పని చేయకుండా ఓట్లెలా అడుగుతారు?

6 Sep, 2020 05:04 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ వైఫల్యాలపై ప్రజలను చైతన్యపరుస్తా.. 

మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: అందమైన అబద్ధాలు చెప్పి ఓట్లు దండుకున్న టీఆర్‌ఎస్‌ నేతలు ఏం మొహం పెట్టుకుని రాబోయే జీహెచ్‌ఎంసీ, వరంగల్, ఖమ్మం ఎన్నికల్లో మళ్లీ ఓట్లు అడుగుతారని మల్కాజ్‌గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మున్సిపల్‌ మంత్రిగా విఫలమైన కేటీఆర్‌కు ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. శనివారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్‌లతో కలసి రేవంత్‌ మాట్లాడారు. గ్రేటర్‌ను ఇస్తాంబుల్‌ చేస్తామని, ట్యాంక్‌ బండ్‌లో నీళ్లను కొబ్బరి నీళ్లు చేస్తామని, లక్ష డబుల్‌ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పి 99 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ గెలిచిందన్నారు.

కానీ, గ్రేటర్‌లో ఇప్పటివరకు కేవలం 128 ఇళ్లు మాత్రమే కట్టారని, డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇవ్వకపోవడం వల్ల కిరాయి రూపంలో పేదలపై రూ.1,200 కోట్ల భారం పడిందని చెప్పారు. హైదరాబాద్‌లో అద్భుతాలు సృష్టించినట్టు కేటీఆర్‌ గొప్పలు చెబుతున్నారని, పేద ప్రజలకు ఉపయోగపడే చోట ఎక్కడా రోడ్లు కూడా వేయలేదని ఎద్దేవా చేశారు. అక్టోబర్‌ 3 నుంచి తన పార్లమెంట్‌ పరిధిలో ‘డివిజన్‌ యాత్ర’చేపడుతున్నానని, టీఆర్‌ఎస్‌ విస్మరించిన హామీలపై ప్రజలను చైతన్య పరుస్తానని రేవంత్‌ చెప్పారు. కుసుమ కుమార్‌ మాట్లాడుతూ అయ్యప్ప సొసైటీలో ప్రజలను భయపెట్టి ఓట్లు దండుకున్నారని విమర్శించారు. ఖమ్మం మేయర్‌ పాపలాల్‌ అవినీతి పరుడని సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేశారని, దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు పాలన చేశారని ఆరోపించారు. పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ వరంగల్‌ పర్యటనలో సీఎం కేసీఆర్‌ ప్రజలకు అనేక హామీలిచ్చారని, కనీసం డబుల్‌ బెడ్రూం ఇళ్లు కూడా ఇవ్వని కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా