లాల్‌ చౌక్‌లో నేతల సందడి.. స్వేచ్ఛాయుత ఓటుకు జనం సిద్దం! | Sakshi
Sakshi News home page

లాల్‌ చౌక్‌లో నేతల సందడి.. స్వేచ్ఛాయుత ఓటుకు జనం సిద్దం!

Published Sat, May 11 2024 7:35 AM

Elections Are Being Held in the Valley Without the Call of Boycott

దేశంలో ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో కశ్మీర్‌లో వినూత్న ఉదంతం చోటుచేసుకుంది. గతంలో కశ్మీర్ లోయలో ఎన్నికలు ప్రకటించినప్పుడు  వేర్పాటువాదులు బహిష్కరణకు పిలుపునిచ్చేవారు.  దాని ప్రభావం స్పష్టంగా కనిపించేది. అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా ఎలాంటి బహిష్కరణ పిలుపు లేకుండా ఇక్కడ లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.

ప్రస్తుతం శ్రీనగర్‌లోని చారిత్రక లాల్ చౌక్ రాజకీయ నినాదాలతో మారుమోగుతోంది. క్లాక్ టవర్ ఎన్నికల సభలకు వేదికగా నిలిచింది. గత మూడు దశాబ్దాలుగా వేర్పాటువాదుల బంద్‌ పిలుపులు, రాళ్లదాడులు, ఎన్‌కౌంటర్లు, ఊరేగింపులకు అడ్డాగా నిలిచిన క్లాక్ టవర్ ప్రాంతంలో ఇప్పుడు వేర్పాటువాదుల బహిష్కరణ పిలుపు లేకుండా  వివిధ రాజకీయ పార్టీల బహిరంగ సభలు జరుగుతున్నాయి.

దీనిని 2019 తరువాత వచ్చిన భారీ మార్పుగా పరిగణిస్తున్నారు. స్థానికుడు సుహైల్ అహ్మద్ మాట్లాడుతూ కాశ్మీర్‌లో గత కొన్నేళ్లలో వేర్పాటువాదులపై ఎన్‌ఐఏ తదితర ఏజెన్సీలు చర్యలను కఠినతరం చేశాయి. వేర్పాటువాదులలోని కొందరు గృహనిర్బంధంలో ఉండగా, మరికొందరు జైలులో ఉన్నారని తెలిపాడు. మరో యువకుడు జహూర్ హుస్సేన్ మాట్లాడుతూ గతంలో బహిష్కరణ పిలుపు ఇచ్చేవారికి భయపడి ఓట్లు వేసేవారు కాదని, అయితే ప్రతి ఒక్కరికీ తమ ప్రతినిధిని ఎన్నుకునే హక్కు ఉందని, ఈసారి తామంతా తమ హక్కును వినియోగించుకుంటామని తెలిపారు.

అల్తాఫ్ ఘంటాఘర్‌, నౌహట్టా, జామియా మసీదు, గోజ్వారా, రాజౌరి కడల్‌, సిమెంట్‌ కడల్‌, ఈద్గా తదితర ప్రాంతాలలో రాజకీయ పార్టీలు ఎటువంటి భయం లేకుండా ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. ఒకప్పుడు అశాంతితో అట్టుడికిపోయే లాల్ చౌక్‌లో ప్రస్తుతం రాజకీయ నేతలు శాంతి సందేశం ఇస్తూ, తమకు ఓటు వేయాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement