తెలంగాణ బీజేపీలో కొత్త రచ్చ.. హైకమాండ్ ఏం తేల్చబోతుంది? | Sakshi
Sakshi News home page

తెలంగాణ బీజేపీలో కొత్త రచ్చ.. హైకమాండ్ ఏం తేల్చబోతుంది?

Published Tue, Jan 16 2024 11:00 AM

Election Expenses Controversy in Telangana BJP - Sakshi

తెలంగాణ కాషాయ పార్టీలో కొత్త రచ్చ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల ఖర్చు విషయంలో పోటీ చేసిన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఫండ్ పక్కదారి పట్టిందని పలువురు నేతలు రచ్చకెక్కుతున్నారు. మరికొందరు అధిష్టానం వరకు ఈ వివాదాన్ని తీసుకువెళ్లారు. బీజేపీ హైకమాండ్ ఎన్నికల ఖర్చు లెక్కలపై ఏం తేల్చబోతుంది ? లెక్కలు సరిచేస్తారా ? వదిలేస్తారా ?

తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల ఖర్చు లెక్కలపై ఆరా తీస్తోంది. ఎన్నికల సందర్భంగా వచ్చిన పార్టీ ఫండ్ దారితప్పిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై పలువురు బీజేపీ అభ్యర్థులు హస్తినకు ఫిర్యాదులు చేశారు. పార్టీ హైకమాండ్ ఇచ్చిన నిధులు కింది వరకు అందకపోవడంతో.. చాలా సెగ్మెంట్లలో పార్టీ ఓడిపోయిందని వారు అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లారట. రాష్ట్రానికి చెందిన పలువురు నేతల ఫిర్యాదు మేరకు నిధుల సంగతి తేల్చేందుకు తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు చెందిన షాడో టీమ్ రంగంలోకి దిగిందని చెబుతున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను మూడు కేటగిరీలుగా విభజించి ఫండ్ కేటాయించిందని పలువురు అభ్యర్థులు చెబుతున్నారు. నియోజకవర్గాలను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించారని వారు వెల్లడించారు. ఏ కేటగిరీ అంటే గెలిచేదిగా, బీ అంటే కొంచెం కష్టపడితే గెలిచేదిగా, సీ కేటగిరి అంటే గెలిచే ఛాన్స్ లేకపోయినా.. పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడమే లక్ష్యం. అయితే పార్టీకి ఏమాత్రం బలం లేని పలు అసెంబ్లీ సెగ్మెంట్లకు భారీగా నిధులు సమకూర్చారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

అదే గెలుపునకు దగ్గరలో ఉన్నారనుకున్న సెగ్మెంట్లకు చాలా తక్కువ నిధులు కేటాయించడంతో ఓటమి పాలయ్యామని పలువురు పార్టీ అధిష్టానం ముందు ఆవేదన వ్యక్తం చేశారట. అభ్యర్థుల నుంచి అందిని ఫిర్యాదుల మేరకు అసలు..ఎవరికెంత ఇచ్చారనే దానిపై అమిత్ షా టీమ్ రంగంలోకి దిగిందని చెబుతున్నారు. ఈ వివరాలపై ఆరా తీస్తున్న హైకమాండ్ బృందానికి సర్దిచెప్పేందుకు రాష్ట్ర నాయకత్వం హైరానా పడుతోంది.

తెలంగాణలో జరిగిన తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. 19 సెగ్మెంట్లలో రెండో స్థానంలో నిలిచింది. అయితే రెండో స్థానంలో నిలిచిన చాలా సెగ్మెంట్లకు అధిష్టానం కేటాయించిన నిధుల్లో సగం మాత్రమే అందాయని, మిగతా సగం నిధులు దారి మళ్లాయని అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. ఆ స్థానాల్లో పార్టీ ఓటమికి నిధులు సక్రమంగా అందకపోవడమే కారణమని హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తెలంగాణకు వచ్చిన అమిత్ షా టీమ్ ఇంకా ఏయే అంశాలపై ఆరా తీయనుందనేది అంతుచిక్కడం లేదు. ఈ వివరాలతో పాటు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన అంశాలపైనా దృష్టి కేంద్రీకరించనుంది.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాము ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధమేనని చెప్పిన ఆశావహులు టికెట్ వచ్చాక మాత్రం ఇలాంటి ఫిర్యాదులు చేయడంపైనా హైకమాండ్ దృష్టి సారిస్తున్నట్లు సమాచారం.  అమిత్ షా టీమ్ ఎలాంటి నివేదికను అధిష్టానానికి అందించనుందనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రానికి వచ్చిన ఢిల్లీ టీమ్‌ ఇచ్చే నివేదికపై జాతీయ నాయకత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందో చూడాలి.

ఇదీ చదవండి: బీఆర్‌ఎస్‌ అదిరిపోయే ప్లాన్‌.. ఎన్నికల్లో సక్సెస్‌ అ‍య్యేనా?

Advertisement
Advertisement