‘తుప్పు పట్టిన సైకిల్-పగిలిపోయిన గ్లాసుకు గోల్డ్ కవరింగ్’ | Gudivada Amarnath Slams Pawan Kalyan And Chandrababu Naidu Over TDP Seat Sharing, Details Inside - Sakshi
Sakshi News home page

‘తుప్పు పట్టిన సైకిల్-పగిలిపోయిన గ్లాసుకు గోల్డ్ కవరింగ్’

Published Sat, Feb 24 2024 5:05 PM

Gudivada Amarnath Slams On Pawan Kalyan Over TDP Seat Sharing - Sakshi

సాక్షి, విశాఖపట్నం: తుప్పు పట్టిన సైకిల్, పగిలిపోయిన గ్లాసులకు గోల్డ్ కవరింగ్ ఇస్తూ..  తాము బలంగా ఉన్నామన్న భ్రమలో జనసేన, తెలుగుదేశం పార్టీలు ఉన్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. ఎండాడ వైఎస్ఆర్సీపి కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచి మేము ఓట్లు అడుగుతామని చెప్పారు.

అదే జనసేన, తెలుగుదేశం పార్టీలు ఆ రెండు పార్టీల మధ్య ఉన్న పొత్తే బలమని భావిస్తూ ఎన్నికల బరిలోకి దిగుతున్నాయని మంత్రి అమర్నాథ్ చెప్పారు. కేవలం 24 సీట్లు మాత్రమే జనసేనకి ఇచ్చి చంద్రబాబునాయుడు చేతులు దులుపుకొన్నారని, జనం కోరితే తాను ముఖ్యమంత్రి అవుతానని చెబుతూ వస్తున్న పవన్ కళ్యాణ్ ఈ సీట్లతో  ఏ విధంగా ముఖ్యమంత్రి అవుతారని, ఆ పార్టీ కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెబుతారని అమర్నాథ్ ప్రశ్నించారు.  

కాపులను హింసించిన బాబును ఎలా నమ్ముతారు?
 గడచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు ఏఏ మేళ్లను చేసిందో ధైర్యంగా చెప్పి మా పార్టీ అభ్యర్థులు ఓటు అడుగుతారని, 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజలకు తాను ఫలానాది చేశానని చెప్పుకునే ధైర్యం చంద్రబాబుకు లేదని అమర్నాథ్ విమర్శించారు.  జనసేన టిడిపి విడుదల చేసిన జాబితాను పరిశీలిస్తే కాపుల్ని కమ్మలు... కమ్మ కులస్తులను కాపులు నమ్మడం లేదనేది తేలిపోయిందని అమర్నాథ్ అన్నారు. వంగవీటి మోహన్ రంగా నుంచి ముద్రగడ పద్మనాభం వరకు కాపులను హింసించిన వారిని ప్రజలు ఎలా నమ్ముతారని ఆయన ప్రశ్నించారు. 

అది ప్యాకేజీ ఇంజినీరింగ్
జనసేన, టిడిపి ఉమ్మడి జాబితాలో సోషల్ ఇంజనీరింగ్ జరిగిందని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని అక్కడ సోషల్ ఇంజనీరింగ్ కన్నా ప్యాకేజీ ఇంజనీరింగ్ కనిపించిందని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న విషయాన్ని స్పష్టత ఇవ్వలేదని అమర్నాథ్ అన్నారు.

చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మానికి విరుద్ధంగా రెండు సీట్లను ప్రకటిస్తే, పవన్ కళ్యాణ్ అందుకు ప్రతిగా రెండు సీట్లు ప్రకటించారని, అప్పట్లో పవన్ కళ్యాణ్ తీరును అందరు అభినందించారని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు 94 సీట్లను ప్రకటించినప్పుడు, పవన్ కళ్యాణ్ కేవలం ఐదు సీట్లతోటి ఎందుకు సరిపెట్టుకున్నారని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు.

సామాజిక న్యాయం ఎక్కడ?
తెలుగుదేశం జనసేన పార్టీలు ప్రకటించిన తొలి జాబితాను పరిశీలిస్తే, ఈ రెండు పార్టీలు సామాజిక న్యాయాన్ని పాటించ లేదన్న విషయం అర్థమవుతోందని  అన్నారు.   ప్రస్తుతం ప్రకటించిన జాబితాలో ఎంతమంది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు స్థానం కల్పించారో ఈ రెండు పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. ఏది ఏమైనా, ఎవరు ఎన్ని పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగిన వైఎస్సార్‌సీపీ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని, మరోమారు జగన్ మోహన్ రెడ్డిగారు ముఖ్యమంత్రి అవుతారని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement