ఈటల చిన్నోడు.. తర్వాత చూసుకుందాం 

25 Jul, 2021 03:00 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ హుజూరాబాద్‌ నేతతో సీఎం కేసీఆర్‌ 

‘దళిత బంధు’ పథకంపై ఫోన్‌ చేసి మాట్లాడిన ముఖ్యమంత్రి

26న ప్రగతిభవన్‌లో అవగాహన సదస్సుకు రావాలని పిలుపు 

‘ఈటల’ ప్రస్తావన తెచ్చిన నేత.. తర్వాత చూసుకుందామన్న కేసీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/ఇల్లందకుంట(కరీంనగర్‌):  ‘ఈటల రాజేందర్‌ చిన్నోడు.. అయ్యేది లేదు.. సచ్చేది లేదు..’’ అని టీఆర్‌ఎస్‌ హుజూరాబాద్‌ నేతతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌కు వచ్చినప్పుడు దానికి సంబంధించి అన్ని విషయాలు మాట్లాడుకుందామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘దళిత బంధు’ పథకానికి సంబంధించి ఈ నెల 26న ప్రగతిభవన్‌లో అవగాహన సదస్సు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. దానికి హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి 427 మంది దళిత ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇందులో భాగంగా ఇల్లందకుంట మండలం తనుగుల గ్రామ ఎంపీటీసీ వాసాల నిరోష భర్త రామస్వామికి సీఎం కేసీఆర్‌ స్వయంగా ఫోన్‌ చేసి మాట్లాడారు. దళితులను ప్రగతిభవన్‌ సమావేశానికి తీసుకెళ్లే ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. రామస్వామితో సీఎం కేసీఆర్‌ సంభాషణ ఇదీ.. 

సీఎం: హలో రామస్వామి గారు.. బాగున్నారా? 
రామస్వామి: బాగున్నాను.. సార్‌. 
సీఎం: రామస్వామిగారు దళితబంధు విజయం మీద తెలంగాణ దళిత జాతి భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇది బాధ్యతతో, ఓపికతో, çస్పష్టమైన అవగాహన దృక్పథంతో చేసే పని. 
రామస్వామి: అవును సార్‌.. 
సీఎం: నా రిక్వెస్ట్‌ ఏందంటే.. మీ జిల్లా కలెక్టర్‌ మీకు ఫోన్‌ చేస్తడు. మీరు ఆయన దగ్గర రేపు లంచ్‌ చేయాలె. 26 నాటి కార్యక్రమం గురించి అవగాహన చేసుకోవాలె. 26న ఉదయం అందరూ మీ మండల కేంద్రంలో జమ అయితరు. అక్కడ ప్రభుత్వం బ్రేక్‌ఫాస్ట్‌ ఏర్పాటు చేస్తది. బస్సు ఉంటది. అంతా బస్సులో ఎక్కి హుజూరాబాద్‌ టౌన్‌కు వెళ్తరు. అన్ని మండలాల బస్సులు అక్కడికి వస్తయి. అంతా మొత్తం 427 మంది.. 30, 40 మంది అధికారులు ఉంటరు. అక్కడి నుంచి నా దగ్గరకు వస్తరు. ఆ రోజంతా నేను మీతోనే ఉంటా. 
రామస్వామి: సంతోషం సార్‌.. 
సీఎం: ప్రగతిభవన్‌కు రాగానే టీ తాగి మీటింగ్‌ స్టార్ట్‌ చేసుకుంటం. రెండు గంటలు మీటింగ్‌.. తర్వాత లంచ్‌ చేసుకొని.. మళ్లీ 2 గంటలు కూర్చొని అపోహలు, అనుమానాలు, మంచీచెడ్డా మాట్లాడుకుందాం. హుజూరాబాద్‌ నియోజకవర్గం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పోవాల్సి ఉంటుంది. అన్నీ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తది. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. నేను మీతోనే ఉంటాను. 
రామస్వామి: థ్యాంక్స్‌ సార్‌. మా జాతికి న్యాయం జరుగుతుందనే సంపూర్ణ భరోసా ఉంది. మీరు ఫిక్స్‌ అయితే అవుతుంది సార్‌. 
సీఎం: వందకు వంద శాతం చేద్దాం. ప్రాణం పోయినా వెనుకాడేదిలేదు. రెండేళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడి పోతమో ప్రపంచానికి చూపిద్దాం. 
రామస్వామి: ఓకే సార్‌.. నమస్కారం సార్‌. 

ఈటలది చిన్న విషయం!
రామస్వామి: నేను 2001 నుంచీ పనిచేస్తున్నాను సర్‌. కానీ ఈటల రాజేందర్‌ నన్ను ఎప్పుడూ పట్టించుకోలే. అవసరం, సందర్భం వచ్చినప్పుడు ప్రతి విషయంలో పక్కనపెట్టిండు. అయినా నేను మీ (కేసీఆర్‌) నాయకత్వం మీద నమ్మకంతో పనిచేసుకుంటూ వచ్చిన. మొన్న 2018లో కూడా ఎంపీటీసీ టికెట్‌ ఇవ్వకపోతే.. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచినం సర్‌. తర్వాత ఈటల రాజేందర్‌ దగ్గరికి ఎప్పుడూ కూడా పోలేదు. నాకు వినోద్‌కుమార్‌ సార్, పరిపాటి రవీందర్‌రెడ్డి సార్‌ నాకు దేవుడిలా ఉన్నారు.  
సీఎం: ఒక రిక్వెస్టు ఏందంటే.. మీరు వచ్చేయండి ఇక్కడికి (ప్రగతి భవన్‌కు).. ఆ రోజు చెప్తాను. అన్ని విషయాలు మాట్లాడుకుందాం. వాడు చిన్నోడు.. రాజేందర్‌తో అయ్యేది లేదు.. సచ్చేది లేదు. విడిచిపెట్టండి. అది చిన్న విషయం.. చూసుకుందాం.. దళితబంధు మనకు పెద్ద విషయం. ప్రపంచానికే సందేశం ఇచ్చే మిషన్‌ ఇది. దీన్ని విజయవంతం చేసి చూపిద్దాం.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు