Huzurabad Assembly Constituency Of Karimnagar Political History - Sakshi
Sakshi News home page

కరీంనగర్ హుజూరాబాద్ మండలం రాజకీయ చరిత్ర

Published Mon, Jul 31 2023 11:11 AM

Huzurabad Mandal Of Karimnagar Political History - Sakshi

హుజూరాబాద్‌ నియోజకవర్గం

తెలంగాణ రాజకీయంలో పెద్ద పరిణామమే సంభవించింది. టిఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత ఈటెల రాజేందర్‌ను ముఖ్యమంత్రి కెసిఆర్‌ మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయడం, ఆయనపై కొన్ని భూ కబ్జా కేసుల విచారణ జరగడం, తదనంతర పరిణామాలలో ఈటెల ఎమ్మేల్యే పదవికి రాజీనామా చేసి, భారతీయ జనతా పార్టీలో చేరిపోవడం జరిగాయి. అ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో ఈటెల 23,855 ఓట్ల ఆదిక్యంతో గెలుపొంది సంచలన విజయం సాధించారు. ఈటెల రాజేందర్‌ను ఓడిరచడానికి టీఆర్‌ఎస్‌ గానీ, ముఖ్యమంత్రి తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ వారికి ఫలితం దక్కలేదు.

ఈటెలకు 107022 ఓట్లు రాగా టీఆర్‌ఎస్‌  అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌కు 83,167 ఓట్లే వచ్చాయి. కాగా కాంగ్రెస్‌ అభ్యర్థికి నర్సింగరావుకు 3,014 ఓట్లు మాత్రమే తెచ్చుకొని డిపాజిట్‌ కొల్పోవడం జరిగింది. 2018 టీఆర్‌ఎస్‌ తరుపున పోటీ చేసిన ఈటెల రాజేందర్‌కు 104840 రాగా, కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేసిన కౌశిక్‌ రెడ్డికి 61,121 ఓట్లు వచ్చాయి. కాగా ఇక్కడ మిగిలిన అభ్యర్దులకన్నా నోటాకు అధిక ఓట్లు రావడం విశేషం. నోటాకు 2847 ఓట్లు పడ్డాయి.  కాగా అప్పట్లో బిజేపీ డిపాజిట్‌ కొల్పోయింది. కానీ 2021లో ఈ ఉప ఎన్నిక సమయానికి కౌశిక్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌లోకి మారాడు. దీనివల్ల కాంగ్రెస్‌ దెబ్బతిన్నది కానీ టీఆర్‌ఎస్‌ మాత్రం గెలవలేకపోయింది. ఈటెల బిజేపిలోకి వెళ్లడం అంతకుముందు అక్కడ బలమే లేని బిజేపి గెలిచి సంచలనంగా మారింది. ఈటెల హుజూరాబాద్‌లో ఐదుసార్లు, అంతకుముందు కమలాపూర్‌లో రెండుసార్లు గెలిచారు.

కొంతకాలం క్రితం టిఆర్‌ఎస్‌కు సొంతదార్లు ఎవరూ అంటూ వ్యాఖ్యానించి ఈటెల వివాదంలో పడ్డారు. ఆ తర్వాత ఆయన మంత్రి పదవిని కోల్పోయి, పార్టీని వీడవలసి వచ్చింది. ఈటెల రాజేందర్‌ బిసి వర్గానికి చెందినవారు. ముదిరాజ్‌ సామాజికవర్గానికి చెందిన నేత. ఈయన 3 ఉప ఎన్నికలతో సహా ఏడు ఎన్నికలలో గెలిచిన కొద్ది మంది నేతలలో ఒకరుగా నమోదు అయ్యారు. 2008 ఉప ఎన్నికలో  గెలిచిన తర్వాత టిఆర్‌ఎస్‌  శాసనసభ పక్ష నేతగా ఉన్న ఈటెల రాజేందర్‌ హుజూరాబాద్‌లో 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్‌ క్యాబినెట్‌లో మంత్రిగా బాద్యతలు చేపట్టారు. కాని ఆ తర్వాత మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ అయ్యారు. ఆయన అంతకుముందు ఆరేళ్ల వ్యవధిలో నాలుగుసార్లు గెలిచి రికార్డులకెక్కారు. కమలాపూర్‌ నుంచి  2004, 2008 ఉప ఎన్నిక, హుజూరాబాద్‌లో  2009, 2010 ఉప ఎన్నికలో ఆయన విజయం సాదించారు. హుజూరాబాద్‌లో తదుపరి 2014, 2018, 2021 ఉప ఎన్నికలలో కూడా  ఆయన గెలుపొందారు. రెండుసార్లు తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆయన రాజీనామా చేసి విజయం సాదించారు.

టిఆర్‌ఎస్‌ నేతలు హరీష్‌రావు, కొప్పుల ఈశ్వర్‌ , ఈటెల రాజేందర్‌లు మాత్రమే ఇలా ఆరేళ్లలో నాలుగుసార్లు గెలిచిన ఘనత పొందారు. ఈ నియోజకవర్గంలో ఈటెల 2014లో కాంగ్రెస్‌ సమీప ప్రత్యర్ధి కె.సుదర్శనరెడ్డిని 57037 ఓట్ల తేడాతో ఓడిరచారు. ఆ ఎన్నికలో  టిడిపి, బిజెపి కూటమి అభ్యర్ధిగా పోటీచేసిన ముద్దసాని కశ్యప్‌ రెడ్డికి 15642  ఓట్లు వచ్చాయి. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో నాలుగుసార్లు రెడ్లు, రెండుసార్లు వెలమ, నాలుగుసార్లు బిసి నేతలు, మూడుసార్లు బ్రాహ్మణ, మూడుసార్లు ఇతరులు గెలుపొందారు. మొదట ఈటెల రాజేందర్‌ కమలాపూర్‌లో 2004లోను, ఆ తరువాత 2008లో రాజీనామా చేసిన టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు 16 మందిలో ఒకరిగా ఉన్న ఈయన  ఉప ఎన్నికలో పోటీ చేసి తిరిగి గెలుపొందారు. ఆ ఉప ఎన్నికలలో అప్పటి టిఆర్‌ఎస్‌ శాసనసభా పక్షనేతగా ఉన్న డాక్టర్‌ విజయరామారావు ఓటమి పాలవడంతో ఆ పక్ష నేతగా రాజేందర్‌ ఎంపికయ్యారు.

రాజేందర్‌ తెలంగాణ ఉద్యమంలో భాగంగా పార్టీ నిర్ణయం మేరకు 2010 ఫిబ్రవరిలో మళ్ళీ శాసనసభకు రాజీనామా చేసి తిరిగి ఉపఎన్నికలో టిడిపి నేత ముద్దసాని దామోదరరెడ్డిపై ఘన విజయం సాధించారు. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గం 1952, 57లలో ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. 1952లో ఒక స్థానం కాంగ్రెస్‌, మరోస్థానం సోషలిస్టు పార్టీ గెలుచుకున్నాయి. 1957లో రెండూ ఇండిపెండెంట్లు గెలుచుకున్నారు. 1983 నుంచి ఒక్కసారి కూడా ఇక్కడ కాంగ్రెస్‌ ఐ గెలుపొందలేదు. 1957లో ఇండిపెండెంటుగా గెలిచిన పి.నర్సింగరావు 1967లో కాంగ్రెస్‌ పక్షాన గెలిచారు.

1957, 62లలో గెలిచిన గడిపల్లి రాములు 1967లో మేడారం నుంచి గెలిచారు.  1978లో కాంగ్రెస్‌ పక్షాన గెలిచిన దుగ్గారాల వెంకట్రావు 1985లో టిడిపి అభ్యర్ధిగా గెలిచారు. 1994, 99లలో టిడిపి అభ్యర్ధిగా గెలుపొందిన ఏనుగుల పెద్దిరెడ్డి 2009లో ప్రజారాజ్యం అభ్యర్ధిగా హుస్నాబాద్‌లో పోటీచేసి ఓడిపోయారు. ఇక్కడ ఒకసారి గెలిచిన ఒడితెల రాజేశ్వరరావు, ఒకసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈయన సోదరుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు కమలాపూర్‌ నుంచి  2004 సాధారణ ఎన్నికలలోను, 2008లో టిఆర్‌ఎస్‌ వ్యూహంలో భాగంగా రాజీనామా చేసి రెండోసారి గెలుపొందారు. అయితే 2009లో  హుస్నాబాద్‌ నుంచి పోటీచేసి ఓడిపోయారు. లక్ష్మీకాంతరావు కొంతకాలం వై.ఎస్‌. క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. లక్ష్మీకాంతరావు రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు.

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

Advertisement
Advertisement