వచ్చేది హంగ్‌.. మనదే పవర్‌! | Sakshi
Sakshi News home page

వచ్చేది హంగ్‌.. మనదే పవర్‌!

Published Sat, Oct 7 2023 2:16 AM

Hung in Telangana bjp BL Santhosh key comments - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘తెలంగాణలో హంగ్‌ తప్పదు.. అయినా అధికారం మనదే’అని బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ అన్నారు. ‘బీజేపీ నిర్వహించిన సర్వేలు, అధ్యయనాలను పరిశీలిస్తే ఏ పార్టీకి 60 సీట్లు వచ్చే పరిస్థితి లేదు. సోషల్‌ మీడియాలో జరిగే ప్రచారాన్ని విశ్వసించొద్దు. వాటి ఉచ్చులో పడొద్దు..’అని చెప్పారు. శుక్రవారం ఘట్‌కేసర్‌ సమీపంలోని ఓ కాలేజీలో జరిగిన బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎన్నికల దిశానిర్దేశం చేశారు. 

మొత్తం 43 మంది అగ్రనేతల సభలు 
‘వచ్చే 60 రోజులు టార్గెట్‌గా పెట్టుకొని గట్టిగా కృషి చేయాలి. రాత్రి, పగలు కష్టపడాలి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మొత్తం 43 మంది అగ్రనేతలు, ముఖ్య నాయకుల సభలు నిర్వహిస్తాం. ఎప్పటినుంచో పని చేస్తున్నాం.. టికెట్‌ ఇవ్వాలి అంటే కుదరదు. 119 స్థానాల కోసం 2 వేల మంది అడుగుతున్నారు. స్థానిక బలం ఆధారంగానే టికెట్‌ ఇస్తాం.

టికెట్‌లు ఢిల్లీలోనో, హైదరాబాద్‌లోనో డిసైడ్‌ కావు. నియోజకవర్గాల్లో చేసే పని ఆధారంగా స్థానికంగానే నిర్ణయిస్తాం. ముఖ్యమంత్రి ఎవరు అనేది జాతీయ నాయకత్వం చూసుకుంటుంది. ఎవరూ నేను ముఖ్యమంత్రి అని ప్రచారం చేసుకోవద్దు. అధికారంలోకి వస్తే అందరికీ పదవులు వస్తాయి..’అని సంతోష్‌ చెప్పినట్టు తెలిసింది. 

మనం ఓడిపోలేదు.. బలపడ్డాం 
‘మనం సరిగ్గా పనిచేయాలి. మనలో మనం గొడవలు పడొద్దు. ఎవరూ లూజ్‌ టాక్‌ చేయవద్దు. అందరూ కలిసి పని చేయండి. మునుగోడులో ఓడిపోయాం అని మీరు అనుకుంటున్నారు. కానీ మనం బలపడ్డాం. 12 వేల ఓట్ల నుండి 90 వేల ఓట్లకు పెరిగాం. జీహెచ్‌ఎంసీలో నాలుగు సీట్ల నుండి 48 సీట్లు గెలిచాం. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో గెలిచాం. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు ఎంఐఎం అవసరం. అందుకోసమే ఆ పార్టీతో అవి అంటకాగుతున్నాయి.

పశ్చిమ బెంగాల్, తెలంగాణ సీఎంలు ఒకేలా వ్యవహరిస్తున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే అక్రమ కేసులు పెడుతున్నారు. వీటికి భయపడాల్సిన అవసరం లేదు..’అని సంతోష్‌ పేర్కొన్నారు. కాగా పార్లమెంట్‌ ఉభయ సభలు ‘నారీశక్తి వందన్‌ బిల్లు’కు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రాష్ట్ర కౌన్సిల్‌ ఆమోదించింది. దీనితో పాటు రాజకీయ తీర్మానాన్ని, జీ–20 సమావేశాల విజయవంతం, చంద్రయాన్‌–2 విజయవంతంపై తీర్మానాలు కూడా ఆమోదించారు. 

బీజేపీకి మద్దతివ్వండి 
అన్నివర్గాల ప్రజలను దగా చేసిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఓడించి, ప్రజాస్వామ్యయుత పాలన నెలకొల్పేందుకు బీజేపీకి తెలంగాణ ప్రజలు మద్దతునివ్వాలని కోరుతూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టారు. ‘మహమూద్‌ అలీ హోంమంత్రిగా ఉండటానికి అనర్హుడు. పోలీస్‌ చెంప పగలగొడతాడా?’అంటూ తీర్మానంలో ప్రశ్నించారు. సమావేశం ప్రారంభానికి ముందు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాలేజీ ప్రాంగణంలో మొక్క నాటారు.

జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్‌ ఛుగ్, సునీల్‌బన్సల్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్, రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్‌చార్జ్‌ ప్రకాష్‌ జవదేకర్, నేతలు అరి్వంద్‌ మీనన్, నల్లు ఇంద్రసేనారెడ్డి, సోయం బాపూరావు, పి.మురళీధర్‌రావు, వివేక్‌ వెంకటస్వామి, ఏపీ జితేందర్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, పొంగులేటి సుధాకరరెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, రవీంద్రనాయక్, ఎవీఎన్‌ రెడ్డి, చిత్తరంజన్‌దాస్, డా.కాసం వెంకటేశ్వర్లు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement