BS Yediyurappa: యడ్డి వారసుడెవరో? బీజేపీ చేతిలో ఆ 8 మంది పేర్లు!

25 Jul, 2021 03:46 IST|Sakshi

8 మందిని షార్ట్‌లిస్ట్‌ చేసిన బీజేపీ పెద్దలు

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా యడియూరప్ప స్థానంలో బలమైన మరోనేతను నియమించడం బీజేపీకి సవాలుగా మారింది. కన్నడనాట బలమైన లింగాయత్‌ సామాజికవర్గానికి చెందిన యడియూరప్ప (78)ను తప్పించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించిందని గత కొంతకాలంగా జోరుగా వార్తలు వెలువడుతున్నాయి. ఈ సోమవారంతో యడ్డి సీఎం పదవిని చేపట్టి రెండేళ్లు అవుతుంది. యడ్డి స్థానంలో అందరికీ ఆమోదయోగ్యుడైన, ప్రజాదరణ కలిగిన నేతను వెతికిపట్టుకోవడం ఇప్పుడు బీజేపీకి కత్తిమీద సాములా మారింది.

దక్షిణాదిలో తమకు అత్యంత కీలకమైన కర్ణాటకలో 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ గట్టి కసరత్తు చేస్తోంది.  కొత్త సీఎంగా మొత్తం ఎనిమిది మంది పేర్లను బీజేపీ పెద్దలు షార్ట్‌లిస్ట్‌ చేసినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. యడ్డి వారసుడిగా లింగాయత్‌ సామాజికవర్గానికి చెందిన వారికే అవకాశం ఇవ్వాలనేదే అధిష్టానం ఉద్దేశంగా కనపడుతోంది. కర్ణాటక జనాభాలో లింగాయత్‌లు 16 శాతానికి పైగానే ఉంటారు. ఎప్పటినుంచో కమలదళానికి గట్టి మద్దతుదారులు. ఢిల్లీ పెద్దలు షార్ట్‌లిస్ట్‌ చేసిన జాబితాలో పంచమశీల లింగాయత్‌లు నలుగురు ఉన్నారు.

విజయపుర ఎమ్మెల్యే బసన్నగౌడ పాటిల్, ధార్వాడ్‌ ఎమ్మెల్యే అరవింద్‌ బెల్లాద్, గనుల శాఖ మంత్రి మురుగేష్‌ నిరానీ, బస్వరాజ్‌ బొమ్మయ్‌లు ఈ నలుగురు. బసన్నగౌడ పాటిల్‌ ఆర్‌ఎస్‌ఎస్‌లో బలమైన మూలాలున్న వ్యక్తి. ఉత్తర కర్ణాటకలో పేరున్న నాయకుడు. కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు అదనపు అర్హత అవుతుందని భావిస్తున్నారు. పంచమశీల లింగాయత్‌లను బీసీలుగా గుర్తించి రిజర్వేషన్లు ఇవ్వాలని ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఉద్యమంలో కీలకభూమిక పోషించారు.

అరవింద్‌ బెల్లాద్‌ ఇంజనీరింగ్‌ చదివారు. వ్యాపారవేత్త కూడా. క్లీన్‌ఇమేజ్‌ ఉంది. బాగల్‌కోట్‌ జిల్లాలోని బిల్గి నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన మురుగేష్‌ నిరానీకి చక్కెర పరిశ్రమలు ఉన్నాయి.  హోంమంత్రి అమిత్‌కు సన్నిహితుడిగా చెబుతారు. యడ్డీ తన వారసుడిగా హోంమంత్రి బస్వరాజ్‌ బొమ్మయ్‌ పేరును సిఫారసు చేసే చాన్సుంది. కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి, బీజేపీ నేషనల్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బీఎల్‌ సంతోష్, అసెంబ్లీ స్పీకర్‌ విశ్వేశ్వర హెగ్డే (బ్రాహ్మణ సామాజికవర్గం), సి.టి.రవి (ఒక్కళిగ)లు రేసులో ఉన్న ఇతర ప్రముఖులు. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నళిన్‌ కతీల్‌కు చెందిన లీకైన ఆడియో సంభాషణను బట్టి చూస్తే ప్రహ్లాద్‌ జోషి రేసులో అందరికంటే ముందున్నట్లు కనపడుతోంది.  

నన్నెవరూ సంప్రదించలేదు: ప్రహ్లాద్‌
హుబ్బళి: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి బాధ్యతలు చేపడతారనే వార్తలపై ఆయన శనివారం స్పందించారు. ‘ బీజేపీ కేంద్ర నాయకత్వం ఈ విషయంపై నాతో ఏమీ మాట్లాడలేదు. అయినా, సీఎంగా యడియూరప్ప రాజీనామా చేస్తారనే అంశాలను ఎవరూ మాట్లాడటం లేదు. కేవలం ప్రసారమాధ్యమాలు(మీడియా) మాత్రమే ఈ అంశాన్ని చర్చిస్తున్నాయి. కొత్త సీఎంగా నన్ను ఎంపికచేస్తారనే విషయాన్ని ఎవరూ నాతో ఇంతవరకూ ప్రస్తావించలేదు’ అని మీడియాతో అన్నారు. అత్యంత ముఖ్యాంశాలపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా, పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డాలదే తుది నిర్ణయమని చెప్పారు. 

మరిన్ని వార్తలు