తమ్ముళ్ల తిరుగుబాటు | Sakshi
Sakshi News home page

తమ్ముళ్ల తిరుగుబాటు

Published Wed, Mar 27 2024 5:34 AM

Jana Sena leaders are angry at TDPs behavior - Sakshi

అవనిగడ్డ సీటు మండలి బుద్ధప్రసాద్‌కు ఇవ్వకపోవడంతో నిరసన 

పార్టీ పదవులకు 30 మంది నియోజకవర్గ టీడీపీ నేతల రాజీనామా 

మంగళగిరి పార్టీ కార్యాలయానికి రాజీనామా లేఖలు 

పెందుర్తిలో పంచకర్లకు బండారు అనుచరుల సహాయ నిరాకరణ

టీడీపీ తీరుపై జనసేన నేతల ఆగ్రహం

అవనిగడ్డ/పెందుర్తి/పెద్దతిప్పసముద్రం/ఒంగోలు: రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థు­లకు తెలుగుదేశం పార్టీ నాయకులనుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. ఎన్నో ఏళ్లుగా సీటుపై ఆశలు పెంచుకుని పార్టీ కార్యక్రమాలకోసం డబ్బు తగలేసుకుని, కష్టకాలంలో జెండా మోస్తే తీరా ఎన్నికలు వచ్చేసరికి పొత్తులో భాగంగా వేరొకరికి ఇస్తామంటే ఎందుకు సహకరించాలని వారు నిలదీస్తున్నారు. అక్కడ టికెట్‌ దక్కించుకున్నవారికి సహక­రించేది లేదని తేల్చిచెబుతున్నారు. కృష్ణాజిల్లా అవనిగడ్డలోనైతే ఒక అడుగు ముందుకేసి 30మంది నాయకులు తమ పార్టీ పదవులకు ఏకంగా రాజీ­నామా చేస్తూ ఆ లేఖలను పార్టీ అధిష్టానానికి పంపించారు.

కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు  అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. శాసన సభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌కు అక్కడి టికెట్‌ కేటాయించక పోవడాన్ని నిరసిస్తూ 30 మంది పార్టీ నాయకులు తమ పదవులకు మంగళవారం రాజీనామా చేసి, ఆ లేఖలను మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి పంపించారు. నియోజకవర్గంలో గెలిచే సత్తా బుద్ధప్రసాద్‌కే ఉందని, పొత్తుని పక్కన పెట్టి ఆయనకే ఇవ్వాలని వారు పట్టుబడుతున్నారు. పొత్తులో భాగంగా ఈ సీటును జనసేనకు కేటాయించారనీ, కనీసం నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న ఆయనకు కనీసం టికెట్‌ గురించి సమాచారం కూడా ఇవ్వకపోవడంపై వారు మండిపడుతున్నారు.

రాజీనామా చేసిన వారిలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు, అవనిగడ్డ మండల పార్టీ అధ్యక్షుడు యాసం చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి కర్రా సుధాకర్, అశ్వరావుపాలెం సర్పంచ్‌ పండ్రాజు లంకమ్మ ప్రసాద్, తెలుగు మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు బండే కనకదుర్గ, క్లస్టర్‌ ఇన్‌చార్జి బండే రాఘవ, మాజీ ఉపసర్పంచ్‌లు ఘంటసాల కన్నయ్య, అడపా శ్రీనివాసరావు తదితరులున్నారు.కాగా పొత్తు ధర్మం పాటిస్తామంటూనే టీడీపీ నాయకులు రాజీనామాలు చేస్తూ బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడటంపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

బండారుకు అన్యాయంపై రగులుతున్న కేడర్‌ 
40 ఏళ్లుగా టీడీపీ జెండాను మోస్తూ పార్టీ మనుగడకోసం పాటుపడిన బండారు సత్యనారాయణమూర్తిని కాదని ఎక్కడి నుంచో పార్టీలు మారుతూ వచ్చిన వ్యక్తికి పెందుర్తి టికెట్‌ ఇస్తారా అంటూ అనకాపల్లి జిల్లా పెందుర్తి టీడీపీ కేడర్‌ మండిపడుతోంది. టీడీపీ నుంచి జనసేనకు ఓట్లు ట్రాన్స్‌ఫర్‌ అవ్వాలంటే అక్కడి జనసేన అభ్యర్థి పంచకర్ల తలకిందులుగా తపస్సు చేయాలంటూ వ్యాఖ్యానిస్తు­న్నారు. అయితే దానికి ప్రతిగా జనసేన నాయకులు పొత్తు ధర్మం ప్రకారం జనసేనకు సహకరించడం న్యాయ­మని భావిస్తున్నాం.

తామేమీ టీడీపీ నాయకుల ఓట్ల మీద ఆధారపడి పోటీ చేయడం లేదని సమాధానమిస్తున్నారు. మొత్తమ్మీద పెందుర్తిలో కూటమి వికటిస్తున్నట్టే కనిపిస్తోంది. రాజకీయంగా చిరకాల ప్రత్యర్థులైన బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్‌బాబు కలసి పనిచేయడం ఇక కల్లే అని అక్కడి నాయకులు అభిప్రాయపడుతున్నారు. పొత్తు ధర్మంలో జనసేనకే టికెట్‌ ఇవ్వవలసి వస్తే టి.శివశంకర్‌కు టికెట్‌ ఇవ్వాలని, పంచకర్లకు వద్దని మొదటినుంచీ చెబుతున్నారు. కానీ వారి డిమాండ్‌ను జనసేన అధినేత పట్టించుకోకపోవడాన్ని వారు అవమానంగా భావిస్తున్నారు.  

తంబళ్ళపల్లిలో జయచంద్రారెడ్డికి చుక్కెదురు 
అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లి నియోజకవర్గ జనసేన, టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి జయచంద్రారెడ్డికి ఎన్నికల ప్రచారంలో చుక్కెదురైంది. సోమ­వారం రాత్రి ఆయన మండలంలోని బూర్లపల్లి పంచాయతీ కొత్తపల్లిలో ఇంటింటా తిరిగి ఎన్నికల్లో తనకు ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంలో ఇదే గ్రామానికి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు  జయచంద్రారెడ్డిని వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే జి.శంకర్‌కు మద్దతుగా జై శంకర్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో జయచంద్రరెడ్డి తీవ్ర అసహనానికి లోనై వెను తిరిగారు.

గిద్దలూరు జనసేనకుఇవ్వాల్సిందే
ఒంగోలు జిల్లా గిద్దలూరు సీటు జనసేనకు కేటాయించాల్సిందేనని ఆ పార్టీ నాయకుడు, కాపు సంఘం జిల్లా అ«ధ్యక్షుడు ఆమంచి స్వాములు డిమాండ్‌ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కాపు కల్యాణమండపంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 30 శాతం కాపు జనాభా ఉన్నారని, వైఎస్సార్‌సీపీ 31 సీట్లు ఇస్తే కనీసం అన్ని సీట్లు కూడా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రకటించకపోవడం బాధ కలిగిస్తుందన్నారు. తెనాలిలో జనసేనకు కేటాయించినా అది కాపు సామాజిక వర్గం కాదన్నారు. గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కాపులకు కూటమి టికెట్‌ కేటాయించలేదని, ఈ నేపథ్యంలో గిద్దలూరు సీటును జనసేనకు కేటాయించాల్సిందేనన్నారు.
 
ఈ విషయంలో చంద్రబాబు పునరాలోచన చేయాల్సిందే అన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గ కాపు సంఘం నాయకులు కొండపల్లి వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ కూటమి మనసు మార్చుకుని గిద్దలూరు టికెట్‌ను జనసేనకు కేటాయించకపోతే కాపులు బలంగా ఉన్న ప్రతి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సమావేశంలో జి.వెంకటేశ్వర్లు(కొండపి), బి.బ్రహ్మయ్య(అద్దంకి), ఆర్‌.శ్రీనివాసరావు(పర్చూరు) తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement