కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. పార్టీకి గుడ్‌బై చెప్పిన గౌరవ్‌ | Sakshi
Sakshi News home page

Gourav Vallabh Resigned: ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. పార్టీకి గుడ్‌బై చెప్పిన గౌరవ్‌

Published Thu, Apr 4 2024 10:27 AM

Gourav Vallabh Resigned Form Congress - Sakshi

కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. రాజస్థాన్‌కు  చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గౌరవ్ వల్లభ్ పార్టీకి రాజీనామా చేశారు. తాను సనాతనానికి వ్యతిరేక నినాదాలు చేయలేనని, ఇకపై పార్టీలో కొనసాగలేనని ప్రకటించారు. 

గౌరవ్ వల్లభ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు తాను పంపిన రాజీనామా లేఖను సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. దానిలో ‘నేడు కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న మార్గంలో నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. నేను సనాతన వ్యతిరేక నినాదాలు చేయలేను. అందుకే కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నాను.  

నేను కాంగ్రెస్‌లో చేరినప్పుడు దేశంలోనే ఘన చరిత్ర కలిగిన పార్టీ అని నమ్మాను. యువకులకు, మేధావుల ఆలోచనలకు విలువ ఇస్తారని భావించాను. అయోధ్యలోని నూతన రామాలయం విషయంలో కాంగ్రెస్‌ వైఖరికి నేను కలత చెందాను. నేను పుట్టుకతో హిందువును. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిని. ఇండియా కూటమితో సంబంధం కలిగిన పలువురు నేతలు సనాతనానికి వ్యతిరేకంగా మాట్లాడటం నాకు నచ్చలేదని’ ఆ లేఖలో గౌరవ్ వల్లభ్ పేర్కొన్నారు. 
 

గౌరవ్ వల్లభ్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ తూర్పు నుంచి తొలిసారి పోటీ చేశారు. గౌరవ్ విద్యావంతునిగా పేరొందారు. జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్స్టిట్యూట్‌లో అధ్యాపకునిగా పనిచేశారు. క్రెడిట్ రిస్క్ అసెస్‌మెంట్‌లో డాక్టరేట్ అందుకున్నారు. విద్యావేత్తల కుటుంబం నుండి వచ్చిన గౌరవ్ వల్లభ్ 2023లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఓటమి చవిచూశారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా గౌరవ్ వల్లభ్ కాంగ్రెస్‌ పార్టీకి సేవలు అందించారు. 


 

Advertisement
Advertisement