వారికి అవినీతిపై మాట్లాడే అర్హత లేదు | Sakshi
Sakshi News home page

వారికి అవినీతిపై మాట్లాడే అర్హత లేదు

Published Sun, Nov 22 2020 5:36 AM

DMK And Congress have no right to talk about corruption - Sakshi

చెన్నై: కాంగ్రెస్, డీఎంకేలకు అవినీతిపై మాట్లాడే అర్హత లేదని బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. వారి హయాంలోనే భారీ 2జీ కుంభకోణం చోటు చేసుకుందని గుర్తు చేశారు. తమిళనాడులో వారసత్వ రాజకీయాలకు కాలం చెల్లిందని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే ఘోర పరాజయం పాలవుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ శక్తుల విజయం తథ్యమన్నారు.

2021 అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో శనివారం షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..   ప్రధాని మోదీ నాయకత్వంలో పలు రాష్ట్రాల్లో వారసత్వ పార్టీలు అపజయం పాలయ్యాయన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పటికన్నా.. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించామన్నారు. ‘2013–14 బడ్జెట్‌లో మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం తమిళనాడుకు రూ. 16,155 కోట్లు కేటాయించగా.. మా తాజా బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయించింది రూ. 32,850 కోట్లు’ అని వివరించారు.

కేంద్రంలోని తమ ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ సమర్ధ నాయకత్వంలో కోవిడ్‌–19పై దేశం గొప్పగా పోరాడుతోందన్నారు. అనేక అభివృద్ధి చెందిన దేశాల కన్నా భారత్‌ కరోనాను సమర్ధంగా ఎదుర్కొందన్నారు. కరోనాపై పోరులో ప్రజలు కూడా భాగస్వామ్యులు కావడమే అందుకు కారణమన్నారు. ఈ సందర్భంగా, చెన్నై ప్రజల తాగునీటి అవసరాల కోసం రూ. 380 కోట్లతో నిర్మించిన ‘తెరవైకందిగై’ రిజర్వాయర్‌ను అమిత్‌ షా జాతికి అంకితం ఇచ్చారు. అలాగే, సుమారు రూ. 67 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో తమిళనాడు సీఎం, అన్నాడీఎంకే నేత పళని సామి, ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తదితర నేతలు పాల్గొన్నారు.

2021 ఏప్రిల్‌– మే నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ– అన్నాడీఎంకే పొత్తు కొనసాగుతుందని పళని సామి వెల్లడించారు. ఈ ఎన్నికల్లో తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. చెన్నై విమానాశ్రయం నుంచి బస చేసిన హోటల్‌కు వెళ్లే దారిలో ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి.. అమిత్‌ షా వాహనం దిగి, రోడ్డుపై నడుస్తూ అక్కడ గుమికూడిన కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేశారు. సంబంధిత వీడియోను జతపర్చి.. ‘తమిళనాడులో ఉండటం ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది. చెన్నై చూపిస్తున్న ప్రేమకు, మద్దతుకు ధన్యవాదాలు’ అని షా ట్వీట్‌ చేశారు. సీఎం పళని సామి, డెప్యూటీ సీఎం పన్నీరుసెల్వం నాయకత్వంలో కరోనాపై పోరులో తమిళనాడు సమర్ధంగా వ్యవహరిస్తోందని ప్రశంసిం చారు, ఇక్కడ కోవిడ్‌–19 నుంచి కోలుకున్న వారు 97% ఉన్నారన్నారు.  

డీఎంకేపై విమర్శలు
యూపీఏ పదేళ్ల పాలనలో డీఎంకే తమిళనాడుకు ఏం చేసిందో చెప్పాలని, అవసరమైతే దానిపై చర్చకు సిద్ధమని అన్నారు. వంశపారంపర్య రాజకీయాలు, అవినీతి, కులం వంటి అంశాలపై ప్రధాని మోదీ యుద్ధం ప్రారంభించారని అన్నారు. తమ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక చాలా రాష్ట్రాల్లో వంశపారంపర్య పార్టీలు ఓటమిపాలయ్యాయని ఇప్పుడు తమిళనాడు వంతు వచ్చిందని అన్నారు.

Advertisement
Advertisement