్టీ కూడా దాని నుండి విముక్తి పొందలేదు. అవినీతికి వ్యతిరేకంగా చేసే ఇండియా ఎగెనెస్ట్ కరప్షన్ ఉద్యమం నుంచి బయటకు రావడానికి కారణం కూడా అదే. రాజకీయాలకు దూరంగా ఉంటూ రాజకీయాలను ప్రక్షాళన చేయాలన్నదే మా సూత్రం.

ఉద్యమం కాస్త రాజకీయ పార్టీగా 
కానీ ఆ తర్వాత కొంతమంది వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఆప్‌ను స్థాపించారు. అప్పుడే నేను ఉద్యమం నుంచి బయటకు వచ్చాను. పార్టీ పెట్టి అవినీతి నిర్మూల చేస్తానని అనుకోలేదు. అది జరగదు కూడా. అందుకు కేజ్రీవాల్‌ అరెస్టే ఉదాహరణ’’ అన్నారు. ఉద్యమం కొనసాగుతుండగానే ఆమ్‌ ఆద్మీ పార్టీని స్థాపన జరిగింది. అందులో చేరాలంటూ కేజ్రీవాల్‌ తనని స్వయంగా ఇంటికి వచ్చి ఆహ్వానిస్తే అందుకు నేను ఒప్పుకోలేదని నాటి పరిస్థితుల్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

విపక్షాల విమర్శల్లో అర్ధం లేదు
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తుందని, వారిపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుందన్న విపక్షాలు ఆరోపణలపై హెగ్డే తన అభిప్రాయాలను పంచుకున్నారు .

ప్రతిపక్షాన్ని నాశనం చేయడం కోసమే అధికార పార్టీ ఇలా చేస్తోందంటూ ప్రతిపక్షాల ఆరోపణల్ని నేను నమ్మను. అవును.. ఎంపిక చేసి నేతల్ని దర్యాప్తు సంస్థలు అరెస్ట్‌ చేస్తున్నాయి. కానీ అది నేరం కాదు. ఎందుకంటే న్యాయ శాస్త్రంలో కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని సీబీఐ,ఈడీలు ఇలా చేస్తున్నాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, మాజీ సొలిసిటర్ జనరల్ ఎన్ . సంతోష్ హెగ్డే మద్దతు పలికారు. 

Advertisement
Advertisement