కేసీఆర్‌ది దింపుడు కల్లం ఆశ | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ది దింపుడు కల్లం ఆశ

Published Fri, Aug 4 2023 3:11 AM

Former minister Jupalli joins Congress in presence of Kharge  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సిద్ధమయ్యారని అర్థమై దింపుడు కల్లం ఆశతో బీసీ బంధు, రైతు రుణమాఫీ అంటూ కేసీఆర్‌ చివరి ప్రయత్నాలు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. కేసీఆర్‌ ఎన్ని ప్రయోగాలు, ప్రయత్నాలు చేసినా... ఇంటింటికీ తిరిగి ప్రజల కాళ్లు పట్టుకున్నా తెలంగాణ సమాజం, కాంగ్రెస్‌ పార్టీ కేసీఆర్‌ను వదిలిపెట్టబోదని రేవంత్‌ హెచ్చరించారు.

గురువారం ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రేవంత్, మాణిక్‌రావ్‌ ఠాక్రే, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, మాజీ పోలీసు అధికారి నాగరాజు, కూచికుళ్ల రాజేశ్‌రెడ్డి, మేఘారెడ్డి సహా పలువురు నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని తెలిపారు. 4 కోట్ల మంది ప్రజల సంక్షేమం కోసం పనిచేయకుండా తన నలుగురు కుటుంబ సభ్యుల సంక్షేమం, పదవు లు, పైసలు, ఫాంహౌస్‌లు, కాంట్రాక్టుల కోసం రాష్ట్రాన్ని పణంగా పెట్టారని దుయ్యబట్టారు. «కేసీఆర్‌కు ఢిల్లీలో దందా చేయాలన్నా, తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా లిక్కర్‌ ఆదాయ వనరుగా మారిందని విమర్శించారు. ప్రస్తుతం కేసీఆర్‌ లిక్కర్‌ కింగ్‌లా మారిపోయారని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. 

కేసీఆర్‌ ప్రైవేట్‌ సైన్యంపై ఈసీకి ఫిర్యాదు 
ఆర్టీసీ కారి్మకుల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవడానికే ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి కేసీఆర్‌ తెరలేపారని రేవంత్‌ ఆరోపించారు. మరోసారి మోసగించేందుకు కేసీఆర్‌ వేస్తున్న బైరూపుల వేషాన్ని తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని... ఈసారి ఆయన మాటలను ఎవరూ నమ్మరని రేవంత్‌ చెప్పారు.

అందుకే కేసీఆర్‌ పార్టీ ఫిరాయింపులు, డబ్బు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేల సిఫార్సుల మేరకే పోలీసుల బదిలీలను సీఎం చేపడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో నెగ్గడానికి రిటైరైన అధికారులను ప్రైవేట్‌ సైన్యంగా తయారుచేసి కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని, ఆ వివరాలన్నింటినీ సేకరించి త్వరలో ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ ఫిర్యాదు చేస్తుందని వివరించారు. 

కేసీఆర్‌ నియంత: జూపల్లి 
మాజీ మంత్రి జూపల్లి మాట్లాడుతూ కేసీఆర్‌ తొమ్మి దేళ్లుగా నియంతలా పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలను మభ్యపెట్టే విధంగా ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి మరిచిపోవడం ఆయనకే చెల్లుతుందన్నారు. దేశ చరిత్రలో కేసీఆర్‌ను మించిన అవినీతి ముఖ్యమంత్రి ఎవరూ లేరని వ్యా ఖ్యానించారు. రాజకీయ వ్యవస్థను కేసీఆర్‌ భ్రష్టుపట్టించారని... ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఖర్చు పెడుతున్న రూ. వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో కేసీఆర్‌ చెప్పాలని జూపల్లి డిమాండ్‌ చేశారు.  

కేసీఆర్‌.. చార్లెస్‌ శోభరాజ్‌ శిష్యుడు
తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించేది కాంగ్రెస్‌ పార్టీనేనని, బీజేపీ ఏమాత్రం నమ్మదగిన పార్టీ కాదని రేవంత్‌ పేర్కొన్నారు. బీజేపీ నాయకులు ఇప్పటికైనా ఈ విషయం గుర్తించి కాంగ్రెస్‌లో చేరాలని రేవంత్‌ ఆహ్వానించారు. తనను చంద్రబాబు శిష్యుడు అని బీఆర్‌ఎస్‌ నాయకులు అంటున్నారని... అయితే కేసీఆర్‌ మాత్రం అంతర్జాతీయ నేరగాడు చార్లెస్‌ శోభరాజ్‌ శిష్యుడని... ఇప్పటివరకు రూ. లక్ష కోట్లు అక్రమంగా ఆర్జించారని ఆరోపించారు. 

Advertisement
Advertisement