ఇండియా కూటమి కొత్త ప్లాన్‌..  బీజేపీ మిత్ర పక్షానికి గాలం! | Sakshi
Sakshi News home page

ఇండియా కూటమి కొత్త ప్లాన్‌..  బీజేపీ మిత్ర పక్షానికి గాలం!

Published Thu, Mar 7 2024 9:50 AM

INDIA Bloc Attempts Coup In Bihar Offers 8 Seats To BJP Ally - Sakshi

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి సరికొత్త ఎత్తులు వేస్తోంది. బీహార్‌లో సీట్ల పంపకాల విషయంలో ఎన్‌డీఏలో తర్జనభర్జనలు కొనసాగుతుండగా ఇండియా కూటమి రాజకీయ చదరంగంలో ఎత్తుగడ వేసింది. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్‌కు బిహార్‌లో ఎనిమిది లోక్‌సభ స్థానాలు, ఉత్తరప్రదేశ్‌లో రెండు స్థానాలను ఆఫర్ చేసినట్లు తెలిసింది.

ఎన్‌డీఏ బీహార్‌లో తమకు కేవలం ఆరు లోక్‌సభ నియోజకవర్గాలను మాత్రమే ఆఫర్‌ చేస్తోంది. ఇవి కూడా తన చిన్నాన్న పశుపతి పరాస్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీతో పంచుకోవాల్సి రావచ్చు. ఇటువంటి పరిస్థితిలో ఇండియా కూటమి నుంచి వచ్చిన ఈ ప్రతిపాదన  పాశ్వాన్‌ను ఊరించవచ్చు. 

చిరాగ్ పాశ్వాన్‌ను ఆకట్టుకునేందుకు 2019లో అవిభాజ్య లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) పోటీ చేసిన మొత్తం ఆరు సీట్లతోపాటు అదనంగా బిహార్‌లో రెండు, ఉత్తరప్రదేశ్‌లో రెండు స్థానాలను ఇండియా కూటమి ఈ డీల్‌లో పొందుపరిచినట్లు సమాచారం.

పార్టీ చీఫ్, ప్రముఖ నాయకుడు రామ్ విలాస్ పాశ్వాన్ మరణించిన ఏడాది తర్వాత పశుపతి పరాస్ తిరుగుబాటుతో 2021లో లోక్ జనశక్తి పార్టీ చీలిపోయింది. పశుపతి పరాస్ రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌కు సోదరుడు. చిరాగ్ పాశ్వాన్‌కు చిన్నాన్న. 

పరాస్‌కు బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం కేబినెట్ బెర్త్ ఇచ్చినప్పుడు చిరాగ్ పాశ్వాన్ జేడీయూ, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై విమర్శలు చేశారు. అయితే బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీని మాత్రం పళ్లెత్తు మాట కూడా అనలేదు. నితీష్‌ కుమార్‌తో విభేదాల కారణంగా 2020లో ఎన్‌డీఏ నుండి వైదొలిగిన చిరాగ్ పాశ్వాన్ మళ్లీ గతేడాది తిరిగి ఎన్‌డీఏలో చేరారు.

Advertisement
Advertisement