AIADMK: అమ్మ పార్టీలో అల్పపీడనం

1 Dec, 2021 09:05 IST|Sakshi
అన్నాడీఎంకే పార్టీ కార్యాలయం 

వర్గ విభేదాలతో కుమ్ములాట

అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశంపై ఉత్కంఠ

సాక్షి, చెన్నై : అమ్మ పార్టీలో ‘అల్పపీడనం’ మరింతగా బలపడి అన్నాడీఎంకే శ్రేణులను ఆందోళనకు గురిచేస్తున్న తరుణంలో బుధవారం పార్టీ కార్యవర్గం సమావేశం అవుతోంది. అన్నాడీఎంకే అధికారం కోల్పోయిన నాటి నుంచి అంతర్గత విబేధాలు మరింత ముదురుతున్నాయి. పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్‌ ఓ పన్నీర్‌సెల్వం, కో–కన్వీనర్‌ ఎడపాడి పళనిస్వామి మధ్య మొదలైన ఆధిపత్యపోరు అనేక పరిణామాలకు దారితీస్తోంది.

ఇద్దరి కుమ్మలాటల మధ్య కేడర్‌ నలిగి పోతుండగా మాజీమంత్రి సెంగొట్టయ్యన్‌ ముచ్చటగా తెరమీదకు వచ్చాడు. పార్టీ శ్రేణుల్లో అధిగశాతం ఓపీఎస్‌ లేదా ఈపీఎస్‌ వైపు నిలిచి ఉండగా, సెంగొట్టయ్యన్‌ ఇద్దరితోనూ విబేధిస్తూ మూడో శక్తిగా ఎదిగిగేందుకు మొదలెట్టిన ప్రయత్నాలు మరో కల్లోలానికి కారణమయ్యాయి. 

అమ్మ మరణం తరువాత..
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరువాత వచ్చిన పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిని చవిచూసింది. అలాగే ఇటీవల ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పరాజయం తప్పలేదు. గత కొన్నేళ్లుగా పార్టీకి సారథ్యం వహిస్తున్న ఎడపాడి, పన్నీర్‌సెల్వం ఓపీఎస్, ఈపీఎస్‌ మధ్య సఖ్యత లేకపోవడం, ఎన్నికల ప్రచారంలో అధికార పక్షంపై చేస్తున్న విమర్శలు చేయడంలో సరిగా విఫలమవడం ఓటమికి ఒక కారణంగా కార్యకర్తలు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో జిల్లా కార్యదర్శుల సమావేశం నవంబరు 24వ తేదీన ఓపీఎస్, ఈపీఎఎస్‌ అధ్యక్షతన చెన్నై రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. త్వరలో రానున్న కార్పొరేషన్, మున్సిపాలిటీ, పట్టణ పంచాయతీ ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చించాల్సి ఉంది.

అయితే ఆ అంశానికి తావులేకుండా పార్టీ నాయకత్వంలో మార్పు, నిర్వాహకుల నియామకాలను కొందరు లేవనెత్తడం సమావేశాన్ని దారిమళ్లించి ఒకరిపై ఒకరు భౌతికదాడులకు పాల్పడే పరిస్థితి తలెత్తింది. మాజీ ఎంపీ అన్వర్‌రాజా మాట్లాడే సమయంలో మాజీమంత్రి సీవీ షణ్ముగం అతడిపైకి దూసుకెళ్లారు. మాజీమంత్రి వైద్యలింగం, సీవీ షణ్ముగం మధ్య వాగ్వాదం ఉద్రిక్తలకు దారితీసింది.

అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో అధికారంలో ఉన్నవారు మాత్రమే లాభపడ్డారని, ద్వితీయశ్రేణి క్యాడర్‌ను ఎవరూ పట్టించుకోలేదని సెంగొట్టయ్యన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తనవైపు బలం కూడగట్టే ప్రయత్నం చేశారు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో పార్టీ  కార్యకర్గ సమావేశానికి బుధవారం సమాయుత్తం అయ్యారు. అజెండాలోని అంశాలకు అనుగుణంగా సమావేశం సాగేనా ? మరింత గందరగోళ పరిస్థితులకు దారితీసేనా అని అన్నాడీఎంకే శ్రేణులు ఉన్నారు.

మరిన్ని వార్తలు