టీఆర్‌ఎస్‌ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కీలక ప్రకటన

3 Sep, 2021 08:24 IST|Sakshi

హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటన

తాను గెలిస్తే సీఎం కేసీఆర్‌ రాజీనామా చేస్తారా అని సవాల్‌

హరీశ్‌రావు ఎన్ని డ్రామాలు చేసినా ప్రజలు నమ్మరు

మాజీమంత్రి ఈటల రాజేందర్‌

హుజూరాబాద్‌: ‘హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలుగుతా. నేను గెలిస్తే కేసీఆర్‌ సీఎం పదవికి రాజీనామా చేయాలి’ అని మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్‌ సంచలన సవాల్‌ విసిరారు. గురువారం హుజూరాబాద్‌ పట్టణ శివారులోని సిర్సపల్లి రోడ్‌లో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్లను బీజేపీ రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యుడు వివేక్‌తో కలిసి పరిశీలించారు.


హుజూరాబాద్‌ శివారులోని సిర్సపల్లి రోడ్‌లో డబుల్‌ బెడ్రూం ఇళ్లను పరిశీలిస్తున్న ఈటల

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్‌ తీరు మోచేతికి బెల్లంపట్టి అరచేతిని నాకించే విధంగా ఉందని, ఎన్నికల సమయంలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల గురించి చాలా గొప్పగా అనేక ముచ్చట్లు చెప్పాడన్నారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఎలా కట్టించాలనే విషయంలో ఉపసంఘం వేసినా, నివేదిక ఇవ్వకముందే కాలనీల రూపంలో కట్టాలని జీవో ఇచ్చాడని తెలిపారు. గ్రామాల్లో స్థలాలు దొరకవని, కాలనీల రూపంలో డబుల్‌ బెడ్‌ రూం కట్టడం సాధ్యం కాకపోవచ్చని చెప్పామని, వినకుండా ఊరికి 400 ఇండ్లు కట్టాలని చెప్పారని తెలిపారు. ఇవి ఎవరికీ సరిపోవని చెప్పడంతో మరో వెయ్యి ఇళ్లు ఇచ్చారన్నారు.

సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటలో వేలాది ఇళ్లు మంజూరు చేస్తే, తాను కూడా హుజూరాబాద్‌కు మరిన్ని ఇళ్లు కావాలని అడిగానని.. దీంతో 3,900 ఇళ్లు ఇచ్చారని చెప్పారు. కేసీఆర్‌ మాటాలు కోటలు దాటుతాయి తప్ప, కాళ్లు మాత్రం గడప దాటవని ఎద్దేవా చేశారు. ‘హరీశ్‌ రావు నా దగ్గరకి వచ్చి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కట్టలేదని చిల్లర ఆరోపణలు చేస్తున్నాడు. నీవు ఎన్ని డ్రామాలు చేసినా ప్రజలు నమ్మరు. ఎంత పిచ్చి ప్రేలాపనలు పేలినా కర్రు కాల్చి వాతపెడతారని’ హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌కు దుబ్బాకలో మించిన పరాభవం ఇక్కడ తప్పదని జోస్యం చెప్పారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు