ఎవరికీ భయపడం.. కాంగ్రెస్‌ సర్కార్‌పై కేటీఆర్‌ ఫైర్‌ | Sakshi
Sakshi News home page

కాళేశ్వరంపై విచారణకు సిద్ధం.. ఎవరికీ భయపడం.. కాంగ్రెస్‌ సర్కార్‌పై కేటీఆర్‌ ఫైర్‌

Published Wed, Jan 3 2024 7:13 PM

EX Minister KTR Slams Congress Government Over Political Criticism - Sakshi

హైదరాబాద్‌, సాక్షి: దేశంలో దివాలా తీసిన పార్టీకి తెలంగాణలో అనుకోకుండా అవకాశం వచ్చిందని.. అయితే మోసపూరిత హామీలతోనే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని.. అలాంటి వాళ్ల బెదిరింపులకు భయపడేది లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌  కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల నేపథ్యంలో బుధవారం సాయంత్రం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు.   

బీఆర్‌ఎస్‌పై జరిగిన దుష్రచారాన్ని సరిగ్గా ఎదుర్కొ లేకపో​యాం. ఎన్నికల్లో కాంగ్రెస్‌ 420 హామీలు ఇచ్చింది. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చింది. చిన్నచిన్న లోపాలతోనే మేం ఓడిపోయాం. అయినా.. తెలంగాణ అభివృద్ధి విషయంలో కట్టుబడి ఉన్నాం. బీఆర్‌ఎస్‌ ఓడిపోతుందని అనుకోలేదన్న చర్చ గ్రామస్థాయిలో ఇంకా నడుస్తోంది. నేటి నుంచి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలోనూ ఈ ప్రస్తావన వచ్చింది. పార్టీ కేడర్‌ను పట్టించుకోలేదని నేతలు ఈ సమావేశంలో చెప్పారు. కొన్ని ఇబ్బందులను మేం కూడా గుర్తించాం’’  అని కేటీఆర్‌ అన్నారు. 

తెలంగాణ అంటే కేసీఆర్‌.. కేసీఆర్‌ అంటే తెలంగాణ. ప్రజల కోసం బీఆర్‌ఎస్‌ ఎన్నో పోరాటాలు చేసింది.  సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకుంది బీఆర్‌ఎస్సే. కాంగ్రెస్‌ 420 హామీలు ఇచ్చింది. అవన్నీ బుక్‌లెట్‌గా ప్రచురించాం. ఇంటింటికి పంచి ప్రజల్లోకి తీసుకెళ్తాం. బీఆర్‌ఎస్‌ నేతలపై దాడులు జరుగుతున్న విషయం అధిష్టానం దృష్టికి వచ్చింది. తుంగతుర్తిలో తాజాగా ఇద్దరు కార్యకర్తలపై దాడులు జరిగాయి. ఈ దాడుల్ని సహించం. ఇప్పటి నుంచి ఎవరి మీద దాడులు జరిగినా.. మేం వెళ్లి పరామర్శిస్తాం. 

బీఆర్‌ఎస్‌ లేకపోతే పార్లమెంట్‌లో తెలంగాణ ఉనికి లేకుండా పోతుంది. పార్లమెంట్ లో తెలంగాణ గళం వినిపించాలంటే.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను గెలిపించాలి. తెలంగాణ బలం-తెలంగాణ గళం బీఆర్‌ఎస్‌. 

కాంగ్రెస్‌వి చిల్లర రాజకీయాలు
ప్రభుత్వంలో ఉండి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సింది పోయి.. దివాలాకోరు రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేటీఆర్‌ మండిపడ్డారు. ల్యాండ్ క్రూజర్‌ వాహనాల విషయంలో కాంగ్రెస్ నాయకులు చిల్లరగా మాట్లాడుతున్నారు. అవి సొంతానికి వాడుకునే వాహనాలు కాదు. కేవలం హామీల అమలు పక్కనపెట్టడానికే కాంగ్రెస్‌ ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారాయన. కాళేశ్వరంపై విచారణకు సిద్ధమన్న కేటీఆర్‌.. తప్పు చేయని తాము ఎవరికీ భయపడబోమని అన్నారు. 

దేశంలో దివాలా తీసిన పార్టీకి తెలంగాణలో అనుకోకుండా అవకాశం వచ్చింది. రైతు బంధుపై ఇప్పటిదాకా అతీగతీ లేదు. సొంత రాష్ట్రం పరపతిని తగ్గించే విధంగా కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్‌ను బండి సంజయ్‌ పొగుడుతున్నారు. వారిద్దరి మధ్య ఒప్పందం కుదిరినట్లు ఉంది. బీజేపీలో బలమైన అభ్యర్థుల్ని బీఆర్‌ఎస్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించింది. అయితే.. కాంగ్రెస్‌ బీజేపీ ఒక్కటే. అందుకే 2019 ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోయిందని కేటీఆర్‌ చెప్పుకొచ్చారు.

Advertisement
Advertisement