కాంగ్రెస్‌పై ఆజాద్‌ సంచలన వ్యాఖ్యలు.. సోనియాకు బిగ్ షాక్‌

20 Mar, 2022 21:05 IST|Sakshi

శ్రీనగర్‌: కాంగ్రెస్‌ పార్టీపై ఆ పార్టీ సీనియర్‌ నేత, జీ-23 గ్రూప్‌ సభ్యుడు గులాం నబీ ఆజాద్‌ సంచలన వ్యాఖ‍్యలు చేశారు. కులం, మతం వంటి వివిధ అంశాల ఆధారంగా ప్రజలను విభజించటంలో అన్ని రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయని ఆరోపించారు. అందులో కాంగ్రెస్‌ పార్టీ సైతం ఉందని విమర‍్శలు గుప్పించారు. 

ఆదివారం జమ్మూలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆజాద్‌ మాట్లాడుతూ.. జమ్ముకాశ్మీర్‌లో 1990లో కాశ్మీర్ పండిట్లపై జరిగిన మారణహోమానికి పాకిస్థాన్, ఉగ్రవాదులే కారణమని అన్నారు. ఈ దాడుల కారణంగా హిందువులు, ముస్లింలు, డోగ్రాలు, కాశ్మీర్ పండిట్​ వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయని వెల్లడించారు. దీనికి దాయాది దేశమే ముఖ్య కారణమన్నారు.

ఈ క్రమంలో కులం, మతం వంటి వివిధ అంశాల పరంగా 24x7 ప్రజలను విభజించి పాలించడంలో అన్ని రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయన్నారు. ఇందులో కాంగ్రెస్‌ పార్టీ సైతం ఉందని ఘాటుగా వ్యాఖ‍్యలు చేశారు. ఈ విషయంలో తాను వ్యక్తిగతంగా అన్ని పార్టీలను క్షమించనని కుండబద్దలు కొట్టారు. ప్రజలు ఎప్పుడూ ఐకమత్యంతో ఉండాలి. కుతం, మతంతో కాకుండా అందరికీ సమానంగా న్యాయం అందాలని అతిపెద్ద హిందువు, లౌకికవాది అయిన మహత్మా గాంధీ చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరోవైపు.. కాశ్మీర్ పండిట్లపై జరిగిన మారణకాండ ఆధారంగా ద కాశ్మీర్ ఫైల్స్ సినిమాను నిర్మించారు. ఈ సినిమా మార్చి 11న విడుదలైన పలు రికార్డులను బద్దలు కొడుతోంది. 

మరిన్ని వార్తలు