నారాయణ మాటలతో కంగుతిన్న జనసేన కార్యకర్తలు | Sakshi
Sakshi News home page

నారాయణ మాటలతో కంగుతిన్న జనసేన కార్యకర్తలు

Published Wed, Mar 20 2024 11:51 AM

Ex Minister Narayana Distance To Janasena Leaders - Sakshi

నారాయణ తీరుతో కకావికలం 


జనసేన కార్యకర్తలు, నేతలను దూరం పెట్టిన వైనం 


ఓ కాపు నేతను వెంటేసుకొనికేడర్‌ తన వెంటే ఉందంటూ షో 


పత్తాలేని జనసేన జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్‌రెడ్డి  

అధికారమే పరమావధిగా ఏర్పడిన టీడీపీ, జనసేన కూటమిలో లుకలుకలు అప్పుడే స్టార్టయ్యాయి. జనసేన నిర్వీర్య లక్ష్యంగా టీడీపీ నెల్లూరు నగర అభ్యర్థి నారాయణ తన రాజకీయ వ్యూహంతో పావులు కదుపుతుండ గా, ఈ యత్నాలు సక్సెసయ్యాయి. ఆ పార్టీ నాయకులతో పాటు చిరంజీవి అభిమాన సంఘ నేతలనూ దూరం పెడుతున్నారు. తన కాంపౌండ్‌లోని ఓ చోటా నేతను ఆ పార్టీలోకి పంపి.. ఆయనే కీలక వ్యక్తిగా చూపించి.. ఓ బలమైన సామాజికవర్గానికి చెందిన నేతలకు ప్రాధాన్యం లేకుండా చేశారు.   

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో జనసేన పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మారిన రాజకీయ పరిస్థితులతో ఆ పార్టీకి జిల్లాలో సీట్ల కేటాయింపులో టీడీపీ రిక్తహస్తం చూపింది. మరోవైపు టీడీపీ నెల్లూరు నగర అభ్యర్థి నారాయణ తన పోకడలతో ఆ పార్టీని ఖాళీ చేయిస్తున్నారు. జిల్లాలో జనసేన అంటే మనుక్రాంత్‌రెడ్డే గుర్చొచ్చేవారు. ఆవిర్భావం నుంచే పార్టీలో ఉంటూ జిల్లా బాధ్యతలను తన భుజస్కంధాలపై మోశారు. జిల్లాలో పార్టీ కార్యక్రమాలు.. రాష్ట్రస్థాయి వ్యవహారాల్లో ఆర్థికంగా చేయూతనిచ్చేవారు. జిల్లాలో పార్టీకి బలమైన కేడర్‌ లేకపోయినా అందులోనే ఉంటూ.. తనకు పార్టీ ద్వారా ఏదో రోజు సరైన గుర్తింపు, ప్రాధాన్యం లభిస్తుందని ఆశించారు. పొత్తులో భాగంగా జిల్లాలో ఒక సీటును జనసేనకు కేటాయిస్తే.. అది తనకే లభిస్తుందని ధీమాగా ఉన్నారు.

అంతా.. వారే..!
తన సామాజికవర్గానికి చెందిన క్రిమినల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న వ్యక్తిని జనసేనలోకి నారాయణ రెండేళ్ల క్రితం పంపారు. రాష్ట్ర స్థాయిలో వేములపాటి అజయ్‌కుమార్‌కు దగ్గర చేశారు. ముఖ్య అనుచరుడిగా ఉన్న చోటా నేత ద్వారా మరో కుంపటి పెట్టించి రాజకీయ కార్యకలాపాలను చేయసాగారు. ఇదంతా ఓ ఎత్తయితే.. ఎన్నికల వేళ మనుక్రాంత్‌ను పూర్తిగా పక్కన పెట్టేసి తన సామాజికవర్గానికి చెందిన వ్యక్తినే తెరపైకి తీసుకొచ్చారు. దీనికి వేములపాటి వెనుక నుంచి అధిష్టానం ద్వారా గ్రీన్‌సిగ్నల్‌ ఇప్పించారు. జిల్లాలో జనసేన అంటే ఆ చోటా నేతే అనే తరహాలో బిల్డప్‌ ఇచ్చారు.

పరిచయ కార్యక్రమాల్లోనూ అంతే..
నెల్లూరు సిటీ, కోవూరు నియోజకవర్గాల్లో ఉమ్మడి అభ్యర్థులతో జనసేన పరిచయ కార్యక్రమాలను ఇటీవల నిర్వహించారు. అయితే ఇందులోనూ జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమాన సంఘ నేతలు కనిపించలేదు. వేములపాటి అజయ్‌కుమార్‌, గునుకుల కిశోరే ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఆ కార్యక్రమానికి వచ్చిన వారంతా టీడీపీ కార్యకర్తలే కావడం విశేషం.

గత అనుభవాల నేపథ్యంలో..
గత ఎన్నికల్లో తన ఓటమికి ఓ సామాజికవర్గమే కారణమని భావిస్తున్న నారాయణ.. తాజాగా జరగనున్న ఎన్నికల్లో తన కార్యకలాపాల్లో వారిని దూరం పెట్టేశారు. గత ఎన్నికల్లో టీడీపీ నేతలు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, రమేష్‌రెడ్డి తదితరులు డబ్బులు పంచకపోవడంతోనే తాను ఓటమి పాలయ్యాయని తన అనుచరుల వద్ద వాపోయారని తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని భావించిన నారాయణ.. ఆ సామాజికవర్గాన్ని పూర్తిగా పక్కనబెట్టేశారనే ప్రచారం జరుగుతోంది.

అభిమాన సంఘాలకు చోటేదీ..?
చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ అభిమాన సంఘాల నేతలు, జనసేన క్యాడర్‌ టీడీపీ ప్రచార కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొన్న దాఖలాల్లేవు. టీడీపీ నేతలతోనే జనసేన జెండాలను గునుకుల కిశోర్‌ మోయించి.. ప్రచారం చేయిస్తున్నారని అభిమాన సంఘాల నేతలు వాపోతున్నారు.

క్రమక్రమంగా దూరం  
తన సొంత నిధులను పెద్ద మొత్తంలో వెచ్చించి పార్టీ కేడర్‌ను మనుక్రాంత్‌రెడ్డి పెంచుకుంటూ వచ్చారు. నగర నియోజకవర్గ పరిధిలో డివిజన్ల వారీగా జనసేన కార్యాలయాలను తెరిచి ప్రచారం చేసుకున్నారు. అయితే పొత్తులో భాగంగా నెల్లూరు సిటీని టీడీపీకి కేటాయించడంతో రూరల్‌ స్థానం నుంచి పోటీ చేసేందుకు నిధులను నారాయణ సమకూర్చుతారంటూ బుజ్జగించారు. అయితే అక్కడా ఆయనకు సీటు లభించలేదు. అయినా పార్టీ ఆదేశాల మేరకు టీడీపీ కోసం పనిచేస్తుండగా.. నారాయణ క్రమక్రమంగా దూరం పెట్టారు.

Advertisement
Advertisement